మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Food - Aug 03, 2020 , 17:53:50

బ్ర‌కోలితో బోలెడు లాభాలు

బ్ర‌కోలితో బోలెడు లాభాలు

ఆరోగ్యంగా ఉండాలంటే బ్ర‌కోలి తినాలంటున్నారు పోష‌కాహార నిపుణులు. ప్రపంచంలో ఆరోగ్యకరమైన కూరగాయల్లో ఒకటిగా పేరు గాంచింది. ఇవి ఒకప్పుడు మార్కెట్లలో దొరికేది కాదు. ఇప్పుడు అన్ని మార్కెట్లలో ల‌భిస్తోంది. బ్రకోలి చూడటానికి కాలీఫ్లవర్ మాదిరిగానే ఉంటుంది. మ‌న వ‌ద్ద పూసా బ్ర‌కోలి, పంజాబ్ బ్ర‌కోలి అనే రెండు ర‌కాలు ఎక్కువ‌గా అందుబాటులో ఉన్నాయి. ఈ కూరగాయను సలాడ్, సూప్స్ గానే కాకుండా కూరగా కూడా త‌యారుచేసుకోవచ్చు. ఉడికించి తినడం ఇంకా మంచిది. కప్పు పరిమాణంలో బ్ర‌కోలి తీసుకుంటే 2.4 గ్రాముల పీచు శరీరానికి అందించినట్లే అని చెప్తున్నారు పోష‌కాహార నిపుణులు.

బ‌్ర‌కోలిలో కాల్షియం, ఫోలేట్, బీటాకెరోటిన్, విటమిన్ సీ, విట‌మిన్ ఈ వంటి పోష‌కాలు అధికంగా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉంచ‌డంలో క్రియాశీల‌కంగా ప‌నిచేస్తుంది. కడుపులో ఉన్న క్రిములను నశింప చేస్తుంది. పేగుల్ని శుభ్ర పరుస్తుంది. జీర్ణ వ్యవస్థను క్రమబద్దీకరించి వ్యర్దాలను బయటకి పంపడానికి తోడ్పడుతుంది. కొవ్వును తగ్గించి శరీరాన్ని తేలికపరిచేందుకు చక్కని ఔషధంలా ప‌నిచేస్తుంది. వీటిలో ల‌భించే యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర ఖనిజాలు ప్రీరాడికల్స్‌ను నివారిస్తాయి. వీటిలో లభించే మెగ్నీషియం, పొటాషియం వంటివి నాడీ వ్యవస్ద మీద బాగా పని చేస్తాయి. తరచుగా బ్రకోలి తినే వారికి సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ యాక్టీవ్ గా పనిచేస్తుంది. వీటిలోని లూటిన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేక రోగాలను అదుపు చేస్తాయి.

బ్రకోలిలో ఉండే గ్లూకోరఫినైన్ అనే పదార్దం చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. చర్మ సమస్యలను నివారించి కాంతివంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది. మతి మరుపుతో బాధపడుతున్న వారికి బ్రకోలి మంచి ఆహారమని వైద్య నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు. ఇందులో ఉండే ఓమేగా 3, యాంటీ అలర్జీ గుణాలు రోగ నిరోధకశక్తిని పెంచడమే కాక అలర్జీల నుంచి శ‌రీరానికి రక్షణ కల్పిస్తుంది. బ్రకోలిలో అధికంగా ఉండే క్యాల్షియం.. ఎముకలు, కండరాల సమస్యలకు దివ్యౌష‌ధంగా ప‌నిచేస్తుంది. బ్ర‌కోలిని డైట్‌లో చేర్చుకోవ‌డం ద్వారా గుండె జ‌బ్బులను చాలా వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చున‌ని, ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను 6 శాతం మేర త‌గ్గిస్తాయ‌ని ఇటీవ‌లి అధ్య‌య‌నంలో శాస్త్రవేత్తలు తేల్చారు. అధిక బ‌రువున్న వారు త‌మ మెనూలో బ్ర‌కోలిని చేర్చుకోవ‌డం ఉత్త‌మం అని సెల‌విస్తున్నారు ఆరోగ్య‌నిపుణులు.


logo