శుక్రవారం 30 అక్టోబర్ 2020
Food - Oct 13, 2020 , 17:02:11

లివ‌ర్ శుభ్ర‌మ‌వ్వాలంటే.. ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

 లివ‌ర్ శుభ్ర‌మ‌వ్వాలంటే.. ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

హైదరాబాద్ : మన శరీరంలో ఉన్న ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి. లివ‌ర్ ప‌నిచేయ‌క‌పోతే మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక లివ‌ర్‌ను మ‌నం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లివ‌ర్ డ్యామేజ్ అవ‌కుండా చూసుకోవాలి. మ‌న శ‌రీరంలో పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంలో, ర‌క్తాన్ని శుద్ధి చేయ‌డంలో, మ‌నం తినే కొవ్వు ప‌దార్థాల‌ను జీర్ణం చేసేందుకు, మనం తినే ఆహారంలో ఉండే విట‌మిన్ల‌ను నిల్వ చేసుకునేందుకు లివ‌ర్ ఎంత‌గానో శ్ర‌మిస్తుంది. ఈ క్ర‌మంలోనే లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద సూచించిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి. దీంతో లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే..?

1. వెల్లుల్లి

వెల్లుల్లిని నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల లివ‌ర్‌లో ఉండే విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. అలాగే లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది.

2. క్యారెట్

క్యారెట్లలో ఫ్లేవ‌నాయిడ్లు, బీటా కెరోటీన్ ఉంటాయి. ఇవి లివ‌ర్ ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. క్యారెట్ల‌లో ఉండే విట‌మిన్ ఎ లివ‌ర్ వ్యాధులు రాకుండా చూస్తుంది. ఈ క్ర‌మంలోనే క్యారెట్‌ను నిత్యం తీసుకుంటే లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది.

3. యాపిల్

యాపిల్ పండ్ల‌లో ఉండే పెక్టిన్ జీర్ణాశ‌యంలో ఉండే విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. దీంతో లివ‌ర్‌లో ఉండే వ్య‌ర్థాల సంఖ్య త‌గ్గుతుంది. లివ‌ర్‌పై భారం ప‌డ‌కుండా ఉంటుంది. క‌నుక నిత్యం ఒక యాపిల్‌ను తింటే లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

4. వాల్‌న‌ట్స్

వాల్‌న‌ట్స్‌లో అమైనో యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి లివ‌ర్‌లోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపి లివ‌ర్‌ను శుభ్రం చేస్తాయి. వాల్‌న‌ట్స్‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల లివ‌ర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్ ఉన్న‌వారు వాల్‌న‌ట్స్‌ను తింటే ఆ వ్యాధి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. నిత్యం గుప్పెడు వాల్‌న‌ట్స్‌ను తింటే లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

5. గ్రీన్ టీ

గ్రీన్ టీలో వృక్ష సంబంధ యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి లివ‌ర్ ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. వ‌ర‌ల్డ్ జ‌ర్న‌ల్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ చెబుతున్న ప్ర‌కారం గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరంలో, లివ‌ర్‌లో ఉండే కొవ్వు ప‌దార్థాల‌ను క‌రిగిస్తాయి. క‌నుక నిత్యం గ్రీన్ టీని తాగినా లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది.

6. ఆకుప‌చ్చ కూర‌గాయ‌లు

పాల‌కూర‌, ప‌చ్చి బ‌ఠానీలు, బెండ‌కాయ‌లు, దొండ కాయ‌లు, క్యాబేజీ, కాలిఫ్ల‌వ‌ర్‌, కొత్తిమీర‌, పుదీనా త‌దిత‌ర ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల్లో క్లోరోఫిల్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది ర‌క్తంలో ఉండే విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అందువ‌ల్ల లివ‌ర్ పై భారం ప‌డ‌కుండా ఉంటుంది. క‌నుక నిత్యం ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల‌ను తిన‌డం అల‌వాటు చేసుకుంటే లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

7. నిమ్మ‌జాతి పండ్లు

నారింజ, నిమ్మ‌, బ‌త్తాయి త‌దిత‌ర నిమ్మ‌జాతి పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి లివ‌ర్‌లో ఉండే విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపి లివ‌ర్‌ను శుభ్రం చేస్తుంది. అందువ‌ల్ల లివ‌ర్ ప‌నితీరు మెరుగుప‌డుతుంది. క‌నుక ఈ పండ్ల‌ను నిత్యం తీసుకుంటే మంచిది.

8. ప‌సుపు

ప‌సుపులో ఉండే ఔష‌ధ కార‌కాలు లివ‌ర్‌ను శుభ్రం చేస్తాయి. అందువ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

9. బీట్‌రూట్

బీట్‌రూట్‌లో ఉండే విట‌మిన్ సి లివ‌ర్ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. లివ‌ర్‌లో ఉండే విష పదార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోయి లివ‌ర్ శుభ్రంగా మారుతుంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.