గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Jan 08, 2020 , 14:46:47

అవనిపై హరివిల్లు

అవనిపై హరివిల్లు

మహబూబ్‌నగర్ నమస్తే తెలంగాణ బృందం : ముత్యాల ముగ్గుల పోటీలు మన సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబంగా నిలుస్తాయి. నేటి ఆధునిక ప్రపంచంలో నాటి మధుర స్మృతులను పదిలంగా ఉంచేందుకు పురాతన ముగ్గులను గుర్తుచేసుకునేందుకు నమస్తే తెలంగాణ దినపత్రిక ఏటా ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నది. ఈ తరుణంలో సావరిన్ ఎస్టేట్స్, మల్టీ ట్రెడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ డిగ్రీ కళాశాల మైదానంలో ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, సావరిన్ ఎస్టేట్స్, మల్టీ ట్రెడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కోదండపాణి, ఆదర్మ డిగ్రీ, పీజీ కళాశాల చైర్మన్ రాములు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మహిళలు అందమైన రంగవల్లులతో ఇంద్ర ధనస్సును తలపించేలా ముగ్గులు వేసేందుకు ఉత్సాహం కనబరిచారు. ఈ పోటీలకు మహిళలు అధిక సంఖ్యలో తరలొచ్చారు.

ముందు తరాలకు అందించేందుకే ముగ్గుల పోటీలు

ప్రతి ఏటా నమస్తే తెలంగాణ ముగ్గుల పోటీలను ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందని నమస్తే తెలంగాణ దినపత్రిక మహబూబ్‌నగర్ యూనిట్ బ్రాంచ్ మేనేజర్, బ్యూరో ఇంచార్జి పెద్ది విజయ్‌భాస్కర్ అన్నారు. సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించేందుకుగాను అడిగిన వెంటనే సావరిన్ ఎస్టేట్స్ మల్టీ ట్రెడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కోదండపాణి సహకారం అందించడం గొప్ప విషయమన్నారు. ముగ్గుల పోటీల నిర్వహణ వల్ల భవిష్యత్ తరాలకు చుక్కల ముగ్గులతోపాటు సంస్కృతీ సాంప్రదాయాల మధ్య సంక్రాంతి వేడుకలు ఇలా జరుగుతాయనే సందేశం నేటి యువతరం అందించడం జరుగుతుందని తెలిపారు. తీరికలేని సమయంలో ఉండి కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి హాజరుకావడం సంతోషదాయకమన్నారు. ముగ్గుల పోటీల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

సందేశాత్మకంగా రంగవల్లులు

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని నమస్తే తెలంగాణ నిర్వహించిన ముత్యాల ముగ్గులు పలు ప్రత్యేకతలను చాటిచెప్పాయి. నేటి సమాజంలో జరుగుతున్న చెడు పోకడలను దూరం చేసుకుని మంచి మార్గాల వైపు అడుగులు వేయాలంటూ పలువురు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. మరింతమంది యువత వేసిన ముగ్గుల్లో తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి.. చదవితే నమస్తే తెలంగాణ చదవాలి అంటూ ముగ్గులు వేయడం జరిగింది. సేవ్‌చైల్డ్-సేవ్‌గల్ల్స్ చైల్డ్, పూరాతన బోరుబావులు మూయించండి.. చిన్నారుల ప్రాణాలను కాపాడండి అంటూ ప్రత్యేకతంగా అందరినీ అలోచింపజేసేలా మహిళలు, యువత ముగ్గులు వేశారు. మహిళలు పలు అంశాలను తెలియజేస్తూ ముగ్గులు వేసి తమ భావాలను తెలియజేయడం ఎంతోమంది దృష్టిని ఆ ముగ్గుల వైపు మళ్లించడం జరిగింది.

విజేతలకు బహుమతుల ప్రదానం

ముత్యాల ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన పేర్లను ఎక్సైజ్ శా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కార్యక్రమంలో ప్రకటించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, సావరిన్ ఎస్టేట్స్ మల్టీ ట్రెడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కోదండపాణి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి పొందిన శ్రీ లక్ష్మీకి రూ.10వేల నగదు, మెమోంటో, ద్వితీయ బహుమతి శుభాంగినికి రూ.8వేల నగదు, మెమోంటోతోపాటు బహుమతిని అందజేశారు. తృతీయ బహుమతి పొందిన పీ లక్ష్మీకి రూ.5వేల నగదు, మెమోంటో అందజేశారు. కన్సోలేషన్ బహుమతులు పొందిన పుష్పలత, గౌతమి, అనిత, మానసకు రూ.వెయ్యి నగదుతోపాటు బహుమతులు అందజేశారు. అదేవిధంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న 52 మంది మహిళలకు చిరు కానుకలను సావరిన్ ఎస్టేట్స్ మల్టీ ట్రెడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కోదండపాణి, నమస్తే తెలంగాణ బ్రాంచ్‌మేనేజర్, బ్యూరో ఇంచార్జి పెద్ది విజయ్‌భాస్కర్ అందజేశారు. ఈ ముత్యాల ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డీఎస్‌వో వనజాత, పీఈటీలు ఉమ, అరుణజ్యోతి వ్యవహరించారు.

అలరించిన నృత్యాలు

నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో సావరిన్ ఎస్టేట్స్ సౌజన్యంతో నిర్వహించిన ముగ్గుల పోటీల సందర్భంగా విద్యార్థినులు, యువతులు, మహిళలు బతుకమ్మ, సాంస్కృతికకు సంబంధించిన ప్రత్యేక గీతాలకు నృత్యాలు చేశారు. ముఖ్యంగా యువతులు చేసిన నృత్యాలు కార్యక్రమానికి హాజరైన మహిళలతోపాటు ప్రముఖులను ఆకట్టుకోవడం జరిగింది. విద్యార్థిని మహేశ్వరి నృత్యాన్ని గుర్తించి నమస్తే తెలంగాణ బ్యూరో ఇంచిర్జి విజయభాస్కర్ ప్రత్యేక బహుమతిని అందజేసి అభినందించారు. మున్ముందు మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆదర్శ డిగ్రీ కళాశాల చైర్మన్ రాములు, ప్రిన్సిపల్ వేణుమధు, నమస్తే తెలంగాణ అసిస్టెంట్ మేనేజర్ విజయ్‌కుమార్‌రెడ్డి, సర్క్యూలేషన్ మేనేజర్ జగన్, ఆర్‌సీ ఇంచార్జి జిల్లెల రఘు, సబ్ ఎడిటర్లు అర్జున్, అకౌంటెంట్ రాజు, హెచ్‌ఆర్. గౌరిశంకర్, రిపోర్టర్లు పగిడ్యాల శ్రీనివాస్, సతీశ్, గోపాల్, పాషా, శ్రీనివాస్, అడ్వటైజ్‌మెంట్ కిశోర్, విజయ్, శివలింగం తదితరులు పాల్గొన్నారు.


logo