e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, April 18, 2021
Advertisement
Home ఎడిట్‌ పేజీ నాయకుడి విజన్‌పై విశ్వాసం

నాయకుడి విజన్‌పై విశ్వాసం

నాయకుడి విజన్‌పై విశ్వాసం

విశ్వాసం అనేది వర్తమాన దేశ రాజకీయాల్లో ప్రజలు పెద్దగా నమ్మని విషయం. కానీ ఆ విశ్వాసాన్ని సాధించుకున్నవారికి గెలుపే తప్ప ఓటమి ఉండదు. రాజకీయాల్లో ధన ప్రభావం గురించి కొందరు మాట్లాడుతుంటారు. అయినా ఓటరు తనకు నచ్చినవారికే ఓటేస్తున్న సంగతిని ఎవరూ కాదనలేరు. ఒకవేళ ధనమే ప్రధానమైతే, ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ ఓటమి ఎరుగని నేతగా చరిత్రలో నిలిచేవారు కాదు! తెలంగాణ ముఖ్యమంత్రికి ఏడేండ్లుగా లభిస్తున్న విజయాలనూ గమనించొచ్చు.దేశ రాజకీయాల్లో అలాంటి విశ్వాసం సాధించుకున్న నేతలు చాలా అరుదు.

కేసీఆర్‌ వ్యక్తిత్వ ముద్ర ప్రజల్లో బలంగా ఉంది. ప్రభుత్వంలో ఏ పొరపాటు జరిగినా ఆయనే దిద్దగలడనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఆర్టీసీని అమ్మేస్తున్నారని విపక్షాలు ప్రచారం చేశాయి. ఎంతటి నష్టాల్లో ఉన్నా ఆర్టీసీని అమ్మలేదు. కాపాడే ప్రయత్నం కేసీఆర్‌ చేస్తూనే ఉన్నారు. ఇలాంటివి ఎన్నిటినో ప్రజలు కేసీఆర్‌ను నమ్మి వదిలేశారు తప్ప ఆయన్ను తప్పుపట్టిన దాఖలా లేదు. కారణం విశ్వాసం.
కేసీఆర్‌ ఏం చేసినా మన మంచి కోసమే అయి ఉంటదనేదే విశ్వాసం. అలాంటి విశ్వాసాన్ని అనేక కోణాల్లో కేసీఆర్‌ సాధించుకున్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణను సాధించిన నాయకుడని అందరికి తెలుసు. సకల జనుల సంక్షేమ రాజ్యాన్ని నడుపుతున్నారనీ తెలుసు. వీటన్నిటికీ మించి 59 ఏండ్లలో జరిగిన నీళ్ల దోపిడికి అడ్డుకట్ట వేసి తెలంగాణను జీవనదుల నీటితో సంపద సృష్టి కేంద్రంగా మారుస్తారనే విశ్వాసమే మరింత ప్రధానమైనది. కేసీఆర్‌ అనే మూడక్షరాల్లో ప్రజలు విశ్వాసాన్ని చూస్తున్నారు. దాన్ని ఛేదించడం ఇప్పట్లో విపక్షాలకు సాధ్యం కాదు. కేసీఆర్‌ ప్రభుత్వంలో తప్పిదాలు కనిపించనపుడు ఇక వారి విశ్వాసం ఎలా సడలుతుంది. ప్రజలు ప్రశంసించేంతగా గ్రామాలు వ్యవసాయంతో కళకళలాడుతు న్నాయి. భూముల విలువలు పెరిగాయి. సంపద సృష్టిలో తెలంగాణ ముందడుగు వేస్తూ వెళ్తున్నది. నిన్నటి పేదోడు, నేడు కోటీశ్వరుడవుతున్నాడు. సంపద సృష్టికి గ్రామాలే కేంద్ర బిందువులవుతున్నపుడు.. ఇక ప్రతిపక్షాలు కేసీఆర్‌ను ఎలా ఇబ్బంది పెట్టగలవు?
మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులపై విపక్షాలు చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. కానీ ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు పట్టించుకోలేదు. నిజంగా చివరి కుగ్రామం దాకా తాగునీరందించిన రాష్ట్రం దేశంలో ఒక్కటీ లేదు. జీవించే హక్కును ప్రతి భారత పౌరునికి రాజ్యాంగం కల్పించింది. తాగునీరూ జీవించే హక్కులో భాగమే. అలాంటి తాగునీటి హక్కు 75 ఏండ్లయినా ఈ దేశంలో ఇప్పటికీ అమలు కాలేకపోతున్నది. అలాంటి హక్కును అమలుచేసిన గొప్ప నాయకుడు కేసీఆరే అంటే ఈ దేశంలో ఎవరు కాదంటారు? తలాపున నదులు పారుతున్నా ఎడారిగా మిగిలిన తెలంగాణను ఏడేండ్లలో నీళ్ల తెలంగాణగా మార్చడంలో కేసీఆర్‌ చూపుతున్న పట్టుదల.. ఆయన పట్ల ప్రజల్లో బలమైన విశ్వాసాన్ని మరింతగా పెంచింది. కరువు ప్రాంతాలకు కలలో కూడా ఊహించని విధంగా నీళ్ల కళను తెచ్చారు, తెస్తున్నారు, తేబోతున్నారు. మరో పదేండ్లు ఆయనే సీఎంగా ఉంటే కృష్ణా, గోదావరితో తెలంగాణను తడిసిన ముద్ద చేస్తారనడంలో సందేహం లేదు. ప్రజల్లో అదే అచంచల విశ్వాసం, నమ్మకం. నీరు, నదులు, పచ్చని వ్యవసాయం ఉన్నచోటనే మానవ నాగరికతలు అభివృద్ధి చెందాయని చరిత్ర చెపుతున్నది. ఆ ప్రాంతాలే సంపద సృష్టి కేంద్రాలైనాయి. కోన, కోస్తా సీమల ఆర్థికపుష్టికి కృష్ణ, గోదావరులు కారణం కాదా? పారిశ్రామికవేత్తలు, సినీరంగం, వ్యాపారవేత్తలు, విద్య, వైద్య సంస్థలన్నీ దశాబ్దాలుగా వారి ఆధిపత్యంలోకి వెళ్లడానికి ఆ రెండు జీవనదులే కదా కారణం? తెలంగాణను ఎండబెట్టారు, పచ్చని కోనసీమలో సిరులు కురిపించుకున్నారు. అన్నిరంగాలను వశపర్చుకున్నారు. 59 ఏండ్లలో తెలంగాణ కోల్పోయిన నీటి వాటా లెక్కలు కడితే సుమారు 11 లక్షల కోట్లని నిపుణుల అభిప్రాయం. మన 59 ఏండ్ల వెనుకబాటును తుడిచేయగలిగేవి ఆ రెండు జీవనదుల నీళ్లే.

