మంగళవారం 26 జనవరి 2021
Food - Sep 05, 2020 , 16:33:16

పైనాపిల్ ప‌చ్చ‌డి తింటే.. ఇమ్యూనిటీ వ‌చ్చి చేరాల్సిందే!

పైనాపిల్ ప‌చ్చ‌డి తింటే..  ఇమ్యూనిటీ వ‌చ్చి చేరాల్సిందే!

భార‌తీయుల‌కు ప‌చ్చ‌డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప‌చ్చ‌డి లేనిదే వీరికి ముద్ద దిగ‌దు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు మామిడిపండుతో త‌ప్ప మ‌రే పండుతో ప‌చ్చ‌డి చేసి ఉండ‌రేమో. ఎందుకంటే పండ్లు అన‌గానే తియ్యగా ఉంటాయి. అవి ప‌చ్చ‌డికి ఏం బాగుంటుంది అనుకుంటారు. కానీ ఆరోగ్యాన్నిచ్చే పండ్ల‌తోనే ప‌చ్చ‌డి  చేసుకొని తింటే రుచితోపాటు శ‌రీరానికి కావాల్సిన పోష‌కాల‌న్నీ అందుతాయి. అందులో పైనాపిల్ ప్ర‌ధానం. దీంతో గ‌నుక ఒక‌సారి ప‌చ్చ‌డి చేసుకొని తింటే ఇక వ‌దిలిపెట్ట‌రు. మ‌రి పైనాపిల్ ప‌చ్చ‌డి ఎలా త‌యారు చేసుకోవాలో ఓసారి తెలుసుకోండి.

ప‌చ్చ‌డికి కావాల్సిన ప‌దార్థాలు :

క‌ట్ చేసిన పైనాపిల్ : ఒక‌టి

టెంప‌రింగ్ కోసం :

శ‌న‌గ‌ప‌ప్పు : 2 టీస్పూన్లు

మిన‌ప‌ప‌ప్పు : 2 టీస్పూన్లు

మెంతులు :  పావు టీస్పూన్‌

ప‌సుపు :  చిటికెడు

క‌రివేపాకు :  గుప్పెడు

వంట‌కు కావాల్సిన‌వి :

కొబ్బ‌రి పొడి :  పావు క‌ప్పు

కొబ్బ‌రి తురుము :  పావు క‌ప్పు

చింత‌పండు : 5 గ్రా.

బెల్లం పొడి :  2 టీస్పూన్స్‌

ఎండు మిర‌ప‌కాయ‌లు : 8

ఆవాలు : ఒక టీస్పూన్‌

నూనె : ఒక టీస్పూన్‌

ఉప్పు :  రుచికి స‌రిప‌డా

త‌యారీ : 

ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో క‌ట్ చేసిన పైనాపిల్ ముక్క‌లు, కొంచెం నీరు పోసి 15 నిమిషాల పాటు ఉడికించాలి. త‌ర్వాత మ‌రొక బౌల్ తీసుకోవాలి. అందులో శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప‌ప్పు, మెంతులు వేసి దోర‌గా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన‌ త‌ర్వాత ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి. ఈ ప‌ప్పుల‌న్నింటినీ మిక్సీ జార్‌లో వేయాలి. వీటితోపాటు కొబ్బ‌రి పొడి, కొబ్బ‌రి తురుము, నాన‌బెట్టిన చింత‌పండు వేసి మిక్సీ ప‌ట్టించాలి. దీన్ని మెత్త‌ని గుజ్జులా చేసుకోవాలి. పేస్ట్ చేసిన త‌ర్వాత మ‌రో ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఇంగువ‌, క‌రివేపాకు, ఆవాలు వేసి పోపు పెట్టాలి. పోపు వేగిన త‌ర్వాత పైనాపిల్ మిశ్ర‌మం వేయాలి. ఇప్పుడు దీన్ని కాసేపు అలా ఉడికించుకోవాలి. ప‌చ్చ‌డి గ‌ట్టిగా ఉంద‌నుకుంటే కాస్త నీరు యాడ్ చేసుకోవాలి. 5 నిమిషాలు ఉడికించిన త‌ర్వ‌త దించేయాలి. ఇక అంతే ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ ప‌చ్చ‌డి రెడీ! దీన్ని అన్నం, చ‌పాతీ ఇలా దేంట్లో తిన్నా టేస్టీగా ఉంటుంది. 


logo