e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home ఎవర్‌గ్రీన్‌ యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

య ఆత్మదా బలదాయస్య విశ్వ ఉపాసతే
ప్రశిషం యస్య దేవాః
యస్య ఛాయామృతం యస్య మృత్యుః
తస్మై దేవాయ హవిషా విధేమ!

జరిగిన కథ
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. ఓ గిరిపుత్రుడి మాటలు కూడా కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి. అంతలోనే, ఓ ముసుగు వ్యక్తి త్రిభువన మల్లు మీద దాడికి తెగబడతాడు. సాక్షాత్తు నారసింహుడే తన భక్తుడిని రక్షించుకుంటాడు. ఓ వృద్ధ వైష్ణవుడితో సంభాషణ త్రిభువన మల్లుడి అంతర్నేత్రాలు తెరిపిస్తుంది.

ఋగ్వేదంలోని ‘నృసింహ పూర్వతాపిన్యోపనిషత్‌’లోనిది ఈ మహామంత్రం.సింహగర్జనల మధ్య ఈ నృసింహ మంత్రాన్ని పఠించిన ఆ వేదమూర్తిని చూసి, అపూర్వమైన భక్తిభావంతో శిరస్సు వంచి నమస్కరించాడు త్రిభువనుడు. చిరునవ్వుతో తలపంకించాడు ఆ వైష్ణవనామాల వృద్ధుడు. “ఎప్పుడైతే ప్రపంచంలో క్రమశిక్షణ కనుమరుగై దుష్టభావనలు, చెడుపోకడలు విశృంఖల విహారం చేస్తాయో.. అప్పుడు అపమృత్యు భయం ఆవరిస్తుంది. సంపూర్ణ ఆయుష్షుతో సుఖశాంతులతో జీవించవలసిన మనుషులు అర్ధాయుష్కులవుతారు. మరి మనకు ప్రసాదించబడిన పూర్ణాయుష్షును మృత్యువునుంచి తిరిగి ఇప్పించేదెవరు? దేవదేవుడైన శ్రీ నారసింహుడు. అతిప్రాచీనమైన ఈ పవిత్రమంత్రం మనకు వరప్రసాదంగా రక్షణ కవచమై నిలుస్తుంది. నేను పలికిన మంత్రానికి అర్థం ఏమిటో తెలుసా నాయనా..”
.. ఆ వృద్ధుడి మాటలు మహా సింహగర్జనలో కలిసిపోయి, త్రిభువనుడికి సరిగ్గా వినిపించడం లేదు. మనసులో దైవప్రార్థన చేసుకున్నాడు. తెరలు తెరలుగా దూసుకొస్తున్న సింహనాదం ఒక్కసారిగా ఆగిపోయింది. వాన వెలిసినట్టు ప్రకృతికూడా ప్రశాంతంగా మారిపోయింది. ఇప్పుడు ఆయన మాటలు స్పష్టంగా వినబడే అవకాశం ఉంది.
త్రిభువనమల్లుడికి ఇదంతా కలలా అనిపిస్తున్నది. జరుగుతున్న ప్రతీది ఆ నారసింహుడి అనుగ్రహ ప్రేరితమేమో! సందేహం లేదు.
“నాయనా! ఘోర తపస్సు చేయనవసరం లేదు. తనను స్మరించిన మాత్రాననే తన భక్తులకు శ్రీ నృసింహుడు మృత్యు, అపమృత్యు భయాలను నిర్మూలించగలడు. నేను చెప్పిన ఉపనిషత్‌ మంత్రార్థం ఏమిటంటే, మృత్యువుకు మృత్యువైన నారసింహుడు తన భక్తులకోసం తానే స్వయంగా దర్శనం కలిగిస్తాడు. బలాన్ని, శక్తిని దృశ్యాదృశ్యంగా ప్రసాదిస్తాడు. ఆయన ఛాయయే అమృతమయం. అందుకే, స్వామి మహిమలను దేవతలందరూ ఉపాసిస్తారు. ఇంకా గొప్ప సంగతి ఏమిటంటే, తన భక్తులు తనను ఆరాధించడానికి కావలసిన శక్తియుక్తులనూ ఆయనే అనుగ్రహిస్తాడు. స్వామియే మృత్యువుకు ఛాయవలె ఉన్నవాడై, అవినాభావంతో ఉన్న దేవోపజీవమైన అమృతాన్ని భక్తులకు ఇస్తాడు. ఈ కారణం చేతనే మృత్యువుకు మృత్యువైనాడు. మనకు అమృతమూర్తి అయినాడు”
భక్తిభావంతో ఆ వృద్ధుడు పలికిన పలుకులు త్రిభువనుడికి సంతోషం కలిగించాయి.
