గురువారం 02 జూలై 2020
Food - Feb 19, 2020 , 22:58:38

స్వీటుతో ఘాటుగా..

స్వీటుతో ఘాటుగా..

‘శివ.. శివ’ అంటూ శివరాత్రి నాడు..రోజంతా ఉపవాసం ఉండి.. రాత్రి జాగారం చేస్తారు.. కానీ ఆ ఉపవాస దీక్షలో కొన్ని తినాలనే నియమం ఉంటుంది..వివిధ రకాల పండ్లతో పాటు.. శివుడికి ప్రీతి పాత్రమైన స్వీట్‌ పొటాటో అదేనండీ.. కందగడ్డ.. మొరంగడ్డ.. గన్సుగడ్డ.. ఇలా తీరొక్క పేరుతో పిలుచుకునే ఈ గడ్డను.. అలాగే తినడం ఆనవాయితీగా వస్తున్నది.. అయితే దాంతో ఇలా కొత్త రకాల వంటకాలను ట్రై చేసి చూడండి..

పాయసం


కావాల్సినవి : 

స్వీట్‌పొటాటో : 250 గ్రా., 

పాలు : అర లీటరు, 

చక్కెర : 200 గ్రా., 

యాలకులపొడి : అర టీస్పూన్‌, 

సోంపుపొడి : అర టీస్పూన్‌, 

నెయ్యి : 2 టీస్పూన్స్‌,

డ్రైఫ్రూట్స్‌ : 2 టీస్పూన్స్‌


తయారీ : 

ముందుగా స్వీట్‌పొటాటోలను శుభ్రంగా కడిగి తురుముకొని పక్కన పెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో నెయ్యి వేడిచేసి దానిలో తురిమిన స్వీట్‌పొటాటో వేయించాలి. తర్వాత పాలు పోసి సన్నని సెగపై అప్పుడప్పుడు కలుపుతూ మరగనివ్వాలి. ఇప్పుడు చక్కెర, యాలకులపొడి, సోంపుపొడి వేసి కొంచెం సేపు ఉడికించాలి. సగం తరిగిన డ్రైఫ్రూట్స్‌ని పాయసంలో వేసి మిగిలిన సగం గార్నిష్‌ చేసుకొని వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.


దప్పళం


కావాల్సినవి : 

స్వీట్‌పొటాటో : 250 గ్రా., ముద్దపప్పు : ఒక కప్పు, బెల్లం : చిన్నముక్క, ఆవాలు : పావు టీస్పూన్‌, జీలకర్ర : పావు టీస్పూన్‌, చింతపండుగుజ్జు : ఒక కప్పు, పసుపు : పావు టీస్పూస్‌, కారం : అర టీస్పూన్‌, మెంతులు : పావు టీస్పూన్‌, పచ్చిమిర్చి : 6, కరివేపాకు : 2 రెమ్మలు, నెయ్యి : సరిపడా, ఉప్పు : తగినంత


తయారీ :

స్వీట్‌పొటాటోలను శుభ్రం చేసుకొని పెద్దముక్కలుగా కోసుకోవాలి. పచ్చిమిర్చిని చీలికలుగా కట్‌చేయాలి. తర్వాత కడాయిలో నూనె వేడిచేసి అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయాలి. వేగిన తర్వాత కరివేపాకు, ఉప్పు, పసుపు, స్వీట్‌పొటాటో ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం నీరు, చింతపండు గుజ్జు, కారం వేసి బాగా ఉడికించాలి. ఇప్పుడు ముద్దపప్పు, నెయ్యి, బెల్లం వేసి కొంతసేపు మగ్గనిచ్చి ఉప్పు, కారం సరిచూసుకోవాలి. వేడివేడిగా అన్నంతోపాటూ సర్వ్‌ చేసుకుంటే స్వీట్‌పొటాటో దప్పళం చాలా రుచిగా ఉంటుంది. 


మసాలా వేపుడు


కావాల్సినవి :

స్వీట్‌పొటాటో : 250 గ్రా.

పసుపు : పావు టీస్పూన్‌

కారం : పావు టీస్పూన్‌

ధనియాలపొడి : పావు టీస్పూన్‌

అల్లంవెల్లుల్లిపేస్ట్‌ : ఒక టీస్పూన్‌

కొత్తిమీర : ఒక కట్ట

పచ్చిమిర్చి : 4

జీలకర్రపొడి : పావు టీస్పూన్‌

గరంమసాలా పొడి : 

పావు టీస్పూన్‌

కరివేపాకు : 2 రెమ్మలు

నూనె : సరిపడా

ఉప్పు : తగినంత


తయారీ :

ముందుగా స్వీట్‌పొటాటోలను శుభ్రం చేసుకొని ఉప్పు వేసి ఉడికించాలి. వాటి పొట్టు తీసి చిన్నముక్కలుగా కట్‌చేసుకోవాలి. పచ్చిమిర్చిని చీలికలుగా చేసి, కొత్తిమీరను సన్నగా తరగాలి. తర్వాత కడాయిలో నూనె వేడిచేసి కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి కొంతసేపు వేయించాలి. ఇప్పుడు ధనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాలాపొడి, కారం, పసుపు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి ముక్కలుగా కట్‌ చేసుకున్న స్వీట్‌పొటాటోలను వేసి నిదానంగా కలుపుతూ ఉప్పు, కారం సరిచూసుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి దించేయాలి. అంతే.. రుచికరమైన వేపుడు రెడీ!


జామూన్‌


కావాల్సినవి :

స్వీట్‌పొటాటో: 250 గ్రా., చక్కెర : 200 గ్రా., 

యాలకులు : 6, 

మైదాపిండి : 50 గ్రా., 

నూనె : సరిపడా


తయారీ :

స్వీట్‌పొటాటోలను శుభ్రం చేసి ఉడికించి తురుముకొని పక్కన పెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో చక్కెర, ఒక గ్లాసు నీరు పోసి అందులో యాలకులపొడి వేసి పాకం పెట్టుకోవాలి. దీనిలో మైదాపిండి, స్వీట్‌పొటాటో తురుము వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేసుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేడిచేసి ఉండలు వేసుకోవాలి. వీటిని గోల్డ్‌కలర్‌లోకి వచ్చేవరకు వేయించుకోవాలి. ఈలోపు మళ్లీ కాస్త చిక్కటి పాకం చేసుకొని ఈ ఉండలను అందులో వేస్తే మరింత టేస్టీగా ఉంటాయి. 


జి.యాదగిరి

కార్పొరేట్‌ చెఫ్‌

వివాహభోజనంబు రెస్టారెంట్‌

జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌

పార్క్‌లైన్‌, సికింద్రాబాద్‌ 


logo