బుధవారం 01 ఏప్రిల్ 2020
Gadwal - Jan 25, 2020 , 00:55:51

గెలుపు లాంఛనమే..

గెలుపు లాంఛనమే..
  • - మున్సి‘పోల్స్‌'లో గులాబీ గుబాళింపే..
  • -17 బల్దియాల్లో పాగా వేసే అవకాశం
  • - నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
  • -సంబురాలకు సిద్ధంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గ్రామ పంచాయతీలు, అసెంబ్లీ, పార్లమెంట్‌, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌.. ఇలా ఎన్నికలు ఏవైనా ఫలితం మాత్రం టీఆర్‌ఎస్‌ పార్టీ వైపే. గతేడాది నుంచి జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన అభ్యర్థులే విజయం సాధించారు. ఏ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలు కనీసం టీఆర్‌ఎస్‌ పార్టీని నిలువరించలేకపోయాయి. అనైతిక పొత్తులకు దిగినా కూడా ఫలితాలు మాత్రం కారు వైపే ఉన్నాయి. తాజాగా ఈ నెల 22న జరిగిన మున్సిపల్‌ పోలింగ్‌ ఫలితాలు నేడు రానున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని 17 మున్సిపాలిటీల్లోనూ మరోసారి కారుదే జోరు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ సర్కారు చేస్తోన్న అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. అందుకే ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల్లో అన్ని స్థానాల్లో పోటీ పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీలకు కనీసం అభ్యర్థులు కూడా దొరకలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికలు మా ప్రాణానికి వచ్చాయిరా నాయనా అని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉండబోతోందో అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

దూసుకుపోతున్న కారు

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ జోరును ప్రదర్శించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధించిన గులాబీ పార్టీ ఈ ఎన్నికల్లోనూ అదే రీతిన సత్తా చాటనుందని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 17 మున్సిపాలిటీల్లో అన్నింటినీ కైవసం చేసుకునే సత్తా ఉందని పేర్కొంటున్నారు. 338 వార్డులకు గాను నాలుగు వార్డులు ఏకగ్రీవం కాగా.. వాటిని టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకున్నది. ఇక మిగిలిన 334 వార్డులకు గాను కాంగ్రెస్‌, బీజేపీలకు చాలా చోట్ల అభ్యర్థులు లభించలేదు. టీఆర్‌ఎస్‌ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, ఎమ్మెల్సీలతో ప్రచారం చేస్తుంటే.. కనీసం ఓ ఎమ్మెల్యే కూడా లేక ప్రతిపక్షాల ప్రచారం బోసిపోయింది. మరోవైపు బీజేపీ 55 వార్డుల్లో, కాంగ్రెస్‌కు 45 వార్డుల్లో అభ్యర్థులే లేరంటే వారు ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం అయ్యారో అర్థం చేసుకోవచ్చు. అయితే మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు మాత్రం నాలుగు వార్డుల్లో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అభ్యర్థులు కూడా లభించని పరిస్థితుల్లో కాంగ్రెస్‌, బీజేపీలు అయోమయం చెందాయి. ప్రతిపక్షాలు ఢీలా పడితే కారు మాత్రం దూసుకుపోయింది. సాంకేతిక కారణాల వల్ల భూత్పూర్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరనకు గురవ్వడం మినహా ఆ పార్టీకి ఎలాంటి ఇబ్బంది కనిపించలేదు. ప్రతిపక్షాల తరఫున ప్రచారం చేసేందుకు జిల్లాలో కనీసం ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా లేని పరిస్థితి. కనీసం ఓ జెడ్పీ చైర్‌ పర్సన్‌ పదవి కూడా లేదు. దీంతో ప్రతిపక్షాల ప్రచారం పెద్దగా ఆకట్టుకోలేదు. వారు చెప్పేది వినేందుకు జనం కూడా స్పందించని పరిస్థితి కనిపించింది.

అన్నింటా కారుదే హవా

17 మున్సిపాలిటీల్లోనూ కారు హవా కనిపించింది. కొన్ని చోట్ల పోటాపోటీగా ఉందని ప్రచారం వినిపించినా.. అలాంటి పరిస్థితేమీ లేదని టీఆర్‌ఎస్‌ నాయకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎక్స్‌ అఫీషియో సభ్యుల ఓట్లను వినియోగించుకునేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధం అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీల బలం టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉంది. ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్షాలకు ఎక్కువ స్థానాలు వచ్చినా.. అక్కడ ఎక్స్‌ అఫీషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి. టీఆర్‌ఎస్‌ తరఫున ఎక్స్‌ అఫీషియో సభ్యుల బలం 17 కాగా.. ప్రతిపక్షాల తరఫున ఒక్క బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రామచందర్‌రావు మాత్రమే ఉన్నారు. అయితే ఎక్స్‌ అఫీషియో సభ్యుల అవసరం లేకుండానే విజయం సాధిస్తామనే ధీమా ఆ పార్టీ నేతల్లో బలంగా వినిపిస్తోంది. అందుకే శనివారం ఫలితాలు వెలువడగానే సంబరాలకు సిద్ధంగా ఉన్నారు.