“స్వామీ! నాదొక సందేహం. వేదమూర్తులయిన మీరు ఈ మంత్రాలను, శ్లోకాలను చదివి స్వామివారి అనుగ్రహం పొందారు. నావంటి వారు కూడా ప్రయత్నం చేసి కొంతవరకు సఫలీకృతులు కావచ్చు. కానీ..”
చెప్పలేక ఆగిపోయాడు త్రిభువనుడు.
“కానీ.. ఏమిటి నీ సందేహం?”
“సమాజంలో ఉన్న అన్ని వర్గాలకూ శ్రీనారసింహుడి అనుగ్రహం కలిగేదెలా? తమ తమ కులవృత్తులను నిర్వహిస్తూ సమాజంలో మూలస్తంభాలుగా నిలిచిన అన్ని వర్గాల సహోదరులు.. వారంతా ఎలా స్వామివారి అనుగ్రహాన్ని సాధించాలి? పశువులు కాచేవారు, కుండలు చేసేవారు, లోహాన్ని ఉపయోగకరమైన వస్తువులుగా మార్చి లోకానికి మేలు చేసేవారు, వస్త్రాలు నేసి మనకు వస్త్రదానం చేసే నిపుణులు.. ఒకరని కాదు, భగవంతుడి సృష్టిలో బహుముఖమైన వ్యాపకాలతో సామాజిక రథాన్ని నడిపే అన్ని వర్గాలవారందరికీ శ్రీ నారసింహుడి అనుగ్రహం ఎలా దొరకాలి? వారు ఏం చేయాలి?..”
త్రిభువనుడి ప్రశ్నకు బదులుగా చిన్నగా నవ్వి, కొండ గుహకేసి చూశాడు ఆ వృద్ధుడు.
“మంచి ప్రశ్న అడిగావు నాయనా! మంత్రోఛ్చాటనతో, శ్లోకాలు పఠించడాలూ, నిర్దేశిత సంప్రదాయంలో పూజలు, ఆరాధనలన్నిటినీ నియమిత సేవకులు, ఆచార్యులు ఎలాగూ చేస్తారు. అది వారి విధి. కానీ, భక్తులు.. వారు సంపన్నులు కావచ్చు, పేదవారు కావచ్చు. చదువుకున్నవారు కావచ్చు, చదువు లేకపోయినా తమకొచ్చిన విద్యతో నలుగురికీ ఉపయోగపడుతూ నిరాండంబర జీవనం గడిపే అతిసామన్యులు కావచ్చు. అందరూ స్వామివారి సేవకు అర్హులే. అనుగ్రహానికి పాత్రులే! గుండెలో భక్తిని నింపుకొని కొండకొచ్చి “నారసింహా!” అని పిలిచే ప్రతి వ్యక్తీ మహాభక్తుడే! ఎవరు, ఎలా పిలిచినా ఆయన పలుకుతాడు. ఎవరు, ఎలా కొలిచినా కోరిన కోరికలు తీరుస్తాడు. నరుడికి చేసే ఉపకారమే నారసింహుడికి చేసే సేవ! తోటివారి ఆకలి తీర్చే మంచివారిని కాపాడే దేవుడు.. నా సింహదేవుడు. నలుగురికి ఉపయోగకరమైన పనిని, ధర్మాన్ని నువ్వు చేసినంత కాలం నిన్ను అన్ని రకాలుగా కాపాడటమే శ్రీ నారసింహుడి తత్త్వం”
నిజమే!
