సోమవారం 06 ఏప్రిల్ 2020
Gadwal - Jan 18, 2020 , 01:12:13

వడ్డేపలి కేరాఫ్‌ శాంతినగర్‌

వడ్డేపలి కేరాఫ్‌ శాంతినగర్‌


వడ్డేపల్లి : మొదటిసారిగా వడ్డేపల్లి మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగనున్నాయి. 1981లో వడ్డేపల్లి పంచాయతీగా ఏర్పాటయింది. మొట్టమొదటి సర్పంచ్‌గా బొజ్జన్న ఎంపికయ్యారు. అనంతరం వడ్డేపల్లి శ్రీనివాసులు, సాయిబాబా, వేదవతి సర్పంచ్‌లుగా పనిచేశారు. అయితే 18ఏండ్లు సర్పంచ్‌గా, జెడ్పీటీసీగా, ఎంపీపీగా పనిచేసిన రికార్డు  వడ్డేపల్లి శ్రీనివాసులుకు ఉన్నది. వడ్డేపల్లి మండల కేంద్రంగా శాంతినగర్‌ ఏర్పాటైయింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్‌గ్రేడ్‌ చేసిన మున్సిపాలిటీల్లో వడ్డేపల్లి మండల కేంద్రాన్ని మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. దీంతో మొదటిసారిగా పురపోరుకు రంగం సిద్ధమయింది. మున్సిపాలిటీలో 9,575మంది ఓటర్లు ఉండగా మహిళలు 4,830, పురుషులు 4,745 ఓటర్లు ఉన్నారు. అందులో ఎస్టీ మహిళలు 66, పురుషులు 49, ఎస్సీ మహిళలు 921, పురుషులు 944, బీసీ మహిళలు 3,215, పురుషులు 3,113 మంది ఉన్నారు. వాటిలో  ఎస్టీ 1, ఎస్టీ మహిళ 0, ఎస్సీ 1, ఎస్సీ మహిళ 1,బీసీ 1, బీసీ మహిళ 1, జనరల్‌ మహిళ 3, జనరల్‌ 2 స్థానాలు కేటాయించారు.

అందుబాటులో విద్యాలయాలు

వడ్డేపల్లిలో పాలిటెక్నిక్‌ కళాశాల, కస్తూర్బా పాఠశాల, కళాశాల, శాంతినగర్‌లో డిగ్రీ కళాశాల, జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల, ప్రైవేటు ఐటీఐ కళాశాల, డైట్‌, బీఈడీ, ఇంటర్‌ కళాశాలలు ఉన్నాయి. బాలుర ఎస్సీ హాస్టల్‌ కలదు. విద్యార్థులకు ముఖ్యంగా అమ్మాయిలు దూరప్రాంతాలకు వెళ్లకుండా విద్యను అభ్యసించేందుకు అనువుగా ఏర్పాటు చేశారు. దూరప్రాంతాల వారు వడ్డేపల్లిలో విద్యను అభ్యసిస్తున్నారు. విశాలమైన స్థలంలో పోలీస్‌స్టేషన్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సర్కిల్‌ కార్యాలయాలు, టెలిఫోన్‌ ఎక్సైంజ్‌, మహిళా సమాఖ్య, తాసీల్దార్‌, ఎంపీడీవో, ఎంఈవో, పశువైద్యశాల కార్యాలయాలు, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఉన్నది.

గొర్రెల సంతకు ప్రసిద్ధి

ప్రతి శుక్రవారం శాంతినగర్‌లో సంత జరుగుతుంది. సంతకు 50 గ్రామాల ప్రజలు వచ్చి కూరగాయలు, గొర్రెలు, కోళ్లు, వ్యవసాయ పనిముట్లు విక్రయిస్తుంటారు. గొర్రెల సంతకు నాలుగు రాష్ర్టాల నుంచి వ్యాపారస్తులు, కొనుగోలుదారులు క్రయవిక్రయాలు జరుపుతారు.

విదేశాల్లో స్థిరపడిన శాంతినగర్‌ వాసులు

50 ఏండ్ల క్రితం వడ్డేపల్లి గ్రామానికి కృష్ణా, గుంటూరు, వరంగల్‌, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన వారు శాంతినగర్‌ అనే నామకరణం చేశారు.  స్థానికులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు 475కు పైగా కుటుంబాలు శాంతినగర్‌లో నివసిస్తున్నారు. అందులో 100 మందికి పైగా ఉన్నత చదువులు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. సుమారు 13 జిల్లాల నుంచి వలసొచ్చి స్థిరపడిన వారు ఉన్నారు. ప్రధాన వృత్తి వ్యవసాయమే కావడంతో తుమ్మిళ్ల లిఫ్ట్‌ ఏర్పాటు వల్ల వారి భూములు సస్యశ్యామలమయ్యాయి. సాగునీటి ఇబ్బందులు లిఫ్ట్‌ వల్ల తీరాయని, మూడు రిజర్వాయర్లు పూర్తయితే సాగునీటికి శాశ్వత పరిష్కారం లభించినట్టేనని విదేశాల్లో ఉన్న శాంతినగర్‌ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆలయాలకు ప్రసిద్ధి

వడ్డేపల్లి మున్సిపాలిటీలో వడ్డేపల్లి గట్టుపై మాధవస్వామి ఆలయం, దత్తాత్రేయ స్వామి, రామాలయం, వాసవీ మాత ఆలయం, ఆంజనేయస్వామి, రాధాశ్యాం ఆశ్రమం, ఆదినారాయణ స్వామి, ఓం శాంతి వారి ఆశ్రమాలు ఉన్నాయి. పైపాడులో వీరబ్రహంగారి జాతర, ఎడ్లపందెలు జరుగుతాయి. కళాకారులకు వడ్డేపల్లి పుట్టినిల్లు, నాటక ప్రదర్శనలు జరుగుతాయి. అంబేద్కర్‌, ఐలమ్మ విగ్రహాలు ఉన్నాయి.
logo