గురువారం 02 జూలై 2020
Food - Apr 27, 2020 , 16:32:47

పందిమాంసం వ‌దిలేసి.. అవ‌కాడో తింటున్నారు

పందిమాంసం వ‌దిలేసి.. అవ‌కాడో తింటున్నారు

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌నిషి జీవ‌న చ‌క్రాన్ని పూర్తిగా మార్చివేసింది. నెల క్రితం వ‌ర‌కు ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌ను చూసి రోధించిన ప‌ల్లెలు ఇప్పుడు జనంతో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. ఏనాడూ ఊరిముఖం చూడ‌నివారు కూడా పోలీసుల త‌నిఖీల‌ను త‌ప్పించుకొని మ‌రీ గ్రామాల‌కు వెళ్లిపోతున్నారు. గ్రామాల్లో ఉంటే క‌రోనా రాద‌నే ఒక న‌మ్మ‌కం. అంతేకాదు. మొన్న‌టిదాకా ఏది ప‌డితే అది తిన్న‌వారు, అవ‌స‌రానికి మించి తిన్న‌వారు ఇప్పుడు నోటిని బ‌ల‌వంతంగానైనా క‌ట్టేసుకుంటున్నారు. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే శాఖాహారాన్నే తీసుకుంటున్నారు. 

మ‌న‌దేశంలో బియ్యం, గోధుమ‌ల‌తో చేసిన వంట‌లే ఎక్కువ తీసుకుంటారు కానీ యూర‌ప్, అమెరికా లాంటి దేశాల్లో మాంసం, నిల్వ ఉంచిన ఆహారాన్నే ఎక్కువ ఇష్ట‌ప‌డుతారు. కానీ క‌రోనా దెబ్బ‌కు అక్క‌డి జ‌నం త‌మ ఆహార అల‌వాట్ల‌న్నీ మార్చుకుంటున్నారు. అమెరికా, కెన‌డాలాంటి దేశాల్లో సాధార‌ణ స‌మ‌యంలో ఎక్కువ‌గా అమ్ముడుపోయేది పందిమాంస‌మే. కానీ ఇప్పుడు దాని జోలికి వెళ్లాలంటేనే భ‌య‌ప‌డుతున్నార‌ట‌. ఎంతో ఇష్ట‌మైన పందిమాంసాన్ని వ‌దిలేసి అవ‌కాడో పండ్లు తింటున్నార‌ట‌. హోట‌ళ్లు కూడా మూత ప‌డ‌టంతో నిల్వ‌చేసిన పిజ్జాలు, నూడుల్స్ తింటున్నారు. క‌రోనా వైర‌స్ మ‌నిషి జీవితంలో ప్ర‌తి అంశాన్ని మార్చేసింద‌ని కెన‌డాలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ హాలిఫాక్స్‌కు చెందిన అగ్రి ఫుడ్ విశ్లేష‌కుడు ప్రొఫెసర్ సిల్వైన్ చార్లెబోయిస్ అంటున్నారు. క‌రోనా మొద‌లైన త‌ర్వాత అవ‌కాడో పండ్ల ధ‌ర 60శాతం పెరిగింద‌ని తెలిపారు. ఏది ఏమైనా ప్ర‌జ‌లు మ‌ళ్లీ వ్య‌వ‌సాయోత్ప‌త్తుల ఆహారానికి బ‌ల‌వంతంగానైనా అల‌వాటు ప‌డుతున్నార‌ని ఆనందం వ్య‌క్తంచేశారు. 

ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు తినే ఆహారంలో శ‌రీరానికి రోగ‌నిరోధ‌క శ‌క్తినిచ్చేవి త‌ప్ప వేటినీ ఇష్ట‌ప‌డ‌టంలేద‌ని చార్లెబోయిస్ అన్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొన‌సాగితే క‌రోనా సంక్షోభం ముగిసిన త‌ర్వాత మ‌ళ్లీ ప్యాకేజ్ ఫుడ్ తిన్న‌వారు ఆశ్చ‌ర్య‌పోతార‌ని ఆయ‌న చెపుతున్నారు. తాజా ఆహారం ఉన్నంత నాణ్య‌త ప్యాకేజ్ ఫుడ్‌లో ఉండ‌ద‌ని పేర్కొంటున్నారు. 


logo