శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Gadwal - Jan 21, 2020 , 01:42:00

టీఆర్‌ఎస్‌తోనే బల్దియాలో ప్రగతి

టీఆర్‌ఎస్‌తోనే  బల్దియాలో ప్రగతి
  • - కేసీఆర్‌ సారథ్యంలోనే బంగారు తెలంగాణకు బాటలు
  • - ఇంటింటి ప్రచారంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుతోనే గద్వాల పురపాలకలో సంపూర్ణ ప్రగతి సాధ్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పురపాలక ఎన్నికల ప్రచారం చివరి రోజున పురపాలక చైర్మన్‌ అభ్యర్థి బీఎస్‌ కేశవ్‌తో కలిసి 2, 4, 5, 19 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించగా ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పురపాలక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు 24 గంటల ఉచిత విద్యుత్‌, సాగునీటి వనరులు, శాంతి భద్రతలు వంటి అన్ని రంగాల్లో గద్వాల అభివృద్ధిపరంగా ముందుకు సాగుతుందని తెలిపారు. అభివృద్ధి విషయంలో కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు భరోసాగా నిలిచారని స్పష్టం చేశారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ గద్వాల పురపాలక అభివృద్ధికి భారీ ప్రణాళిక రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గద్వాల అభివృద్ధిని గత పాలకులు విస్మరించడం వల్లే అభివృద్ధిలో వెనుకబడి పోయిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రజలు ఓటు వేస్తే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంది.. ఇక్కడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా తానున్నానని.. టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను ఆశీర్వదిస్తే పురపాలక సంఘం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే ఓటర్లకు సూచించారు. ప్రతిపక్ష అభ్యర్థులకు ఓటు వేస్తే పురపాలక అభివృద్ధి మరో పదేళ్లు వెనక్కు వెళ్తుందన్నారు.

 అభివృద్ధి చేసే టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేస్తారో ఉన్మాద పార్టీలకు ఓటు వేస్తారో పురప్రజలు నిర్ణయించుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు. ఉన్మాద పార్టీలకు శాశ్వతంగా సమాధి కట్టే అవకాశం ఈ పురపాలక ఎన్నికల్లో లభించిందని ఆ పార్టీలకు ప్రజలు బుద్దిచెప్పాలన్నారు. 22న జరిగే పురపాలక ఎన్నికల్లో 37వార్డుల్లో బలపర్చిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరా రు. గద్వాల పురపాలక సంఘంలో గులాబీ జెండా ఎగురవేయడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చైర్మన్‌గా గెలిస్తే గద్వాల పురపాలకలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు వార్డుల్లో ప్రజలకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చుతామని ఆయన వెల్లడించారు. కొత్తగా పురపాలకలో కలిసిన జమ్మిచేడ్‌, వెంకటోనిపల్లి గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తనదని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తానని ఎమ్మెల్యే తెలిపారు. చివరి రోజు ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే జిల్లా కేంద్రంలో కార్యకర్తలు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రచారంలో అభ్యర్థులు పుష్పావతి, సతీశ్‌కుమార్‌, ద్వారకరాణి, సంతోష్‌తో పాటు ఎంపీపీలు ప్రతాప్‌గౌడ్‌, విజయ్‌కుమార్‌, జెడ్పీటీసీ రాజశేఖర్‌, జిల్లా రైతు సమన్వయసమితి అధ్యక్షులు చెన్నయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు కోడిగుడ్ల సలాం, రమేశ్‌నాయుడు, సుభాన్‌, జంబురామన్‌గౌడ్‌, దామోదర్‌రెడ్డి, యూసుఫ్‌, సర్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు.logo