స్వామిని మనస్ఫూర్తిగా నమ్మాలి. ఆయన మనకు తోడుగా ఉన్నాడని, మనకున్నదంతా ఆయన ఇచ్చిందేనని తెలుసుకోవాలి. తన కుటుంబంలో బాధ్యతలు నిర్వర్తించాలి. తన సమాజంలో ధర్మాన్ని కాపాడాలి. తన జాతికోసం అంకితం కావాలి. ఇవన్నీ నారసింహుడు చూస్తాడు. అనుగ్రహం చూపిస్తాడు.
త్రిభువనుడికి తనలో ఏదో తెలియని మార్పు వచ్చినట్టు అనిపించింది. చీకటి విడిపోయి వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. తన పోరాటంలో తను ఒంటరి కాదు. తోడూ నీడా.. శ్రీ లక్ష్మీనారసింహుడే తనకు మార్గదర్శనం చేస్తాడు. సరైన మార్గాన్ని
చూపిస్తాడు.
“అయితే.. ఆ స్వామిపైనే భారం వేస్తే నాకు భారం తగ్గుతుంది కదా స్వామి! సందేహాలకు, సందిగ్ధతలకూ చోటుండదు కదా!” ఆర్తిగా అడిగాడు త్రిభువనుడు.
“అంటే?..” ప్రశ్నించాడు నామాల వృద్ధుడు.
“ఏం లేదు స్వామీ! అన్నీ స్వామివారికే వదిలేసి, నీదే భారం అంటే.. అన్నీ ఆయనే చూసుకుంటాడు కదా? నీట ముంచినా పాల ముంచినా.. ఆయనే కదా! ఇక నేను చేయవలసిందేమున్నది?”
త్రిభువనుడు ఆ మాట అంటుండగానే గుహపై ఉన్న ఒక పెద్దరాయి దొర్లుకుంటూ వచ్చింది. వేగంగా పెద్ద శబ్దంతో వస్తున్న ఆ రాయిని క్షణంలో కనిపెట్టి, పక్కకు తప్పుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తలపైన పడాల్సిన రాయి, వేగంగా పక్కకు తప్పుకోవడం వల్ల త్రిభువనుడి భుజాన్ని రాసుకుంటూ కింది లోయలో పడిపోయింది.
అది బలంగా భుజానికి రాసుకుంటూ పోవడంతో చర్మం చెక్కురేగి, భుజం కొద్దిగా రక్తసిక్తమైంది.
“చూశారా, నన్ను దేవుడే కాపాడాడు..”
భుజం మీద గాయం నొప్పి కలిగిస్తున్నా, అది తలమీద పడి ప్రాణాపాయం కలగనందుకు సంతోషం!
“అయితే.. నిన్ను దేవుడే కాపాడాడని అంటావ్‌?”
“అవును స్వామి!”
“కాదు నాయనా! నిన్ను నువ్వే కాపాడుకున్నావ్‌. నువ్వు అప్పటికప్పుడు తప్పుకోకపోయుంటే.. నీ తల పగిలి ఉండేది. నీ ప్రయత్నానికి దైవానుగ్రహం తోడయ్యింది”
“అంటే?..” అర్థం కాక అడిగాడు త్రిభువనుడు.
“తన పని తను సరిగ్గా చేస్తూ.. దేవుడి ముందు దీపం పెట్టేవాడిని దేవుడు ఆదుకుంటాడు. కానీ, గాలిలో దీపం పెట్టి దేవుడా భారం నీదే! అనేవాడిని ఏ దేవుడూ ఆదుకోడు. నీ రాజ్యం నువ్వు ఏలవలసిందే! నీ యుద్ధం నువ్వు చేయ వలసిందే! మనకు క్రమశిక్షణ ఉంటేనే శ్రీ నారసింహుడి రక్షణ మనకు ఉంటుంది. ధర్మం దారి తప్పకుండా మన పని మనం చేస్తే మనం దారి తప్పకుండా ఆ దేవుడు చూస్తాడు. సరైన దారి మనకు చూపిస్తాడు” స్పష్టంగా చెప్పాడాయన.
“అర్థమైంది స్వామీ! ప్రయత్నం మనం చేయాలి, ఫలితం ఆయనకు వదిలేయాలి. నమో నారసింహా!” అంటూ త్రిభువనమల్లుడు కొండగుహకు అడ్డంగా ఉన్న రాయిని కదిపే ప్రయత్నం చేశాడు. ఆశ్చర్యకరం!
అంతవరకూ ఇసుమంత కూడా కదలని ఆ రాయి.. త్రిభువనుడి చేయి తగిలీ తగలంగానే బండిచక్రం లాగా సర్రున పక్కకు తొలగిపోయింది.
తెలిసింది.. శ్రీ లక్ష్మీనారసింహుడు అనుగ్రహిస్తే.. సంకల్పంతో ప్రయత్నిస్తే.. బండరాయే కాదు! కొండకూడా దారి ఇస్తుంది. అలిగిన కొడుకును తండ్రి అక్కున చేర్చుకున్నట్టు అనిపించింది.
చెప్పలేని ఆనందం. అపూర్వమైన అనుభూతి.
చేతులు జోడించి ముందుకొచ్చాడు. కండ్లలో నీళ్లు నింపుకున్నాడు. అవి ఆనందబాష్పాలు!
గుహలోకి తొంగిచూశాడు.
ఒక అద్భుతమైన కాంతిపుంజం!
ఆ వెలుతురును చూడలేక కండ్లు మూసుకున్నాడు.
“నారసింహా.. నారసింహా!”
నారసింహుడి ధ్యాస తప్ప, మరొకటి లేదు.
“నాయనా! నేను ఇంతకు ముందు చెప్పాను కదా! స్వామి అనుగ్రహం కోసం నువ్వు, నేను చేయవలసింది ఒకటుంది”
“ఏమిటి స్వామీ అది?”
“తెల్లవారితే మనందరికీ, సకల మానవాళికీ పండుగ రోజు. శ్రీ లక్ష్మీ నారసింహుడిని పరిపూర్ణంగా పొందగలిగే ఆ మహా పర్వదినం ఏమిటో తెలుసా? శ్రీ నృసింహ జయంతి” అంటూ ఉద్వేగభరితుడై చెప్పాడు ఆ పెద్దాయన.
‘ఓం నమో శ్రీ నారసింహాయ’ మనసులో మళ్లీ అనుకున్నాడు.
“శ్రీ నృసింహ జయంతి” అనే మాట ఎప్పుడైతే వినడిందో.. త్రిభువనమల్లుడి మనసు సంతోషంతో పొంగిపోయింది.
“స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు. శ్రీ నరసింహస్వామివారి పుట్టినరోజు. అన్ని కష్టాలూ తొలగించి, సకల సౌభాగ్యాలు అందించే మంచిరోజు. ఆ రోజున చేయవలసిన పూజావిధానం నేను చెప్తాను” అన్నాడు నామాల వృద్ధుడు.

కొండకింద ఒక పెద్ద జాతరలాగా ఉంది. జనం ఒక్కరొక్కరే కొండదగ్గరికి వస్తున్నారు. చూస్తుండగానే చాలామంది పోగయ్యారు.
దూరం నుంచి వినవస్తున్న గుర్రపుడెక్కల శబ్దాలు విని, అందరూ అటువైపు చూశారు.
వందమందితో వస్తున్న అశ్వికదళం!
“అదిగో.. అనంతపాల మహాసేనాని! స్వయంగా వస్తున్నారు.. మన భువనగిరి
సైన్యాధ్యక్షుడు”
జన సముహంలో ఉత్సాహభరితమైన అరుపులు, కేకలు. పిల్లలు, పెద్దలు అందరి ముఖాల్లో సంతోషం.
