మంగళవారం 07 జూలై 2020
Food - Mar 20, 2020 , 09:26:37

పాత రోజులు మళ్లీ వచ్చేశాయి...

పాత రోజులు మళ్లీ వచ్చేశాయి...

మట్టిపాత్రలు.. రాగిపాత్రలు ఆరోగ్యానికి మంచివని మన పూర్వీకులు వినియోగించేవారు. ఇప్పటికీ పల్లెల్లో కట్టెల పొయ్యిపైనే మట్టిపాత్రల్లో వంట చేయడం కనిపిస్తుంది. కొన్నేండ్ల కిందట వీటి ఉపయోగం చాలా ఉండేది. కానీ కాలక్రమేణా వినియోగం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం వినియోగిస్తున్న పాత్రల తయారీలో రసాయనాలను వినియోగించడం జరుగుతుంది. వీటిని వాడుతున్న ప్రజలకు నేడు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్న ప్రజలు మళ్లీ పాతదనమే కోరుకుంటున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ ప్రకారం వంటకై ఆధునాతన పాత్రలొచ్చినా మట్టిపాత్రలు, రాగిచెంబులను వాడటం పెరుగుతోంది. ఆరోగ్యరీత్యా ప్రస్తుతం సమాజంలో వీటి వినియోగంపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో మట్టిపాత్రలు, రాగిపాత్రల అమ్మకాలు నానాటికీ పెరుగుతూ వస్తున్నాయి. 

పెరుగుతున్న వినియోగం..

ఇప్పటి వరకు అల్యూమీనియం, స్టీల్‌, ఇత్తడితో పాటు వివిధ రకాల ఎలక్ట్రికల్‌ రైస్‌కుక్కర్స్‌, రోటిమేకర్స్‌ వంటి పాత్రలు వాడుతున్నా.. ప్రజలు మట్టిపాత్రలపై మనసు పారేసుకున్నారు. ఆరోగ్యరీత్యా మట్టిపాత్రలే మంచివని భావించి వీటిలోనే వంటలు చేస్తున్నారు. మట్టితో చేసిన వివిధ రకాల పాత్రలు, గిన్నెలు, రకరకాల వస్తువుల విక్రయాలు జరుగుతున్నాయి. వంట చేసుకునేందుకు వివిధ ఆకారాల్లో మట్టి గిన్నెలు అందుబాటులోకి వచ్చాయి. కుక్కర్లు, ప్యాన్లు, నీటిని తాగడానికి గ్లాసులు, బాటిళ్లు సైతం మట్టితో తయారు చేసినవి మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. పలు హోటళ్లు, రెస్టారెంట్లలో మట్టిపాత్రల్లోనే వంటకాలు చేస్తున్నారు. చికెన్‌లోని వివిధ రకాల వంటకాల కోసం మట్టి పాత్రలనే వినియోగిస్తున్నట్లు హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. వేసవి కాలంలో రంజన్లు ఉపయోగించే ప్రజలు ఇప్పుడు అన్ని సీజన్లలో మట్టిపాత్రలను వినియోగిస్తున్నారు. 

కుండ బిర్యానీకి డిమాండ్‌..

పట్టణ ప్రాంతాల్లోని వివిధ రెస్టారెంట్లలో కుండ బిర్యానీ లభిస్తున్నది. రుచిగా ఉండే ఈ బిర్యానీకి డిమాండ్‌ ఎక్కువ. ఇదేకాకుండా కుండలో లభించే ఐస్‌క్రీం కూడా ఉంటుంది. పాతకాలం వస్తువులపైనే కాకుండా పాతకాలపు వంటలు అంబలి, రాగిసంకటి, సర్వపిండి, జొన్నరొట్టె వంటి పదార్థాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పాతకాలం నాటి సంప్రదాయ వంటకాలు ఎంతో రుచికరంగా ఉండేవి. ప్రస్తుతం వీటిని వినియోగించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇదే కాకుండా కట్టెలు, బొగ్గులపై వంట చేయడం, మట్టిపాత్రల్లో నాన్‌వెజ్‌ వండుతున్నారు. ప్రస్తుతం పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో కుండ బిర్యానీ, చికెన్‌ ఫేమస్‌గా మారింది. 

మట్టిపాత్రలు భేష్‌..

ఉత్తర భారత్‌లోని గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ర్టాలకు చెందిన మట్టిపాత్రలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. స్పూన్‌ దగ్గరి నుంచి అద్భుతమై కళా ఖండాల్ని ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. టీ కప్పులు, కుక్కర్లు, ప్లాస్క్‌లు, వాటర్‌ బాటిల్స్‌, ప్లేట్లు, గృహ అలంకరణ వస్తువులు ఇలా ఎన్నో రకాల వస్తువులు మార్కెట్లలో సందడి చేస్తున్నాయి. మట్టిపాత్రలో భోజనం చేస్తే మినరల్స్‌ మనకు పుష్కలంగా లభిస్తాయని పర్యావరణ వేత్తలు, వైద్యులు చెబుతున్నారు. మట్టిపాత్రల వినియోగంతో శరీరానికి మంచి ఆహారం లభించడంతో చర్మంతో పాటు అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయంటున్నారు. మట్టిపాత్రల వినియోగం వల్ల రసాయనిక పదార్థాలు ఆహారం ద్వారా శరీరంలోకి వెళ్లవు. ప్లాస్టిక్‌ వస్తువులలో తీసుకునే ఆహారం వల్ల జుట్టు ఊడిపోతుంది. క్యాన్సర్‌ వంటి జబ్బులు వస్తాయి. ఇతర ఇబ్బందులు ఏర్పడుతాయి. మట్టిపాత్రల వినియోగంతో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు. ఆహారం రుచికరంగా ఉంటుంది. 


logo