బుధవారం 08 ఏప్రిల్ 2020
Gadwal - Jan 26, 2020 , 04:14:12

కారుదే జోరు

కారుదే జోరు


మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాలతో టీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటింది. మొత్తం 17 మున్సిపాలిటీలకు గాను ఎనిమిది చోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఏడు చోట్ల హంగ్‌ వచ్చే అవకాశాలుడగా.. వడ్డేపల్లిలో కాంగ్రెస్‌, కొల్లాపూర్‌లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ మెజార్టీ సీట్లు తెచ్చుకున్నాయి. అయితే ఎక్స్‌ అఫీషియో మెంబర్లుగా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నందున హంగ్‌ వచ్చిన చోట టీఆర్‌ఎస్‌ పార్టీ చక్రం తిప్పనున్నది. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు సైతం అధికార పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశం ఉన్నందున అధికార పార్టీ గ్రాఫ్‌ మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికైన కౌన్సిలర్లు జారిపోకుండా ఉండేందుకు అన్ని పార్టీలు క్యాంపు రాజకీయాలు ప్రారంభించాయి. గెలిచిన కౌన్సిలర్లను క్యాంపుల్లో ఉంచి కాపాడుకుంటున్నాయి. పార్టీలన్నీ స్వతంత్ర అభ్యర్థుల  వైపు చూస్తున్నాయి. పలుచోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్లు దక్కక రెబెల్స్‌గా వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన వారంతా సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఉమ్మడి జిల్లాలో ఒక్క వడ్డేపల్లి మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను కైవసం చేసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

ఆధిక్యం టీఆర్‌ఎస్‌దే..

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 17 మున్సిపాలిటీల పరిధిలో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. స్పష్టమైన మెజార్టీ వచ్చిన స్థానాల్లో మినహా మిగతా స్థానాల్లో మాత్రం అన్ని పార్టీలు క్యాంపులు మొదలుపెట్టాయి. ఉమ్మడి జిల్లాలో అత్యధిక మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకున్నది. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆలంపూర్‌, గద్వాల మున్సిపాలిటీలను స్పష్టమైన మెజార్టీతో టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకున్నది. నారాయణపేట, కల్వకుర్తి, కోస్గిలో రెబెల్స్‌తో కలిపి మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకున్నది. ఇక కొల్లాపూర్‌, అయిజలో టీఆర్‌ఎస్‌ పార్టీ కంటే ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. అయిజలో 20 స్థానాలకు గాను 10 ఫార్వర్డ్‌ బ్లాక్‌కు, 6 టీఆర్‌ఎస్‌కు వచ్చాయి. కొల్లాపూర్‌లో 20స్థానాలకు గాను ఫార్వర్డ్‌ బ్లాక్‌కు 11, టీఆర్‌ఎస్‌కు 9 స్థానాలు వచ్చాయి. ఈ రెండు స్థానాల్లో కూడా అధికారం టీఆర్‌ఎస్‌ పార్టీకే ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే రెబెల్స్‌తో పార్టీ అధిష్ఠానం చర్చించినట్లు సమాచారం. మక్తల్‌, అమరచింత, భూత్పూర్‌లో హంగ్‌ వచ్చే అవకాశాలున్నాయి. వడ్డేపల్లి స్థానంలో మాత్రమే టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురుగాలి వీచింది. స్థానికంగా పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు అసంతృప్తితో ఇతరులకు మద్దతు ఇవ్వడం వల్లే ఇక్కడ ఓటమి తప్పలేదు.

క్యాంపు రాజకీయాలు

కౌంటింగ్‌ పూర్తయిందో లేదో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని అన్నిచోట్ల ఇదే పరిస్థితి. ముఖ్యంగా నేనా.. నీవా అన్నట్లు ఉన్నచోట క్యాంపులు ఎక్కువగా ఉన్నాయి. భూత్పూర్‌లో 10 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌, బీజేపీ చెరో 4 స్థానాల్లో విజయం సాధించారు. ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే కాంగ్రెస్‌కు చెందిన ఓ మహిళా కౌన్సిలర్‌ను బీజేపీ నేతలు కౌంటింగ్‌ సెంటర్‌ నుంచే బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వనపర్తి జిల్లాలోని అమరచింతలో గందరగోళం రాజ్యమేలుతోంది. అక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. 10 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 3 స్థానాలను కైవసం చేసుకుని అగ్రస్థానం వహించింది. మిగతా వాటిలో సీపీఎం 2 స్థానాల్లో గెలిచింది. బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, ఇండిపెండెంట్‌ చెరో స్థానాల్లో విజయం సాధించారు. ఇక్కడ అందరూ కీలకపాత్రే వహించే అవకాశం ఉంది. అందుకే ఎవరికి వారే క్యాంపుల్లోకి వెళ్లిపోయారు. మక్తల్‌, కోస్గిల్లోనూ క్యాంపు రాజకీయాలున్నాయి. ఇక గద్వాలలో 37 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ 19 స్థానాలు కైవసం చేసుకోగా.. 4 టీఆర్‌ఎస్‌ రెబెల్‌ అభ్యర్థులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఆ పార్టీ బలం మరింతగా పెరిగింది. అయినా క్యాంపు మాత్రం తప్పనిసరి అయింది. మహబూబ్‌నగర్‌లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించినా క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. అయిజకు చెందిన ఫార్వర్డ్‌ బ్లాక్‌ (టీఆర్‌ఎస్‌ రెబెల్‌) అభ్యర్థులు తిరుమల్‌రెడ్డితో పాటు హైదరాబాద్‌ చేరుకున్నట్లు సమాచారం.logo