“ఇంక భయమేముంది? అనంతపాలుడు స్వయంగా వచ్చాక, చక్రవర్తులవారు సురక్షితంగా వస్తారు” ఒక పెద్ద మనిషి బిగ్గరగా అరిచాడు.
అశ్వికదళం ముందు వస్తున్న దండధారులు ఆగి, ఒకరొక్కరుగా పక్కకు తప్పుకున్నారు. అప్పుడొచ్చింది.. అనంతపాలుడు అధిరోహించిన అశ్వం.
జనం భయభక్తులతో పక్కకు తప్పుకున్నారు. అనంతపాలుడు గుర్రం దిగకుండానే అందరికేసీ చూశాడు.
“ప్రజలారా! ఎందుకు మీరంతా ఇక్కడికొచ్చారు?” అడిగాడు అనంతపాలుడు.
“అయ్యా! చక్రవర్తులవారికి ప్రాణాపాయస్థితి ఏర్పడిందని అక్కడా ఇక్కడా అంటున్నారు. విని ఆగలేక మేమంతా ఇక్కడికి వచ్చాం..”
“అవును. మేము ప్రభువులవారి దర్శనం కోరుతున్నాం..”
“మేము వెంటనే ప్రభువులవారిని చూడాలి..” అందరూ గొంతెత్తి అరుస్తున్నారు.
అనంతపాలుడు ఆశ్చర్యపోయాడు.
రాజ్యాన్ని పరిపాలించే ప్రభువులకు ప్రజలు భయపడతారు. అధికారాన్ని చూసి, అధికారం విధించే శిక్షలను గుర్తుకు తెచ్చుకొని భయ
పడతారు.
అది సహజం!
కానీ, ఇక్కడ తను చూస్తున్నది వేరు.
ఇక్కడ త్రిభువనమల్ల చక్రవర్తిపైన ప్రజలకున్నది భయం కాదు.. అధికారం, అహంకారం చూసి తెచ్చుకున్న అణకువ కాదు.
త్రిభువనమల్ల చక్రవర్తిపట్ల భువనగిరి ప్రజలకున్నది.. భక్తి! ప్రేమ! గౌరవం!
ప్రజల అభిమానం, ఆదరణ పొందగలగడం ఏ పరిపాలకుడికైనా గర్వకారణం. పూర్వజన్మ సుకృతం.
త్రిభువనమల్లుడు కారణజన్ముడు. ప్రజల సంక్షేమం కోసమే జన్మించినవాడు. మనసా వాచా కర్మణా పదిమందికి మేలు చేయాలనే తపన ఉన్నవాడు. అటువంటి ఉత్తముడు, సమర్థుడు, చారిత్రక పాలకుడు, తన ప్రభువు కావడం.. వారి కొలువులో తాను సేవలందించడం తనకో గొప్ప అదృష్టం. నిజమైన ప్రజల అభిమానం చూరగొన్న ఏ పరిపాలకుడికైనా.. దైవానుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది.
“త్రిభువనమల్ల సార్వభౌముని అభిమాన ప్రజలారా! మీ సహృదయ శుభాభినందనలతో, దేవదేవుడి కృపా కటాక్షాలతో ప్రభువులవారు క్షేమంగా ఉన్నారని మాకు విశ్వసనీయమైన సమాచారం అందింది. వారిని తిరిగి కోటకు తీసుకొని రావడానికే మేము ఇక్కడికి వచ్చాం”
అనంతపాలుడి ప్రకటన పూర్తి కాకుండానే జనంలో హర్షాతిరేకాలు మిన్నంటాయి.
“జయహో.. త్రిభువనమల్ల మహాచక్రవర్తి! జయహో!”
ఆ జయజయ ధ్వానాలమధ్య అనంతపాలుడు యాదగిరీశుడు కొలువైన కొండపైకి బయలుదేరాదు.
భువనగిరి దుర్గంలో మహారాణీవారి మందిరం. ఇవతల గదిలో రామభట్టు నిరీక్షిస్తున్నాడు.. మహారాణివారి సందర్శనకు అనుమతికోసం! చివరికి రాణీవారు లోపలకు రమ్మన్నారని పిలుపు వచ్చింది.
