శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Jan 13, 2020 , 01:19:51

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


అలంపూర్‌, నమస్తే తెలంగాణ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఢిల్లీలో టీఆర్‌ఎస్‌  అధికార ప్రతినిధి మంద జగన్నాథం అన్నారు. ఆదివారం అలంపూర్‌ జోగుళాంబ ఆలయ దర్శనం అనంతరం తెలంగాణ హరిత టూరిజం హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపారన్నారు. కేటీఆర్‌ నాయకత్వంలో ఐటీ రంగంలో అభివృద్ధి సుముఖత చూపుతూ పెట్టుబడులు పెట్టడానికి ఇతర రాష్ర్టాలు, దేశాలు ముందుకు వస్తున్నాయన్నారు.

అలంపూర్‌ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి ..

సీఎం కేసీఆర్‌కు అలంపూర్‌ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి ఉంచారన్నారు. గతంలో కృష్ణ పుష్కరాల సమయంలో సీఎం అలంపూర్‌ క్షేత్రంలో కుటుంబ సమేతంగా నిద్ర చేసి పుష్కరాలను ప్రారంభించారన్నారు. గతంలో మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావుల సహకారంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల మంజూరి చేయించానన్నారు. రెండో విడత పనులు పూర్తైతే ఆర్డీఎస్‌కు పూర్వవైభవం వస్తుందన్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు అలంపూర్‌ నియోజకవర్గానికి వంద పడకల దవాఖాన మంజూరైందన్నారు. అలంపూర్‌ ఆలయాల అభివృద్ధి కోసం కేంద్ర పురావస్తు శాఖ అధికారులతో చర్చించి ప్రణాళికలు రూపొందింస్తున్నట్టు ఆయన తెలిపారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌, ఉండవల్లి మండల పార్టీ కార్యదర్శి ఏకాంత్‌, అలంపూర్‌ మాజీ సర్పంచ్‌ పిండి జయరాముడు, శ్రీకాంత్‌గౌడ్‌, అమరవాయి రఘు తదితరులు ఉన్నారు.

ఆలయాలను దర్శించుకున్న
ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి
పట్టణంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ఆదివారం  మంద జగన్నాథం దర్శించుకున్నారు. అంతకుముందు వారికి ఆలయాధికారులు ఆలయ అర్చకులతో కలిసి పూర్ణకుంభ  స్వాగతం పలికారు. స్వామివారి, అమ్మవారి ఆలయాల్లో వారు  ప్రత్యేకపూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు వారిని శేష వస్ర్తాలతో సత్కరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. వారితో పాటు పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌, జయరాముడు, శ్రీకాంత్‌గౌడ్‌, ఏకాంత్‌, అమరవాయి రఘు తదితరులు ఉన్నారు.

నేటి ప్రజావాణి రద్దు

గద్వాల, నమస్తే తెలంగాణ: జిల్లాలోని అధికారులు అందరూ పురపాలక ఎన్నికల్లో నిమగ్నమై ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణితో పాటు డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామొహంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల అనంతరం యథావిధిగా ప్రజావాణి, డయల్‌ యువర్‌ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని ఆమె కోరారు.


logo