శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Jan 20, 2020 , 01:57:28

జోరుగా.. హుషారు గా..

జోరుగా.. హుషారు గా..

జిల్లాలోని నాలుగు బల్దియాల్లో ఎన్నికల ప్రచారం విస్తృతంగా కొనసాగుతున్నది. నాయకులు జోరుగా.. హుషారుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో మున్సిపాలిటీల్లో ఎన్నికల పండుగ కొనసాగుతున్నది. ఆదివారం రాత్రి గద్వాల మున్సిపాలిటీలో తేరు మైదానంలో మహిళా ఆశీర్వాద సభ నిర్వహించగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర రైతు సమస్వయ అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి హాజరై మాట్లాడారు.   గద్వాలను స్మార్ట్‌ సిటీగా చేస్తామని చెబుతున్న బీజేపీ నాయకుల కల్లబొలి మాటలు ప్రజలు నమ్మవద్దని.. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం గులాబీ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు గద్వాల మున్సిపాలిటీ  పలు వార్డుల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అలాగే  జెడ్పీచైర్‌పర్సన్‌ సరిత  వడ్డేపల్లి మున్సిపాలిటీలో, అలంపూర్‌ ఎమ్మెల్యే వీఎం అబ్రహం అయిజ మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించారు.
-జోగుళాంబ గద్వాల  జిల్లా ప్రతినిధి /
గద్వాల నమస్తే తెలంగాణ/అయిజ/ వడ్డేపల్లి

భూత్పూర్‌: జిల్లా కేంద్రానికి ముఖ ద్వారంగా.. నాలుగురోడ్ల కూడలిలో ఉన్న జాతీయ రహదారి పక్కనే ఉన్న గ్రామం నాటి బుద్దాపురమే నేటి భూత్పూర్‌. కాకతీయులకు సామంతరాజుగా ఉన్న ఆయన కుమార్తె కుప్పాంబికా తండ్రి పేరున బుద్దాపురం గ్రామాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతున్నది. ఇందుకు నిదర్శనం గ్రామంలో రామలింగేశ్వరస్వామి ఆలయం, ఊరచెరువు నిర్మాణాలు. బుద్దాపురంను రజకార్ల కాలంలో భూత్పూర్‌గా మార్చడం జరిగింది. నాటి నుంచి 1956లో భూత్పూర్‌ గ్రామ పంచాయతీగా ఏర్పడింది. గతమెంతో పేరొందిన బుద్దాపురం కొంతకాలంగా వెనుకబాటు తనంతో మరుగునపడిందని కొందరు చెబుతున్నారు. ఏడుగురు సర్పంచ్‌లు గ్రామాన్ని పాలించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి భూత్పూర్‌ మండలం అన్నాసాగర్‌ వ్యక్తి, స్థానికుడు కావడంతో భూత్పూర్‌ రూపురేఖలను మార్చాలనే సంకల్పంతో భూత్పూర్‌లో అమిస్తాపూర్‌ గ్రామాల పరిధిలోని గ్రామాలను, తండాలను కలుపుతూ మున్నిపాలిటీగా ఏర్పాటు చేశారు. దీన్ని త్వరితగతినా అభివృద్ధి పరచాలనే సంకల్పంతో మంత్రి కేటీఆర్‌ను సంప్రదించి రూ.20కోట్లను మంజూరు చేయించారు.

మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు

భూత్పూర్‌తోపాటు గోప్లాపూర్‌, శేరిపల్లి(బీ), నర్సింగాపూర్‌, మీఠ్యాతండా, భగవాన్‌తండా, వాల్యతండా, నర్సింగాపూర్‌తండా, బొట్లగడ్డతండా, గుబ్బడితండా, నక్కలబండతండా, పిల్లిగుండుతండా, అమిస్తాపూర్‌ పరిధిలోని సారికటౌన్‌షిప్‌, సిద్దాయపల్లి, రాందాస్‌తండా, నల్లగుట్టతండా, వసూరాంతండా, గెగ్యతండాలను కలుపుతూ 10వార్డులతో మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. మొదటిసారిగా పురపోరుకు ఎన్నికలు జరుగనున్నాయి.

ఎండు మిర్చికి ప్రత్యేకం

మున్సిపాలిటీ కేంద్రంలో ప్రతి ఆదివారం కూరగాయల సంత జరుగుతున్నది. ఈ సంతలో ఎండు మిరపకాయలకు ప్రసిద్ధి. 20 ఏండ్ల క్రితం రూ.4వేల వేలంతో ప్రారంభమైన సంత ఇప్పుడు దాదాపు రూ.12లక్షలకు వెళ్లింది. చుట్టు పక్కల గ్రామాల నుంచి భూత్పూర్‌కు రావడానికి వీలుగా జాతీయ రహదారి ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యాలు మెండుగా ఉన్నాయి.

అభివృద్ధి, రవాణా సౌకర్యం

భూత్పూర్‌కు సమీపంలో దాదాపు కిలోమీటరు దూరంలోనే కొత్తగా కలెక్టరేట్‌ కార్యాలయం నిర్మితమవుతున్నది. అదేవిధంగా భూత్పూర్‌ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ నిర్మాణమవుతున్నది. అంతేకాకుండా మున్సిపాలిటీకి చేరువలోనే జిల్లాలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మతమవుతున్నది. భూత్పూర్‌ అభివృద్ధి చెందేందుకు ఎన్నో రకాల సౌకర్యాలు ఉన్నాయి. గ్రామీణ వాతావరణం కంటే పట్టణ వాతావరణం ఇక్కడి ప్రజలకు అలవాటైంది. భూత్పూర్‌ మీదుగానే రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపూర్‌, కడప, చిత్తూరు, బెంగళూరు తదితర రాష్టాలైన తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వెళ్లేందుకు వీలుగా రవాణా సౌకర్యం కలదు.

ఆధ్యాత్మిక నిలయం

మున్సిపాలిటీ కేంద్రంలో జాతీయ రహదారి పక్కనే ఏటా పాల్గుణ మాసంలో మునిరంగస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ జాతరకు జిల్లాలోని నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అదేవిధంగా మున్సిపల్‌ పరిధిలో సాయిబాబా మందిరం పేరుగాంచింది. ప్రతి గురువారం భక్తులు పెద్ద ఎత్తున పూజలో పాల్గొంటారు. నిత్య పూజలతోపాటు వాహన పూజలు కూడా జరిపిస్తారు.
logo