మంగళవారం 07 జూలై 2020
Food - Apr 11, 2020 , 13:43:12

ఇవి తినండి.. ఆరోగ్యంగా ఉండండి

ఇవి తినండి.. ఆరోగ్యంగా ఉండండి

ఆరోగ్యంగా ఉండడమంటే ఆనందంగా ఉండటమే..ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండటం కోసం మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ, ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా 90 శాతం అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. మనకు నచ్చిన ఆహారపదార్థాలతో పాటు నచ్చినా, నచ్చకపోయినా కొన్నిటిని ఖచ్చితంగా తీసుకోవడం ద్వారా హుషారుగా ఉండొచ్చు. అవేంటంటే..

-ఓట్స్: ఇవి ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారం. వీటిలో కొలెస్ట్రాల్, రక్తపోటును నివారించే బీటా గ్లూటెన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నివారించడంలో సహాయపడుతుంది.

రోజూ ఒక కప్పు ఉడికించిన ఓట్ బ్రాన్ లేదా కప్పున్నర ఓట్ మీల్ ను తినడం వల్ల లభించే బీటా గ్లూటెన్ శరీరంలోని కొలెస్ట్రాల్ ను 5 శాతం మేర తగ్గిస్తుంది. అంతేకాదు హార్ట్ ఎటాక్ ముప్పును 10 శాతం తగ్గిస్తుంది. జీర్ణకోశ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు ఓట్స్ లో ఉండే బీటా గ్లూటెన్ పనిచేస్తుంది. అధిక బరువు ఉన్న వారికి ఓట్ మీల్ తో ఉన్న మరో ప్రయోజనం ఆ బరువును సులభంగా తగ్గించుకోవడమే.

ఓట్స్ ను  ఉదయం పాలు లేదా నీటిలో ఉడికించి బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. ఈ విధంగా నెలరోజులపాటు తీసుకోవడం ద్వారా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

-వెల్లుల్లి: వీటిలో ఎన్నో ఔషధ గుణాలతోపాటు బ్యాక్టీరియా, ఫంగల్ ను నిరోధించే గుణాలున్నాయి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కాంపౌండ్లకు వ్యాధులపై పోరాడే శక్తి ఉన్నది. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. వీటిలో గుండెను కాపాడేందుకు ఉపయోగపడేవే. వారంలో కనీసం ఆరు వెల్లుల్లి రెబ్బలను తినే వారిలో చెడు కొలెస్ట్రాల్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. కడుపు, ప్రొస్టేట్ కేన్సర్ ముప్పులను కూడా తగ్గిస్తుంది. ప్రతి రోజూ కనీసం ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకోవాలన్నది ప్రమాణం. తినడానికి ముందు వెల్లుల్లి రెబ్బల పొట్టును తొలగించి వాటిని ముక్కలుగా కోసి ఓ పది నిమిషాల పాటు అలా ఉంచేయాలి. దీనివల్ల అందులో ఉండే వ్యాధి నిరోధక గుణాలు విడుదల అవుతాయి.

-పెరుగు: ఇందులో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ప్రొబయోటిక్స్ అనే బ్యాక్టీరియా నిజంగా ఎంతో మేలు చేస్తుంది. పేగుల్లో హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉండాలంటే పెరుగు తినాలి. అల్సర్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, జననేంద్రియ భాగాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడంలోనూ పెరుగు ఉపకరిస్తుంది. 175 గ్రాముల తక్కువ ఫ్యాట్ ఉండే పెరుగును రోజులో తీసుకోవడం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

-ఆలివ్ ఆయిల్:చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డీఎల్) ను తగ్గించడం, మంచి కొలెస్ట్రాల్ (హెచ్ డీఎల్) ను పెంచడం ఆలివ్ ఆయిల్ తో సాధ్యం అవుతుంది. మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారికి గుండె జబ్బులు రావు. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఇందుకు వీలు కల్పిస్తాయి. ఇంకా ఆలివ్ ఆయిల్ లో ఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ధమని గోడల్లో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధిస్తాయి. ప్రతి రోజూ ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను భోజనంలో భాగం చేసుకుంటే చాలు. ఆలివ్ ఆయిల్ లో విర్జిన్, ఎక్స్ ట్రా విర్జిన్, కోల్డ్ ప్రెస్డ్ రకాలే మంచివి. ఆలివ్ గింజలను ప్రెస్ చేయడం ద్వారా నూనెను తీస్తారు. అలాకాకుండా సాల్వెంట్లు, వేడి చేయడం ద్వారా తీసే నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు అంతగా ఉండవు.

-బీన్స్: గుండెకు చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉండే సొల్యుబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ ను కరిగిపోయేలా చేస్తుంది. దీంతో ఆ కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడలపై పేరుకునే లోపే వాటిని శరీరం బయటకు పంపిచేస్తుంది. అందుకే గుండె జబ్బులు, రక్తపోటు సమస్యలున్నవారు పీచు పదార్థాలు ఉండే వాటిని అధికంగా తీసుకోవాలి.  ఇవి తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ 15 శాతం వరకు తగ్గుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న ఆహారాల్లో బీన్స్ కూడా ఒకటి. రోజులో ఒక కప్పు మేర బీన్స్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. బీన్స్ లో 2 నుంచి 3 శాతమే ఫ్యాట్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉండదు. మాంసాహారం తీసుకోని వారు తినాల్సిన చక్కని ప్రత్యామ్నాయం ఇది. బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచెందుకు బీన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.


logo