టీఆర్‌ఎస్‌ దూకుడు.. ప్రతిపక్షాలు డీలా..!

ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీల పరిధిలో టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడుగా ప్రచారం నిర్వహించింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన  పథకాలను ప్రజలకు వివరించి మున్సిపాలిటీలోనూ అవకాశం కల్పించాలని కోరింది. పథకాలనే ప్రచారాస్ర్తాలుగా మార్చుకుని గులాబీ నేతలు ఇంటింటికీ చేరువయ్యారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలకు ప్రజలు సైతం బ్రహ్మరథం పట్టారు. 14వ తేదీన ఉపసంహరణలు పూర్తయి.. అభ్యర్థులు ఎవరో తేలిపోయిన మరుక్షణం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ పక్కా వ్యూహంతో ప్రచారంలోకి దిగింది. అప్పటికే సిద్ధం చేసుకున్న ప్రణాళిక మేరకు ప్రతిపక్షాలు ఇంకా రంగంలోకి దిగకముందే టీఆర్‌ఎస్‌ నేతలు, అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోయారు. ముందే దిశానిర్దేశం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం వెంటనే కార్యక్షేత్రంలోకి దిగి ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ తమ మున్సిపాలిటీలు మాత్రమే కాకుండాఉమ్మడి జిల్లా పరిధిలోని ఇతర చోట్ల ప్రచారం నిర్వహించారు. అయితే ప్రతిపక్షాల పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా మారింది. వారికి ఉమ్మడి జిల్లాలో కనీసం ఓ ఎంపీ, ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి. వారికి ప్రచారం నిర్వహించేందకు కొంచెం హంగామా కూడా కనిపించలేదు. ఇక మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీలో ప్రతిపక్షాలు పూర్తిగా ఢీలా పడ్డాయి. 49 వార్డులకు గాను ఓ వార్డును అధికార పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోగా.. బీజేపీ కేవలం 36 వార్డుల్లో, కాంగ్రెస్‌ 40 వార్డుల్లో మాత్రమే పోటీ చేశాయి. పెబ్బేరులో బీజేపీ 12 స్థానాలకు గాను కేవలం 6 స్థానాల్లో మాత్రమే పోటీ చేశాయి. గద్వాలలో 37 స్థానాలకు గాను కాంగ్రెస్‌ కేవలం 25 స్థానాల్లో మాత్రమే పోటీ చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అయిజలో 20 స్థానాలకు గాను బీజేపీ 15చోట్ల, వడ్డేపల్లిలో 10 స్థానాలకు గాను 6చోట్ల, 10కి గాను 6 చోట్ల మాత్రమే పోటీ చేశాయి. కల్వకుర్తిలో 22 స్థానాలకు గాను బీజేపీ 17 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. వనపర్తిలో 5వ వార్డు టీఆర్‌ఎస్‌ పార్టీకి ఏకగ్రీవమైంది. వనపర్తిలో మిగిలిన 32 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ పార్టీ అన్నిచోట్ల పోటీ చేస్తే.. కాంగ్రెస్‌ 27, బీజేపీ 26 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను దింపింది. చాలా చోట్ల బలహీనమైన ప్రత్యర్థులు ఉండటంతో అధికార పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరుమీద నడకే అని అంతా భావిస్తున్నారు. ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బండ ప్రకాష్‌, విప్‌లు దామోదర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, పార్టీ ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్యనేతలు అంతా ఒక్కటై ప్రచారంలో విస్తృతంగా పాల్గొనటం సైతం టీఆర్‌ఎస్‌ పార్టీకి కలిసి వచ్చిందంటున్నారు. ప్రతిపక్షాలకు అభ్యర్థులు కూడా దొరకకపోవడం చూస్తే పోటీ ఎలా ఉందో అర్థం అవుతున్నది. టీఆర్‌ఎస్‌ పార్టీకి పలుచోట్ల సొంత పార్టీ నుంచి పోటీ చేసిన రెబల్స్‌ వల్లే ఇబ్బంది ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని పురాలను టీఆర్‌ఎస్‌ ఏకపక్షంగా కైవసం చేసుకుంటుందని చెప్పేందుకు ఇవన్నీ ఉదాహరణలుగా భావిస్తున్నారు.logo
>>>>>>