e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home ఎడిట్‌ పేజీ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు!

ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు!

ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు!

మాయా మాయాకార్యం సర్వం మహదాది దేహ పర్యన్తమ్‌
అసదిదమనాత్మ తత్త్వం విద్ధి త్వం మరు మరీచికా కల్పమ్‌

ఆదిశంకరాచార్యులు (వివేక చూడామణి)

మహత్తు నుంచి దేహం వరకూ ఈ జగత్తంతా మాయే. ఎండమావులలో నీరు లేకున్నా ఉన్నట్టుగా తోచినట్లు, ఈ ప్రపంచం ‘అసత్తు’ (లేనిది), ‘ఆత్మ కానిది’ అని తెలుసుకోవాలి. ‘అవ్యక్తం’ అనే పేరు గల పరమేశ్వరుని శక్తియే మాయ లేదా మూలప్రకృతి. దీనినే ‘అనాది’, ‘అవిద్య’ అనీ అంటారు. తెలుపు, ఎరుపు, నలుపు రంగులుగల మూడు దారాలతో పేనబడిన తాడు వలె ఈ మూలప్రకృతి సత్తరజస్తమో గుణాలతో మిళితమై ఉంది. మాయ తమోగుణ ప్రభావమే ఆవరణ శక్తి. ఈ శక్తియే వాస్తవానికి ‘ఉన్నదానిని’ అంటే ‘ఆత్మ’ను తెలియకుండా కప్పివేస్తుంది. మాయ రజోగుణ ప్రభావమే విక్షేప శక్తి. ఈ శక్తియే ‘లేని ప్రపంచాన్ని’ మనకు ఉన్నట్లుగా గోచరింపచేస్తుంది. మాయ వల్ల ప్రపంచం మిథ్య అయినా ఉన్నట్టు తోస్తుంది.

మూలప్రకృతి నుంచే పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణాలు, అంతఃకరణ చతుష్టయం వంటివన్నీ ఏర్పడ్డాయి. సృష్టికి పూర్వం కోట్లాది జీవరాశులు వాటి కర్మవాసనలతో కూడి ఈ మూలప్రకృతిలోనే ‘మైనపుముద్దలోని బంగారు రేణువుల వలె’ లీనమై ఉంటాయి. సృష్టిలో ‘అజ్ఞానం’ (అవిద్య) అనే ఉపాధి, కర్మవాసనలతో జీవరాశులు పుడుతూ వివిధ శరీరాలను ధరిస్తుంటాయి. పంచీకృత పంచభూతాలతో ఏర్పడేదే ‘స్థూలశరీరం’. చర్మం, ఎముకలు, కొవ్వు, మాంసం, రక్తం, నాడులు మొదలైనవాటితో కూడిన శిరస్సు, వక్షస్థలం, కాళ్లు, చేతులు వంటి అవయవాలతో ఇది కనబడుతుంది. పుట్టుకకు ముందు, మరణం తర్వాత ‘స్థూలశరీరం’ ఉండదు. గృహస్థునకు గృహంలా జీవునకు ఇది భోగస్థానం. జాగ్రదవస్థ (మేల్కొన్న స్థితి)లో జీవుడు ఈ స్థూల శరీరంతోనే తాదాత్మ్య భావనతో పదార్థాలను సేవిస్తూ, కార్యాలు నిర్వహిస్తాడు. బాల్యం, యౌవనం, వార్ధక్యం మొదలైన అవస్థలను, సుఖదుఃఖాలను, మానావమానాలను, రోగానుభవాలను పొందేది ఈ రక్తమాంసాల దేహమే.

అపంచీకృత భూతపంచకం, కర్మేంద్రియ పంచకం, జ్ఞానేంద్రియ పంచకం, ప్రాణపంచకం, అంతఃకరణ చతుష్టయం, విద్య, కామం, కర్మం అనే ఎనిమిదింటిని కలిపి ‘పుర్యష్టకం’ అంటారు. దీనితో ఏర్పడేది ‘సూక్ష్మ శరీరం’ (లింగశరీరం). ఇది పూర్వజన్మ కృతవాసనలతో కూడినదై సుఖదుఃఖ రూప కర్మఫలాలను అనుభవింపజేస్తుంది. ఇదే జీవునకు భోగసాధనం. దీని ఉనికి స్వప్నావస్థలోనే తెలుస్తుంది. అహంకార మమకారాలకు, ఆకలిదప్పులకు, శ్వాసక్రియలకు ఇదే కారణం. ఈ ‘సూక్ష్మశరీర’ ప్రేరణతోనే ‘స్థూలశరీరం’ తన కార్యాలు నిర్వర్తిస్తుంది. జీవుడు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ఈ ‘లింగ(సూక్ష్మ)’ శరీరంతోనే గ్రహిస్తాడు. అవిద్యే (అజ్ఞానం) ‘కారణ శరీరం’. దీని ఉనికి ‘సుషుప్త్యవస్థ’లోనే తెలుస్తుంది. గాఢనిద్ర తర్వాత వ్యక్తి ‘హాయిగా నిద్రపోయాను. నాకేమీ తెలియలేదు’ అంటాడు. ఈ ‘తెలియకపోవడమే’ అవిద్య. సుషుప్త్యవస్థలోనే మనిషి దేహేంద్రియ క్రియలన్నీ లీనమై ఉంటాయి. ఈ అవస్థలో ప్రపంచం, దేహం, ఇంద్రియాల ఉనికి ఉండదు.

ఈ శరీరత్రయం వ్యష్టి, సమష్టి రూపంగా ఆరు విధాలుగా ఉంటుంది. గృహం-గ్రామం, వృక్షం-వనంలలాగా గృహం వ్యష్టి. గ్రామం గృహాల సమష్టి. అలాగే, వృక్షం వ్యష్టి అయితే, వనం సమష్టి. ఒక్కొక్క శరీరం వ్యష్టి, అన్ని శరీరాలు కలిపితే సమష్టి. జ్ఞానంతో ‘కారణశరీరం’, అంతఃకరణ వృత్తుల సంకోచంతో ‘సూక్ష్మశరీరం’, ఆహార రాహిత్యం, వ్యాధులు/ వయోభారంతో ‘స్థూలశరీరం’ నశించిపోయేవి. ఇవి ఆత్మ కాజాలవు. ఇదంతా అనాత్మ. దేహంతో మొదలై సర్వదృశ్య వస్తువులు, ప్రపంచమంతా మాయాకార్యమే కానీ, వాస్తవానికి లేవు. అంతా మిథ్య! ‘ఆత్మ-అనాత్మ’ విచారంతో, ఆత్మవస్తువు ఏది, ఆత్మ కానిదేదో తెలుసుకోవడం వల్ల ఆత్మజ్ఞానం కలిగి, భవబంధాలు తొలగుతాయని శాస్ర్తాలు చెబుతున్నాయి.

ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు!దోర్బల కుమారస్వామి
94400 49608

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు!

ట్రెండింగ్‌

Advertisement