శుక్రవారం 15 జనవరి 2021
Food - Dec 22, 2020 , 18:01:37

క్వినోవా.. ఆరోగ్యప్రదాయిని!

క్వినోవా.. ఆరోగ్యప్రదాయిని!

క్వినోవా.. ఇదేదో కొత్త మాట అని ఆశ్చర్యపోకండి. బార్లీ, ఓట్స్, గోధుమల మాదిరిగానే క్వినోవా కూడా ఓ పంట. పోషకాల గనిగా పేరొందిన ఈ పంట ప్రాధాన్యతను గుర్తించి రెండేండ్ల క్రితం ఐక్యరాజ్య సమితి క్వినోవా ఏడాదిని ప్రకటించింది. లాక్‌డౌన్‌ మనకు ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి మరింత అవగాహన, స్పృహ కలిగించేలా చేసింది. ఈ సమయంలో నేర్చుకున్న ఆరోగ్య పాఠాలకు మరికొన్ని విషయాలను జోడించడం ద్వారా మన ఆరోగ్యాన్ని మరింత కాపాడుకోవచ్చునని గుర్తించాలి. నిత్యం క్వినోవా తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు.

క్వినోవా.. గోధుమ, ఎరుపు, ముదురు గోధుమ, నలుపు, గులాబీ రంగుల్లో పండుతాయి. ఈ ధాన్యాన్ని అమెరికన్లూ యూరోపియన్లూ ఎక్కువగా తింటున్నారు. గోధుమలతో పోలిస్తే క్వినోవాలో ప్రొటీన్ శాతం ఎక్కువ. వీటిల్లో గ్లూటెన్ ఉండదు. దాంతో పిండిపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా వచ్చే ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధ సమస్యలూ తగ్గుముఖం పడతాయి. క్వినోవా అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉన్నందున.. సంపూర్ణత్వ భావనను ప్రేరేపిస్తుంది. కేలరీల వినియోగాన్ని తగ్గించడం ద్వారా బరువు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. వీటిలోని అధిక ప్రోటీన్ కంటెంట్ జీవక్రియను కూడా అనుమతిస్తుంది. బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. పొట్టు తీసిన ఈ ధాన్యాన్ని అన్నం మాదిరిగానే వండుకోవచ్చు. కిచిడీ, పొంగలి, బిర్యానీ, సలాడ్‌, కుకీ, బ్రెడ్‌, బిస్కట్‌... ఇలా ఎన్నో ఆహారపదార్థాలుగా చేసుకోవచ్చు. వీటి గింజలు మూడు, నాలుగు గంటల్లోనే మొలకలు వస్తుండటంతో సలాడ్ల తయారీలో వాడుకోవడం సులభం.

బరువు తగ్గించుకోవడానికి..

రక్తం నుండి కొలెస్ట్రాల్ ను తొలగించడానికి కాలేయాన్ని ఉత్తేజితం చేస్తుంది. భోజనంలో వీటిని తీసుకుంటే.. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దీనిలో ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. 25 శాతం పోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇవేకాకుండా ఓమేగా 3 యాసిడ్స్ కూడా లభిస్తాయి. జిమ్‌లో గంటల తరబడి వ్యాయామం చేసేవారు క్వినోవాను తినడం వల్ల ఫైబర్‌ కంటెంట్‌ కారణంగా బరువు తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. అల్పాహారంలో కూడా క్వినోవాను తీసుకోవచ్చు. క్వీనోవాలో ఉండే విటమిన్ బీ, బీ3, బీ 12, ఇతర పోషకాలు.. చర్మంలో డార్క్ మెలనిన్‌ను తగ్గించి వయసుతో పాటు వచ్చే చర్మ సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. నిత్యం క్వినోవా తినేవారిలో క్యాన్సర్‌ కారకాలు రాకుండా ఉంటాయని పలు పరిశోధనల్లో తేలింది. మధుమేహంతో బాధపడుతున్నవారు నిత్యం క్వినోవా తీసుకోడం ఎంతో ఉత్తమం.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.