మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Food - Sep 15, 2020 , 14:14:28

బ‌రువు త‌గ్గాలంటే.. ఆహారాన్ని ఈ టైంలోనే తినాలి!

బ‌రువు త‌గ్గాలంటే.. ఆహారాన్ని ఈ టైంలోనే తినాలి!

బ‌రువు త‌గ్గాలి, బ‌రువు పెర‌గ‌కూడ‌దు అనుకునేవారు ఆహారం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎందుకంటే ఆహారానికి, బ‌రువుకు చాలా ద‌గ్గ‌ర సంబంధం ఉంది. ఎక్కువ కేల‌రీలు ఉన్న ఆహారం తీసుకొని ఖాళీగా ఉంటే బ‌రువు పెర‌గ‌డం ఖాయం. అలా అని టైంకి తిన‌కుండా ఏది దొరికితే అది తిన్నా అంతే ఇక‌. అందుకే ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అది కూడా ఎప్పుడు తీసుకోవాలి అనే విష‌యాలు తెలుసుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌ల‌కు గుర‌వ్వ‌రు.

అల్పాహారం : 

బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తే లేనిపోని స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా అల్పాహారం మాత్రం మిస్ చేయ‌కూడ‌దు. మిస్ చేయ‌డం వ‌ల్ల రాత్రి ఎప్పుడో తిన్న త‌ర్వాత మ‌ళ్లీ మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఉండాల్సి వ‌స్తుంది. మ‌ధ్య‌లో చాలా స‌మ‌యం ఖాళీగా ఉంటారు. అలా ఎప్ప‌టికీ చేయ‌కూడ‌దు. ఉద‌యాన్నే గోరువెచ్చ‌ని నీరు తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి. తాగిన 15 నిమిషాల త‌ర్వాత బ్రేక్‌ఫాస్ట్ తినాలి. అంటే 'రాత్రి 8 కి డిన్న‌ర్ చేస్తే మ‌రుస‌టి ఉద‌యం కూడా 8 కే బ్రేక్‌ఫాస్ట్ తినేలా' చూసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ, ప‌రాఠా, ర‌వ్వ ఉప్మా, సేమియా ఉప్మా, ఊత‌ప్పం, పోహా, మ‌ల్టీగ్రెయిన్ శాండ్విచ్ వంటి వాటిని తింటే మంచిది. ఆయిల్ ఫుడ్‌ను దూరం పెట్టండి. 

మ‌ధ్యాహ్న భోజ‌నం :

ఫాస్ట్‌ఫుడ్, అన్‌హెల్దీ ఫుడ్ తినాల‌నుకుంటే అందుకు లంచ్ టైం ప‌ర్‌ఫెక్ట్‌. ఈ టైంలో ఎంత తిన్నా ఏం తిన్నా బాగా అరుగుతుంది. అలాగే బ‌రువు కూడా పెర‌గ‌రు. కాక‌పోతే ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ 8 కే తింటారు కాబ‌ట్టి మ‌ధ్యాహ్నం 1 నుంచి 2 గంట‌ల‌లోపు ముగించ‌డం బెట‌ర్‌. అప్పుడే రాత్రి స‌మ‌యానికి తిన్న లంచ్ బాగా అరుగుతుంది. ప‌కోడీ, ప‌రాఠా, వెజిట‌బుల్ క‌ర్రీ, చోలే మ‌సాలా, ప‌నీర్ భుర్జీ, రాజ్మా మ‌సాలా, రైతా, సాంబార్‌, పెరుగు, జీరా రైస్ వంటి వాటిని తీసుకుంటే మంచిది. దీంతోపాటు బ‌ట‌ర్‌నాన్‌, స‌మోసా, స్వీట్స్ వంటి వాటిని త‌క్కువ తీసుకోవ‌డం బెట‌ర్‌. 

డిన్న‌ర్ : 

డిన్న‌ర్ అంటే ప‌డుకునే స‌మ‌యానికి రెండు, మూడు గంట‌ల ముందు తినాలి. అంటే సూర్యాస్త‌మయం అయిన రెండు గంట‌ల‌కు తింటే మంచిది. ఓవ‌రాల్‌గా చూస్తే రాత్రిపూట ఎనిమిది గంట‌ల‌కు అలా తింటే ప‌డుకునే స‌మ‌యానికి తిన్న క్యాల‌రీల‌న్నీ ఖ‌ర్చు అయిపోతాయి. డిన్న‌ర్‌గా వెజిట‌బుల్ క‌ర్రీ, ర‌సం, చికెన్‌, ఫిష్‌, పెరుగు, చ‌పాతీ, మ‌జ్జిగ లాంటివి తీసుకుంటే మంచిది. రాత్రి స‌మ‌యంలో ఫాస్ట్‌ఫుడ్, ప‌చ్చ‌డి, పులిహోరా వంటివి తీసుకో‌క‌పోవ‌డం ఇంకా మంచిది. 


logo