మంగళవారం 07 జూలై 2020
Food - Mar 12, 2020 , 20:28:09

హాయిగా నిదురపో .. ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా

హాయిగా నిదురపో .. ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా

( ఈ నెల 13న ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా..)

‘నిదురపోరా తమ్ముడా.. నిదురలోన గతమునంతా నిముసమైనా మరచిపోరా.. కరుణలేని ఈ జగాన కలతనిదురే మేలురా.. నిదురపోరా తమ్ముడా..’ అంటూ 1955 నాటి ‘సంతానం’ సినిమాలో లతామంగేష్కర్‌ పాడిన పాట ఈనాటికి మనకు అన్వయించుకొనేలా ఉన్నదంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! మారిన జీవనశైలి కారణంగా ఎప్పుడు పడుకొంటున్నామో.. ఎన్ని గంటలు రెప్పవాల్చి శరీరానికి విశ్రాంతినిస్తున్నామో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. భగవంతుడు మనిషికిచ్చిన ముఖ్యమైన వరాల్లో నిద్ర ఒకటి. నిద్ర అనేది శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. మనుషులకే కాదు.. జంతువులు, పక్షుల్లో కూడా కనిపిస్తుంది. పక్కమీద పడుకున్న వారందరు నిద్ర పోయి, దాని ఫలితాన్ని పూర్తిగా పొందుతున్నారా? అన్నది ప్రశ్నార్థకమే. మనిషి ఎదిగిన కొద్దీ... నిద్ర సుఖానికి దూరం అవుతున్నాడు. ఇది ఎన్నో వ్యాధులకు కారణంగా నిలుస్తుంది. 

ఎంత నిద్ర కావాలి?

సామాన్యంగా పెద్దలకంటే పిల్లలకు ఎక్కువ నిద్ర అవసరం. ఇది వారి శారీరక పెరుగుదలకు, మానసిక అభివృద్ధికి ఉపయుక్తంగా ఉంటుంది. ఆరోగ్యవంతుడైన మనిషికి అంటే యవ్వనం నుంచి ప్రౌఢ దశ వరకు సుమారు ఆరు నుంచి ఏడు గంటల నిద్ర అవసరం. చదువుకునే పిల్లలు, ఎక్కువగా ఆటలు ఆడేవారు, వ్యాయామం చేసేవారు, వ్యాధుల నుంచి కోలుకుంటున్నవారి విషయంలో నిద్ర పోయే సమయంలో మార్పు ఉంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు సుమారు 18 గంటలు, 112 నెలలు చిన్నారికి 1418 గంటలు, 13 ఏళ్ల చిన్నారులకు 1215 గంటలు, 35 ఏళ్ల పిల్లలకు 1113 గంటలు, 512 ఏళ్ల వారికి 911 గంటలు, యువకుల్లో 10 గంటలు, పెద్దవారికి 78 గంటలు, గర్భణీలు 8 గంటలకు పైగా నిద్ర అవసరమని వైద్య నిపుణులు సెలవిస్తున్నారు. 


నిద్రతో ఉపయోగాలేంటి!

అనారోగ్యం, శరీరంలో ఏదైనా ఒక భాగంలో నొప్పులు, భారీకాయం వంటి అంశాల కారణంగా కూడా సరిగ్గా నిద్రపట్టదు. వీటికి తోడు మానసిక ఆదుర్దా, అతి ఆలోచనలు కలిగి ఉంటే నిద్రలేమి ఏర్పడుతుంది. ఎంత మంచి నిద్ర ఉంటే అంత బాగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రోగ నిరోధకశక్తిని అభివృద్ధి చేస్తుంది. నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది. హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ సక్రమంగా జరుగుతుంది. 


నిద్ర కొరవడితే..

శరీరం తిరిగి పునరుత్తేజం పొంది మెదడుకు తగినంత విశ్రాంతి లేకపోతే మిగిలిన అవయవాలు సక్రమంగా పనిచేయవు. నిద్ర కొరవడితే.. ఏకాగ్రత దెబ్బతింటుంది. శారీరకంగా పని సామర్ధ్యం తగ్గిపోతుంది. ఆందోళన, చికాకు, భావోద్వేగాలు మారిపోతాయి. ఏకాగ్రతతో చేయాల్సిన పనులపై ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. నిద్రలేమితో గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి రుగ్మతలు వెంటాడుతాయి. అసలే నిద్ర లేకపోతే మానసిక సమస్యలూ తలెత్తవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిద్ర తగ్గితే కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని పలు పరిశోధనల్లో తేలింది. అందుకే మనిషికి కనీస నిద్ర అవసరమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతేనే ఆరోగ్యంగా వుంటారని నిపుణులు సెలవిస్తున్నారు.


స్మార్ట్ఫోన్లతో ప్రమాదం

స్మార్ట్ఫోన్ల వాడం నిత్యజీవితంలో భాగమైపోవడంతో పగలు, రాత్రి తేడా లేకుండా మెసేజ్లు పంపుకోవడం, చాటింగ్‌ చేయడం వంటి పనులతో బిజీగా గడుపుతున్నాం. మొబ్పై గేమ్స్‌ ఆడటం, చాటింగ్‌ చేయడం వల్ల సమయం తెలిసిరాక కంటిపైకి వచ్చిన నిద్ర ఎగిరిపోతుంది. మొబైల్‌ నోటిషికేషన్ల కారణంగా సగటున ప్రతీ ఒక్కరూ గంటన్నర నిద్రను కోల్పోతు న్నారని గణాంకాలు చెప్తున్నాయి. యువత నిద్రలో సగటున కనీసం నాలుగు సార్లు ఫోన్‌, ట్యాబ్లను చూసుకొంటున్నారని తేలింది. సరైన నిద్ర లేకపోవడంతో మెదడు బాగా అలిసిపోతుందని.. ఇదే అలవాటుగా మారడంతో జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె సంబంధ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం కూడా ఉన్నదట. 


ఇవీ పాటించండి..

- బెడ్రూం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.

- బెడ్రూంలో లైట్లు ఆర్పేసి, కిటికీలు మూసివేసి పడుకోవడం అలవర్చుకోవాలి.

- పడుకునే ముందు బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు.

- రాత్రి వేళల్లో ఫాస్ట్‌ ఫుడ్‌, ప్రైడ్‌ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.

- రాత్రిళ్లు పిజ్జాలు, బర్గర్లు, షుగర్‌ క్యాండీస్‌, చాక్లెట్స్‌ తినకూడదు.

- జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలిగించే మాంసాహారం తినకూడదు.

- ఎక్కువ ఫైబర్‌ కలిగివుండే ఉల్లిపాయ, బ్రకోలి, క్యాబేజీ వింటి వెజిటేబుల్స్‌ కూడా తినొద్దు.

- మద్యం, కార్బోనేటెడ్‌ డ్రింక్స్కు దూరంగా ఉండాలి.

- నిద్రకు ఉపక్రమించే ముందు మొబైల్‌ ఫోన్లు స్విచాఫ్‌ చేయాలి. 

- ప్రతీ రోజూ ఒకేవేళకి నిద్రపొవడం అలవాటు చేసుకోవాలి.

- పిల్లల్ని ఖాళీ కడుపుతో పడుకోబెట్టొద్దు.


- రాంచందర్‌ నూగూరిlogo