శుక్రవారం 10 జూలై 2020
Food - Jan 08, 2020 , 16:55:51

శ్వాసకోశ సమస్యలు ఉన్న వారు.. వీటిని తీసుకోవాలి..!

శ్వాసకోశ సమస్యలు ఉన్న వారు.. వీటిని తీసుకోవాలి..!

చలికాలంలో సాధారణంగా ఎవరికైనా దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం వంటి శ్వాసకోశ సమస్యలు సహజంగానే వస్తుంటాయి. ఇక ఆస్తమా ఉన్నవారికి ఈ సీజన్‌లో కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఊపిరాడనివ్వని విధంగా ఆస్తమా ఇబ్బందులకు గురి చేస్తుంది. అంతేకాదు, ఇతర శ్వాస కోశ సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. అలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ సీజన్‌లో కింద సూచించిన ఆహారాలను తీసుకుంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. విటమిన్ డి ఉన్న కోడిగుడ్డు పచ్చ సొన, తృణ ధాన్యాలు, పాలు, పెరుగు, చేపలు ఈ సీజన్‌లో తింటే శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఆహారాలు శ్వాసకోశ సమస్యలపై ప్రభావం చూపిస్తాయి. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉండడం వల్ల దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం, ఆస్తమా వంటివి తగ్గుతాయి. శ్వాస సరిగ్గా ఆడుతుంది. అలాగే నిత్యం కనీసం 30 నుంచి 60 నిమిషాల పాటు అయినా సరే ఉదయాన్నే ఎండలో ఉండాలి. దీంతో శరీరంలో విటమిన్ డి లెవల్స్ పెరుగుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

2. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే క్యారెట్లు, టమాటలు, గ్రీన్ టీ, టర్కీ చికెన్, చికెన్ తదితర ఆహారాలను తీసుకున్నా శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. వీటిల్లో ఉండే విటమిన్ సి, ఎ, ఇ, పాలిఫినాల్స్ మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి.

3. కొలిన్ ఎక్కువగా ఉండే పల్లీలు, గుడ్లు, లివర్ తిన్నా శ్వాస కోశ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారు ఈ ఆహారాలను తింటే బాగా ఉపశమనం పొందవచ్చు.

4. రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగాలి. అలాగే పచ్చి ఉల్లిపాయలను తినాలి. వీటి వల్ల శ్వాస ప్రక్రియ సజావుగా సాగుతుంది. శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

చలికాలంలో పొద్దు తిరుగుడు నూనె, విత్తనాలు, సోయాబీన్ ఆయిల్, పామాయిల్, గోధుమ పిండి, నట్స్, మోనో సోడియం గ్లూటమేట్ (ఎంఎస్‌జీ) ఎక్కువగా ఉండే ప్యాక్డ్ పుడ్స్, బేకరీ పదార్థాలు, వైన్, డ్రై ఫ్రూట్స్, పండ్ల రసాలు, ఇన్‌స్టంట్ కాఫీ, బీర్, టమాటో సాస్ తదితర ఆహారాలను శ్వాస కోశ సమస్యలు ఉన్నవారు తీసుకోరాదు. లేదంటే వీటి వల్ల ఆయా సమస్యలు మరింత పెరుగుతాయి. కనుక వీటిని తీసుకోకపోవడమే ఉత్తమం.


logo