పరిచారికలు రామభట్టును సమావేశ మందిరానికి తీసుకెళ్లారు.
“అమ్మా! మీకు ఆశీస్సులు.. అభినందనలు”
మహారాణిని చూస్తూనే వినయంగా పలికాడు రామభట్టు. ముభావంగా ఉన్న రాణీ చంద్రలేఖ, రామభట్టును చూసి-
“మిమ్మల్ని స్వేచ్ఛగా మీ గ్రామానికి వెళ్లమని చెప్పాను కదా!
మళ్లీ ఎందుకు నన్ను కలిసి మాట్లాడాలనుకుంటున్నారు?
ఇది మా సమయాన్ని వృథా చేయడం కాదా? చెప్పండి త్వరగా” అని అడిగింది.
“మాహారాణిగారు! మీ ఆవేదన నాకు తెలుసు. మీ బాధ తొలగిపోవాలంటే నా మాట మన్నించి ఒక పూజ చేయాలి. ఆ పూజకు సంబంధించిన నియమాలు పాటించాలి. అంతా శుభం జరుగుతుంది..” మహారాణి అనుమతి కోసం ఆతృతగా అడిగాడు.
“ఏమి పూజ అది?”
“శ్రీ నృసింహ జయంతి..”
భక్తితో చెప్పాడు రామభట్టు.
“ఏమీ అనుకోకండి. పూజలు, వ్రతాలు, నోములూ.. ఇవి చేయాలంటే ఏకాగ్రత ఉండాలి. నమ్మకం ఉండాలి. మాకు రెండూ లేవు. మా వేదన, కష్టాలు ఒక్కరోజుతో తీరేవి కావు. ఎలాగూ నేను వెళ్లిపోవాలనుకుంటున్నాను. అది యుద్ధరంగమైతే బాగుండనుకున్నాను. ప్రభువులవారు ఇంకా తిరిగి రాలేదు. నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మీరు వయసులో పెద్దవారు. అర్థం చేసుకోండి. నాకు పూజ సాధ్యమవుతుందని నేను అనుకోను. మీరు వెళ్లి రావచ్చు..” కఠినంగా చెప్పింది.
రామభట్టు మౌనంగా వెనుదిరిగాడు.
‘స్వామి నారసింహా..
ఏమీ చేయమంటావు నన్ను?’
అనుకుంటూ..

“నాయనా! నేను ఇంతకు ముందు చెప్పాను కదా! స్వామి అనుగ్రహం కోసం నువ్వు, నేను చేయవలసింది ఒకటుంది”
“ఏమిటి స్వామీ అది?”
“తెల్లవారితే మనందరికీ, సకల మానవాళికీ పండుగ రోజు. శ్రీ లక్ష్మీ నారసింహుడిని పరిపూర్ణంగా పొందగలిగే ఆ మహా పర్వదినం ఏమిటో తెలుసా? శ్రీ నృసింహ జయంతి” అంటూ
ఉద్వేగభరితుడై చెప్పాడు ఆ పెద్దాయన.
‘ఓం నమో శ్రీ నారసింహాయ’ మనసులో మళ్లీ అనుకున్నాడు.
“శ్రీ నృసింహ జయంతి” అనే మాట ఎప్పుడైతే వినడిందో.. త్రిభువనమల్లుడి మనసు సంతోషంతో పొంగిపోయింది.
“స్వామివారికి ఎంతో ఇష్టమైన శ్రీ నరసింహస్వామివారి పుట్టినరోజు. అన్ని కష్టాలూ తొలగించి, సకల సౌభాగ్యాలు అందించే మంచిరోజు. ఆ రోజున చేయవలసిన పూజావిధానం నేను చెప్తాను” అన్నాడు నామాల వృద్ధుడు.
(మిగతా వచ్చేవారం)

-అల్లాణి శ్రీధర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాదాద్రి వైభవం

ట్రెండింగ్‌

Advertisement