శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Gadwal - Jan 25, 2020 , 00:51:44

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు
  • - ఒకే రౌండ్‌లోనే మున్సిపాలిటీ ఫలితాల ప్రకటన
  • -ఫలితాల ప్రకటన బాధ్యత ఆర్‌వోలదే
  • -ప్రతి బ్యాలెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి
  • -జిల్లా అసిస్టెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి,ఆర్డీవో రాములు
  • -కౌంటింగ్‌ ఆర్‌వోలు, సూపర్‌వైజర్లతో సమావేశం

అయిజ : అయిజ మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అసిస్టెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో రాములు ఆర్‌వోలు, సూపర్‌వైజర్లను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో కౌంటింగ్‌ ఆర్‌వోలు, సూపర్‌వైజర్లతో శనివారం జరుగనున్న కౌంటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ను ఖచ్చితంగా ప్రారంభించాలన్నారు. సూపర్‌ వైజర్లు, ఆర్‌వోలు, సిబ్బంది ఉదయం 6 గంటలకే కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకో వాలన్నారు. అయిజ మున్సిపాలిటీలో 20 వార్డులకు  20 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్‌ రూంను తెరువాలన్నారు. పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన బ్యాలెట్‌ పెట్టెను సంబంధిత టేబుల్‌ వద్దకు తీసుకురావాలన్నారు. ఓట్ల లెక్కింపునకు ప్రతి టేబుల్‌ వద్ద ఒక పర్యవేక్షకుడు, ఇద్దరు సహాయకులు ఉంటారన్నారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లను లెక్కించాలన్నారు. అనంతరం మొదటి బ్యాలెట్‌ బాక్స్‌ను అభ్యర్థులు, ఏజెంట్ల పర్యవేక్షణలో సీల్‌ తీయాలన్నారు. బ్యాలెట్‌ బాక్స్‌లోని బ్యాలెట్‌ పేపర్లను 25 పేపర్లకు కట్టలు కట్టాలన్నారు. రెండు దశల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టాలన్నారు. మొదటిది ప్రాథమిక దశ ( గుర్తుల వారీగా ఓట్ల లెక్కింపు)గా నిర్దేశించడమైందన్నారు. ఓట్ల లెక్కింపు, బ్యాలెట్‌ పేపర్ల పర్య వేక్షణ మొత్తం ఆర్‌వోలదేనన్నారు. ఫలితాల ప్రకటన ఆర్‌వోలే చేయాలన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లకు అనుమానాలు ఉంటే ఆర్‌వోకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. ఆర్‌వో అది పరిశీలించి తగు నిర్ణయం తీసుకుని లిఖిత పూర్వకంగా అందజేయాలన్నారు. ఈ సమావేశంలో కమిషనర్‌ యాదగిరి, ఎంపీడీవో రమణరావు, సూపరింటెండెంట్‌ సాయిప్రకాశ్‌, ఆర్‌వోలు, సూపర్‌వైజర్లు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

logo