బుధవారం 01 ఏప్రిల్ 2020
Gadwal - Jan 23, 2020 , 00:57:59

ఉమ్మడి జిల్లాలో అయిజ టాప్‌

ఉమ్మడి జిల్లాలో అయిజ టాప్‌
  • -పాలమూరులో అత్యల్పం
  • -ఓటేసిన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి
  • -పలుచోట్ల చెదురుమదురు ఘటనలు

మహబూబ్‌ నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 17 మున్సిపాలిటీల పరిధిలోని 338 వార్డులకు గానూను 4 వార్డులు ఏకగ్రీవం కాగా.. బుధవారం నాడు 334 వార్డులకు పోలింగ్‌ జరిగింది. 17 పురపాలికల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కాగా... సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. 820 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరుగగా పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్‌ సరళిలో ఐదు జిల్లా కేంద్రాల్లోనూ అతి తక్కువ పోలింగ్‌ శాతం నమోదు కావడం విశేషం.
జిల్లా మంత్రులు నిరంజన్‌ రెడ్డి వనపర్తిలో, శ్రీనివాస్‌ గౌడ్‌ మహబూబ్‌ నగర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటుతోనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని... ప్రజలు కేవలం అభివృద్ధిని చూసి ఓటేశారని మంత్రులు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా అయిజలో 87.6 శాతం పోలింగ్‌ నమోదవ్వగా... అత్యల్పంగా మహబూబ్‌ నగర్‌లో 67.21 శాతం మాత్రమే నమోదైంది. వృద్ధులు, దివ్యాంగులు సైతం ఓటేసేందుకు ఉత్సాహంగా కదిలి వచ్చారు. అయితే మహబూబ్‌ నగర్‌ పట్టణంలోని ఓటర్లు ఓటింగ్‌ కోసం తక్కువగా రావడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేలా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయా జిల్లా కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సులను తరలించి భద్రపరిచారు.
చెదురుమదురు

ఘటనలు మినహా..

ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో చెదురు మదురు ఘటనలు మినహా పుర పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. తండాలు, గ్రామాలు కలిసి మున్సిపాలిటీలు ఏర్పడిన చోట ఓటర్ల నుంచి స్పందన చక్కగా ఉంది. కొత్త మున్సిపాలిటీల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల తాకిడి ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా అయిజలో 87.6 శాతం పోలింగ్‌ నమోదవ్వగా... అత్యల్పం గా మహబూబ్‌ నగర్‌లో 67.17శాతం మాత్రమే నమోదైంది. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా స్థానిక సెలవును ప్రకటించడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులుగా ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలోనే అతి పెద్ద మున్సిపాలిటీ అయిన మహబూబ్‌ నగర్‌లో ఓటింగ్‌ శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది సెలవులు తీసుకున్నా ఓటేసేందుకు రాలేదని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో మహబూబ్‌ నగర్‌లో 70.4 శాతం పోలింగ్‌ నమోదవ్వగా... ఈసారి అది 67.21 వద్దే ఆగి పోయింది. వార్డుల సంఖ్య పెరిగింది. తండాలు, గ్రామాలు సైతం మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. పోలింగ్‌ కేంద్రాలను కూడా పెంచారు. అయినప్పటికీ గతం కంటే 3.19 శాతం పోలింగ్‌ తక్కువగా నమోదైంది. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని గంజిపేటలో ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎంఐఎం నేతలు, కాంగ్రెస్‌ నేతల మధ్య గొడవ జరిగింది. పోలీసులు లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. కొత్తకోటలోని ఓ పోలింగ్‌ బూత్‌లోకి ఎలాంటి అనుమతి లేకుండా కాంగ్రెస్‌ పార్టీ నేత ఒకరు వెళ్లడంపై స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు.

వనపర్తిలో నిరంజన్‌ రెడ్డి, మహబూబ్‌ నగర్‌లో శ్రీనివాస్‌ గౌడ్‌

వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఉన్న 23వ వార్డుకు సంబంధించిన పోలింగ్‌ బూత్‌లో నిరంజన్‌ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్‌ నగర్‌ పట్టణం లోని శ్రీనివాస కాలనీలోని 6వ వార్డులోని పద్మాలయ స్కూల్‌లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కు వినియో గించుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు వారి వారి మున్సిపాలిటీల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటేసే అవకాశం లభించడంతో అభివృద్ధి వైపు ఓటర్లు మొగ్గు చూపినట్లు మంత్రులు తెలిపారు. అభివృద్ధికి పట్టం కట్టినట్లు మంత్రులు స్పష్టం చేశారు.

logo
>>>>>>