ఆదివారం 29 మార్చి 2020
Gadwal - Jan 24, 2020 , 04:51:38

అర్ధరాత్రి అనంతలోకాలకు..

అర్ధరాత్రి అనంతలోకాలకు..


గద్వాల అర్బన్ : జిల్లా కేంద్రంలో వ్యక్తిగత పనులు ముగించుకొని కారులో తిరుగు ప్రయాణమైన స్నేహితులు తమ ఇళ్లకు చేరకుండానే అనంతలోకాలకు పయనమయ్యారు. అర్ధరాత్రి ప్రయాణం చేయడంతో నిద్రమత్తులో ఉన్న వారికి చెరుకు లోడ్ ఉన్న ట్రాక్టర్ మృత్యువు రూపంలో ఎదురవడంతో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన ఎర్రవల్లి శివారులోని దెయ్యాలవాగు సమీపంలోని గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృత్యువాత పడగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి గద్వాల టౌన్ సీఐ జక్కుల హనుమంతు తెలిపిన వివరాల మేరకు... జిల్లాలోని అలంపూర్ మండలం లింగనవాయి గ్రామానికి చెందిన అడ్డాకల్ విజయ్ కుమార్, ఉండవెళ్లి మండలం బైరాపురం గ్రామానికి చెందిన సునీల్ కుమార్, గద్వాల మండలం జమ్మిచేడు గ్రామానికి చెందిన పీ కిరణ్, కల్యాణ్ బుధవారం అర్ధరాత్రి 12.30 సమయంలో జిల్లా కేంద్రం నుంచి తమ ఇళ్లకు టీఎస్ 06 ఈసీ 6161 నెంబర్ కలిగిన సిప్ట్ డిజైర్ కారులో బయలుదేరారు.

ఎర్రవల్లి శివారు ప్రాంతంలోని దెయ్యాలవాగు సమీపంలో ఎలాంటి సూచిక బోర్డులు లేకుండా చెరుకు లోడ్ ఉన్న రెండు ట్రాలీల ట్రాక్టర్లను నిలిపారు. వాటిని గమనించని డ్రైవర్ కారును అతివేగంగా నడపడంతో దూసుకొచ్చి చెరుకు ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే అడ్డాకల్ విజయ్ కుమార్(30), కమతం సునీల్ కుమార్(35), పీ కిరణ్(25) మృత్యువాత పడ్డారు. వాహన డ్రైవర్ కల్యాణ్(32)కు తీవ్రగాయలు అయ్యాయి. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన కర్నూల్ తరలించినట్లు స్థానికులు పేర్కొన్నారు. అనంతరం మృతి చెందిన వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎలాంటి సూచిక బోర్డులు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, ముగ్గురి ప్రాణాలను బలిగొన్న ట్రాక్టర్ యాజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సంఘటన జిల్లా ప్రజలను ఓ కుదుపు కుదిపేసింది. విజయ్ కుమార్ భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని అలంపూర్ సీఐ రాజు, కోదండపురం ఎస్సై కృష్ణయ్య పరిశీలించారు.

మృతుల కుటుంబాలను ఓదార్చిన ఎమ్మెల్యే

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల శవాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలోని పోస్టుమార్టం గదిలో భద్రపరిచారు. ఈ ఘటనతో దవాఖానలో మృతుల కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. కుటుంబాన్ని పోషించే పెద్దదిక్కును కోల్పోయామని తమ కుటుంబీకుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. మృతుల కుటుంబ సభ్యులను అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం దవాఖానలో పరామర్శించి ఓదార్చారు. అనంతరం ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ క్రాంతి కుమార్ మాట్లాడి పోస్టుమార్టం తొందరగా పూర్తి చేసి మృతిదేహాలను కుటుంబ సభ్యులకు అందజేయలని సూచించారు. మృతుల కుటుంబ సభ్యులను మాజీ మంత్రి డీకే సమరసింహాహరెడ్డి, టీఆర్ నాయకులు తిరుపతయ్య, పలువురు నాయకులు పరార్శించారు.logo