ఆ విషయం కేసీఆర్‌లో బలంగా ఉంది కాబట్టే, భారీ ఎత్తున్న ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయంలో ఒకప్పటి నిర్వేదాన్ని తొలగించారు. రాబోయే పదేండ్లలో వ్యవసాయాన్ని సంపద సృష్టికి కీలకం చేయాలనే పట్టుదల కేసీఆర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నదే. దాంతో గ్రామాలు వ్యాపార కేంద్రాలుగా మారడం సహజం. వ్యవసాయాధారిత ఉత్పత్తులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పరిశ్రమలు తెలంగాణ గ్రామాల భవిష్యత్తునే మార్చే కాలం తప్పక వస్తుంది. తెలంగాణ బతుకు, సంపద అంతా నీళ్లపై ఆధారపడిందే. సుమారు 14 వందల టీఎంసీల మన నీళ్లు వాడుకలోకి వచ్చిన నాడు తెలంగాణ ముందు.. పంజాబ్‌, హర్యానాలు కూడా నిలబడలేవు. అది సీఎం కేసీఆర్‌ భగీరథ సంకల్పం. ఆ వజ్ర సంకల్పమే ఆయన పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచు తున్నది. కేసీఆర్‌పై ఎవరెన్ని విమర్శలు చేసినా, ఆయన పట్ల ప్రజల్లో మాత్రం విశ్వాసం చెక్కుచెదరలేదు. దుబ్బాకతో అయిపోయిందనుకున్నారు. విద్యావంతులే కేసీఆర్‌ను గెలిపించేసరికి తెల్లముఖాలు వేయక తప్పలేదు. తెలంగాణ రైతాంగంలో కేసీఆర్‌ పట్ల ఆ విశ్వాసం ఉన్నంతకాలం ఆయన నాయకత్వానికి తిరుగులేదని విపక్షాలకూ తెలియదనుకోలేం. ఇప్పుడు సాగర్‌లో ఏం జరుగనుందనే ఆత్రుత విశ్లేషకుల్లో కూడా లేకుండాపోయింది. విశ్వాసానికే గెలుపు దక్కనుందని భావించడమే అందుకు కారణమై ఉంటుంది!

కొసమెరుపు: ‘తెలంగాణ ఉద్యమాన్ని మట్టికరిపించి, జైశ్రీరాం నినాదాన్ని సిద్దిపేట నుంచి తిరుపతికి తెచ్చాం’ అని తిరుపతి ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య వైరలయింది. ఏ రోటికాడ ఆ పాట పాడే పార్టీలు తెలంగాణకు ఏ మేరకు ఉపయోగపడతాయనేందుకు అదో తాజా ఉదాహరణ! ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఢిల్లీ పార్టీలను నమ్మలేని పరిస్థితి. రాష్ర్టాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్య చేసిన ఆ ఎమ్మెల్యే కనీసం తాను చేసిన వ్యాఖ్యకు పశ్చాత్తాపం చెప్పిన దాఖలా కూడా లేదు. ఆయనకు, ఆయన పార్టీకి తెలంగాణ ఉద్యమం పట్ల గౌరవం లేదని స్వయాన ఆయనే ఒప్పుకొన్నట్లేమో? అందుకే, తెలంగాణ రాజకీయాల్లో విశ్వాసకులు-అవిశ్వాసకులు అనే విభజన గీత ప్రజలకు అనివార్యంగా మారింది. అందుకే నమ్మదగినవాడు కేసీఆర్‌ తప్ప మరెవ్వరూ కాదని ప్రజ లు బలంగా నమ్ముతున్నారనే అసహనమే.. ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలో మనకు పరోక్షంగా కనిపిస్తున్న నిజం.

నాయకుడి విజన్‌పై విశ్వాసం

కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి

Advertisement
నాయకుడి విజన్‌పై విశ్వాసం

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement