మంగళవారం 07 జూలై 2020
Food - Mar 08, 2020 , 22:55:14

చిన్నారుల బాగుకోసం..

చిన్నారుల బాగుకోసం..

మార్కెట్‌లో లభించే జామ్‌లు రసాయనాలతో తయారవుతున్నాయి. వీటిని తిని చిన్నారులు పలు రుగ్మతల బారిన పడుతున్నారు. ఇదే విషయాన్ని గమనించిన ఓ తల్లి సహజసిద్ధమైన జామ్‌లను తయారు చేసేపనిలో పడింది. వీటి ద్వారా చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నది.

ముంబైకి చెందిన సౌమి కుమార్తె జామ్‌లు తిన్నప్పుడల్లా అనారోగ్య సమస్యలు తలెత్తేవి. అవి తిన్న సమయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందో ఆరా తీసేందుకు వైద్యుణ్ణి సంప్రదించింది. అప్పుడు తెలిసింది ఆ చిన్నారి తినే జామ్‌లో రసాయనాలు ఎక్కువగా ఉండడం వల్ల పలు వ్యాధులకు గురవుతున్నట్లు తేలింది. తన కుమార్తెలా మరెవరూ బాధపడకూడదనుకున్నది సౌమి. అందుకోసం సహజసిద్ధమైన జామ్‌లను రూపొందించేందుకు సిద్ధమైంది. సౌమి చిన్నతనంలో వాళ్ల అమ్మమ్మ పలురకాల పండ్లతో ఎటువంటి రసాయనాలు లేకుండానే జామ్‌ తయారు చేసేది. అదే పద్ధతిలో సౌమి కూడా జామ్‌లను తయారు చేయడం మొదలుపెట్టింది. స్ట్రాబెర్రీలతో రూపొందించిన జామ్‌ను తన స్నేహితులకు, దగ్గరి బంధువులకూ పంపింది. వారు సౌమి తయారు చేసిన జామ్‌లు ఎంతో రుచిగా ఉన్నాయంటూ కితాబిచ్చారు. ఆమెను మరిన్ని ప్లేవర్స్‌ తయారు చేయమని, వాటిని తామే కొనుగోలు చేస్తామంటూ ప్రోత్సహించారు. అలా సౌమి రూపొందించిన జామ్‌లకు రోజురోజుకూ ఆదరణ పెరిగింది. 


ఊహించనంతగా ఆర్డర్లు పెరిగాయి. అదే సమయంలో మనమే ఓ కంపెనీ ప్రారంభిస్తే ఎలా ఉంటుందని సౌమి భర్త సలహా ఇచ్చాడు. ఇద్దరూ కలిసి మార్కెట్‌లో తమ ఉత్పత్తులు ఎంతమేర అమ్ముడవుతాయనే దానిపై పరిశోధన చేశారు. సహజసిద్ధమైన విధానంలో తయారైన జామ్‌లు అందుబాటులో లేవని తెలుసుకున్నారు. ఆ సమయంలోనే ‘యుమ్మియం’ పేరుతో కంపెనీని ప్రారంభించింది. సౌమి భర్త సహకారంతో ఇంట్లోనే ఎనిమిది రకాల పండ్ల జామ్‌లను తయారు చేయడం మొదలు పెట్టింది. ఆమె ఉత్పత్తులకు ఆదరణ పెరిగింది. ప్రస్తుతం సౌమి 10వేల బాటిళ్లను విక్రయించింది. వ్యాపార ధోరణితో కాకుండా చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఆమె సంకల్పాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.   


logo