గురువారం 21 జనవరి 2021
Food - Nov 12, 2020 , 00:07:06

యూట్యూబ్‌లో..మరాఠీ వంటలమ్మ

యూట్యూబ్‌లో..మరాఠీ వంటలమ్మ

మనవడికి సరదాగా వచ్చిన ఆలోచనే ఆ అవ్వకు ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నది. ఓ పావ్‌బాజీ ఆమె జీవితాన్నే మార్చేసింది. మహారాష్ట్రకు చెందిన సుమన్‌ ధమని అనే 70 ఏండ్ల అవ్వ ఇప్పుడు యూట్యూబ్‌ సెన్సేషన్‌! 

కిందటి ఏడాది వరకూ ఆమె కృష్ణారామా అంటూ ఖాళీగానే ఉండేది. 17 ఏండ్ల మనవడు యాస్‌ ఎప్పుడూ ఏదో ఒకటి చేసిపెట్టమని ఆ పెద్దావిడను సతాయిస్తూనే ఉండేవాడు. ఓ రోజు పావ్‌బాజీ చేయమని అవ్వను బతిమాలాడు. తప్పుతుందా? వండి పెట్టింది. రుచి అద్భుతం. అప్పుడే, ఆ మనవడికి ఒక ఐడియా వచ్చింది. అవ్వతో యూట్యూబ్‌ దేశీ వంటలు చేయించాలనుకున్నాడు. మార్చి 2019లో ‘ ఆప్లీ ఆజీ’ (Aapli Aaji) పేరుతో యూట్యూబ్‌ వంటల చానెల్‌ను ప్రారంభించారు. ఆరు నెలల్లోనే 5 వేల సబ్‌స్ర్కైబర్లను పొందగలిగాడు. ప్రస్తుతం, ఆ చానెల్‌లో 150 వీడియోలు ఉన్నాయి. మొత్తం వ్యూస్‌ 6 కోట్లు. యూట్యూబ్‌ నుంచి బహుమతి కూడా అందుకుంది సుమన్‌ ధమని. దేశీయ వంటలతో అవ్వే ఇప్పుడు పాపులర్‌.  మనవడి సాయంతో కొన్ని ఇంగ్లిష్‌ పదాలు కూడా నేర్చుకుంది. అప్పుడప్పుడూ ఆంగ్లం జోడిస్తూ.. మరాఠీలో భలేగా మాట్లాడుతుంది. మహారాష్ట్రలో పాపులర్‌ యూట్యూబ్‌ వంటలమ్మగా పేరు తెచ్చుకుంటున్నది సుమన్‌ ధమని. 


logo