ఆదివారం 29 మార్చి 2020
Gadwal - Jan 12, 2020 , 02:12:51

ప్రతి జీపీలో హరితహారానికి 10శాతం నిధులు ఖర్చు చేయాలి

ప్రతి జీపీలో హరితహారానికి 10శాతం నిధులు ఖర్చు చేయాలి


గద్వాల, నమస్తే తెలంగాణ: జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీలో హరితహారానికి 10శాతం నిధులు ఖర్చుచేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామొహంతి స్పష్టం చేశారు. గద్వాల మండలంలోని ముల్కల్‌పల్లి, తెలుగోనిపల్లి గ్రామాల్లో పల్లెప్రగతి పనులను ఆమె శనివారం పరిశీలించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు కంచె ఏర్పాటు చేయకపోవడంతో పంచాయతీ కార్యదర్శిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జీపీ నిధుల నుంచి 10శాతం నిధులు దేనికి ఖర్చు చేశారని, కనీసం ట్రీ గార్డులు ఎందుకు కొనలేదని ఆమె కార్యదర్శిని ప్రశ్నించారు. ట్రాక్టర్‌, ట్రాలీ, వాటర్‌ ట్యాంకర్‌ కొన్నారా అని అడిగి తెలుసుకున్నారు. పాత ప్లాస్టిక్‌ వాటర్‌ ట్యాంక్‌ ఉన్నందువల్ల ట్యాంకర్‌ కొనలేదని సర్పంచ్‌ చెప్పగా స్పందించిన ఇన్‌చార్జి కలెక్టర్‌ జీపీకి తప్పనిసరిగా ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌, ముందుభాగం బ్లేడ్‌ కొనాలని ఇదివరకే చెప్పినా ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు చేసేలా నోటీసులు జారీ చేయాలని డీపీవో కృష్ణను ఆదేశించారు. నర్సరీ విషయంలో బ్యాగులు రాలేదని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సమాధానమివ్వడంతో జనవరి చివరి లోపు నర్సరీ ఏర్పాటుచేయకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. మొక్కల బ్యాగ్‌లో వాడే మట్టి నాణ్యతగా ఉండాలని ఆమె సూచించారు. అనంతరం 2020కు సంబంధించి గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెలుగోనిపల్లి నర్సరీని పరిశీలించి ఫెన్సింగ్‌ సరిగా వేసి చెట్లను బాగా పెంచాలని అక్కడి అధికారులకు సూచించారు. ఆమె వెంట తాసిల్దార్‌ మంజుల, ఎంపీడీవో చెన్నయ్య తదితరులు ఉన్నారు.

తిమ్మాపూర్‌లో..

ఎర్రవల్లి చౌరస్తా: పల్లెప్రగతిలో భాగంగా శనివారం ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామొహంతి తిమ్మాపుర్‌ గ్రామాంలో పల్లెప్రగతి పనులను పరిశిలించారు. ఈ సందర్భంగా నర్సరీని పరిశీలించి మొక్కల బ్యాగుల్లో వాడుతున్న మట్టి నాణ్యతగా ఉండాలని సూచించారు. వాటిలో కంకరమట్టి  నింపటంవల్ల  మొక్కలు సరిగ్గా ఎదగవన్నారు. గత సంవత్సరం నర్సరీ చేసిన బిల్లులు రాలేదని సిబ్బంది కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా, ఆగష్టు 23 వరకు అప్‌లోడ్‌ చేసిన అన్ని మెటీరియల్‌ పేమెంట్‌ అయ్యాయని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సకాలంలో అప్‌లోడ్‌  చేయకపోవటం వల్లే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆమె వెల్లడించారు. అనంతరం తిమ్మాపుర్‌ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఆమె మొక్కలు నాటారు.  కార్యక్రమంలో నాగేశ్వరి, శివుడు, ఉపసర్పంచ్‌ రాధ, పంచాయతీ కార్యదర్శి చంద్రకళ, స్పెషల్‌ ఆఫీసర్‌ మౌనిక, శంకర్‌నాయుడు, రాము, గ్రామసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


logo