శుక్రవారం 10 జూలై 2020
Food - Jan 08, 2020 , 16:57:28

చలికాలంలో వెచ్చగా ఉండాలంటే.. ఉలవలు మంచి ఆహారం..!

చలికాలంలో వెచ్చగా ఉండాలంటే.. ఉలవలు మంచి ఆహారం..!

మనకు అందుబాటులో ఉన్న నవధాన్యాల్లో ఉలవలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉలవలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటే జ్వరం, జలుబు, గ్యాస్ట్రిక్ సమస్యలు, మూత్రపిండలు, కాలేయ సమస్యలు రావని, మహిళల్లో నెలసరిలో వచ్చే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేదం చెబుతున్నది. ఉలవల్ని నిత్యం తింటే ప్రోటీన్లు, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ తదితర పోషకాలు లభిస్తాయి.

ఉలవలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. అందువల్ల వీటిని చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో శరీరం వెచ్చగా ఉంటుంది. చలి నుంచి రక్షణ లభిస్తుంది. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేదా నిత్యం వేడి ప్రదేశాల్లో పనిచేసేవారు ఉలవలను తీసుకోరాదు. ఇక ఉలవలను నిత్యం తీసుకోవడం వల్ల స్థూలకాయ సమస్యను తగ్గించుకోవచ్చు. ఒక కప్పు ఉలవలను తీసుకుని బాగా ఉడికించి ఉలవకట్టు తయారు చేసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు కలిపి దాన్ని రోజూ ఉదయం పూట పరగడుపునే తీసుకోవాలి. దీంతో చాలా తక్కువ సమయంలోనే సన్నబడవచ్చు.

ఉలవలు ఆకలిని పెంచుతాయి. ఆకలి లేని వారు, పైత్యం ఎక్కువగా ఉన్నవారు వీటిని తింటే ఫలితం కనిపిస్తుంది. అలాగే శరీరంలో ఉన్న కఫాన్ని తగ్గించడంలోనూ ఉలవలు బాగా పనిచేస్తాయి. మూత్రాశయం, మూత్రపిండాల్లో ఉన్న రాళ్లను ఉలవలు కరిగిస్తాయి. ఎక్కిళ్లు తరచూ వచ్చేవారు ఉలవలను ఉడకబెట్టుకుని తినాలి. ఉలవల వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.


logo