చాయ్ తాగేటప్పుడు 'ఆలూ పోహా రోల్' తిని చూడండి.. ఎంత బాగుంటుందంటే!

సాయంత్రం అవ్వగానే నోటిలో చాయ్ పడందే పని జరగదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత ఎనర్జీగా పనిచేశారో అదే ఉత్సహంతో పనిచేయాలో మధ్యలో అప్పుడప్పుడు చాయ్ రుచి చూడాల్సిందే. మరి అదొకటే తింటే కడుపు నిండుతుందా. పోనీ ఏదైనా తిందామంటే బజ్జీలు, పకోడి, గారెలు తప్ప మరేం ఉండవంటారు. అలా ఎందుకు కడుపు మాడ్చుకోవాలి. కాస్త ఓపిగ్గా ఈ ఆలూ పోహా రోల్ ట్రై చేయండి. అలా కాఫీ తాగుతూ క్రిస్పీగా ఉండే ఆలూ పోహా రోల్స్ తింటుంటే ఆహా.. ఆ మజానే వేరు. మరింకెందుకు ఆలస్యం శరీరానికి కావాల్సిన పోషకాలను అందించే ఎన్నో ఇంగ్రీడియంట్స్‌తో ఎలా తయారు చేయాలో ఓ సారి చూసేయండి.
కావాల్సిన పదార్థాలు :
ఉడికించిన ఆలూ : 3
ఉల్లిగడ్డ ముక్కలు : అర కప్పు
క్యాప్సికమ్ ముక్కలు : అర కప్పు
ఉడికించిన మొక్కజొన్న : 2 టేబుల్ స్పూన్స్
తరిగిన కొత్తిమీర : పావు కప్పు
అటుకులు : ఒక కప్పు
పచ్చిమిర్చి : 5
వెల్లుల్లి రెబ్బలు : 5
అల్లం : చిన్న ముక్క
చక్కెర : 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం : 1 టేబుల్‌స్పూన్
కశ్మీరీ డైట్ చిల్లీ పౌడర్ : అర టీస్పూన్
పసుపు : పావు టీస్పూన్
గరం మసాలా : అర టీస్పూన్
చాట్ మసాలా : 1 టీస్పూన్
మామిడి చూర్ణం : 1 టీస్పూన్
కార్న్‌ఫ్లోర్ : 2 టేబుల్ స్పూన్స్
మైదా పిండి : 2 టేబుల్ స్పూన్స్
సేమియా : సరిపడా
నూనె : డీ ఫ్రైకు సరిపడా
ఉప్పు : రుచికి సరిపడా
తయారీ :
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన ఆలూను తురుముకోవాలి. తర్వాత అందులో ఉల్లిముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉడికించిన కార్నా్, తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత అటుకులను నీటితో శుభ్రం చేసి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వత మరొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క తీసుకొని మెత్తగా మిక్సీ పట్టించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఆలూ మిశ్రమంలో కలుపాలి. తర్వాత చక్కెర, నిమ్మరసం వేసుకోవాలి. అలాగే కలర్ కోసం కశ్మీరి రెడ్ చిల్లీ పౌడర్ కూడా జోడించాలి. దీంతోపాటు పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, మామిడి చూర్ణం, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. మిశ్రమం అంతా కలిసిన తర్వాత రోల్ మాదిరిగా చేసుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో కార్న్‌ఫ్లోర్, మైదా తీసుకొని అందులో కొంచెం నీరు జోడించి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఆలూ రోల్స్‌ను ముంచాలి. పక్కనే ఒక ప్లేట్లో సేమియా పెట్టుకొని ఈ రోల్స్‌ను ఆ సేమియా అంటుకునేలా అద్దాలి. ఇలా మొత్తం రోల్స్‌కు కార్న్‌ఫ్లోర్ మిశ్రమం, సేమియా అద్ది పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్‌ను వేడి చేయాలి. తర్వాత రోల్స్‌ను అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక అంతే ఎంతో రుచిగా ఉండే ఆలూ పోహా రోల్స్ రెడీ! వీటిని కెచప్‌తో కలిపి తింటే భలే టేస్టీగా ఉంటుంది.