e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home జోగులాంబ(గద్వాల్) మహిళల ఆర్థికవృద్ధికి చేయూత

మహిళల ఆర్థికవృద్ధికి చేయూత

  • స్వయం ఉపాధికి రుణాల మంజూరు
  • వనపర్తి జిల్లాకు రూ.54.58కోట్లు
  • రుణ ప్రణాళికను రూపొందించిన యంత్రాంగం

వనపర్తి, ఆగస్టు4: స్వయం సహాయక సంఘాల మహిళల అభ్యున్నతికి స్త్రీ నిధి ద్వారా ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళలకు స్త్రీ నిధి ద్వారా వ్యాపార నిర్వహణ, నైపుణ్యాల పెంపు శిక్షణతో పాటు స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నది. అందుబాటులోని వనరులు ఉపయోగించుకుని మహిళా సంఘాల సభ్యులు వ్యాపారంలో రాణించేలా చేయడం, ఇప్పటికే వ్యాపారం నిర్వహిస్తున్న వారికి విస్తరణకు రుణ సదుపాయం కల్పిస్తున్నారు. వనపర్తి జిల్లాలో మొత్తం 429 గ్రామ సంఘాలు, 10,290 గ్రామ సహకార సంఘాలు, 40 పట్టణ సమాఖ్య సంఘాలు ఉన్నాయి.

పాడిగేదెలు
సభ్యుల్లో నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ తెగలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. గ్రేడెడ్‌ ముర్రా గేదె లేదా సంకర జాతి ఆవుకు రూ.75వేల వరకు రుణాన్ని పొందొచ్చు. పశువులకు బీమా కల్పించుటకు, రవాణాకు రూ.3వేలు, రెండు నెలలకు అయ్యే దాణా, మేత ఖర్చు అన్ని కలిపి రూ.93వేల వరకు రుణ సదుపాయం ఉంటుంది. మొదటి పాడి పశువు కొన్న 6నెలల తరువాత రెండో పాడి పశువు కొనుగోలుకు రుణాన్ని పొందొచ్చు. గ్రామ సంఘాల్లో ఏ,బీ,సీ గ్రూపుల్లో సభ్యులై ఉండాలి.

- Advertisement -

పౌల్ట్రీ ఫాం
పౌల్ట్రీ ఫాంలో దేశీ కోడి పిల్లలను ఉత్పత్తి చేయాలి. ఒక్కో యూనిట్‌కు కావాల్సిన డబ్బులను మంజూరు చేస్తారు. మదర్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉత్పత్తి అయిన వాటిని మండలాల్లో పట్టణాల్లో ఆసక్తి ఉన్న మహిళలు పెరటికోళ్లుగా పెంచుకుంటారు. ఒక్కో యూనిట్‌కు రూ.20 నుంచి రూ.30వేల వరకు రుణాలను అందిస్తారు.

ఎల్రక్ట్రికల్‌ (ఈ) ఆటోలు
సంఘాలకు ఎలక్ట్రికల్‌ ఆటోల కోసం రుణాన్ని ఇవ్వనున్నారు. బ్యాటరీ సహాయంతో నడిచే ఈ ఆటోల ద్వారా కాలుష్యం తగ్గుతుంది. అందుకే వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ యూనిట్‌కు రూ.2లక్షల వరకు రుణాన్ని అందిస్తారు.

పశుబీమా మంజూరు
స్త్రీనిధి నుంచి పొందిన అప్పుతో పశువును కొనుగోలు చేసిన వెంటనే ట్యాగ్‌ వేసి ఆ వివరాలను అప్‌లోడ్‌ చేయాలి. ఒకవేళ పశువు మరణిస్తే ట్యాగ్‌ కనిపించే విధంగా ఫొటోలు తీయాలి. చనిపోయిన పశువు ఫొటోలు టాబ్లెట్‌ పీసీలో నమోదు చేయాలి. ఇన్సురెన్సు పాలసీ కాలంలో పశువు మరణిస్తే క్లెయిమ్‌ మంజూరు చేస్తారు.

వ్యవసాయ పరికరాలు
వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేసి అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు. ఈ రుణాలు మండల సమాఖ్యలకు మాత్రమే ఇవ్వనున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.15లక్షల నుంచి రూ.25లక్షల వరకు రుణాలను ఇస్తారు. పరికరాలను మాత్రం జిల్లా కమిటీ కొనుగోలు చేస్తుంది.

సంఘాల వివరాలు వెబ్‌సైట్‌లో…
స్వయం సహాయక సంఘాల సభ్యుల వివరాలు స్త్రీ నిధి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ చేశారు. దీనికి సీయూజీ సెల్‌ఫోన్‌ సౌకర్యం కల్పించారు. ఈ స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు మండల, గ్రామాల, పట్టణ సమాఖ్యలకు వేర్వేరుగా ఐడీ నెంబర్లు కేటాయిస్తారు. వీటిని స్త్రీ నిధి బ్యాంకు వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ చేస్తారు. స్త్రీనిధి బ్యాంకుకు ఎవరైతే రుణం కోసం దరఖాస్తు చేసుకుంటారో వారి నగదు నిల్వ ఇతర వివరాలు ్రస్త్రీ నిధి బ్యాంకు వెబ్‌సైట్‌లో కనిపిస్తాయి. నిర్ణయించిన వాయిదాల ప్రకారం రుణాలు పొందిన సభ్యులు సంఘం సమావేశంలో వాయిదాను చెల్లించాలి. సమాఖ్యల సమావేశం నాటికి సభ్యులు వసూలు కావాల్సిన నెలసరి వాయిదా, గత నెల బకాయి వాయిదా ఏదైనా ఉంటే దానికి కలిపి మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు సమాఖ్యల వద్ద ఉన్న టాబ్లెట్‌ పీసీలో స్త్రీనిధి డీసీబీ రిపోర్టులో ప్రతినెలా చూసి నిర్ధారించుకోవాలి.

సద్వినియోగం చేసుకోవాలి
స్త్రీ నిధి రుణాలను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి. దరఖాస్తుకు, డ్యాకుమెంట్లకు ఎలాంటి సర్వీస్‌ చార్జీలు ఉండవు. గత ఆర్థిక సంవత్సరం రూ.58.29 కోట్ల స్త్రీ నిధి రుణాలను మంజూరు చేశాం. ఈ సంవత్సరం రూ .54.58 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను రూపొందించాం.

  • గిరి దేశపాక, స్త్రీ నిధి జిల్లా మేనేజర్‌ ,వనపర్తి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana