e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home ఎడిట్‌ పేజీ డైనోసార్లు తిరిగిన నేల

డైనోసార్లు తిరిగిన నేల

ఈ భూమి.. దాని మీద ప్రకృతి పుట్టిన నాటి నుంచి ఈ క్షణం వరకు 24 గంటలు అనుకుంటే.. అందులో మన మానవ చరిత్ర ఒక సెకను మాత్రమే. మనకంటే ముందే కొన్ని కోట్ల ఏండ్ల కిందట పుట్టిన జీవజాతులు లక్షల ఏండ్లు బతికి క్షీణించిపోయాయి. ఈ మొత్తం క్రమంలో మానవ పరిణామంకన్నా ముందే ఈ భూమ్మీద తిరుగాడిన ముఖ్యమైన జీవరాశుల్లో రాకాసి బల్లులు ముఖ్యమైనవి.

హైదరాబాద్‌కు ముప్ఫై కిలోమీటర్ల దూరంలోనే డైనోసార్లు తిరిగాడాయంటే నమ్ముతారా? మంచిర్యాల ప్రాంతం డైనోసార్ల అవశేషాలను నిక్షిప్తం చేసుకున్న ఒక పురాజీవ నిధి అంటే ఆశ్చర్యమే. హైదరాబాద్‌ బిర్లా సైన్స్‌ సెంటర్‌లో ఉన్న డైనోసార్‌ ఒంటరిది కాదు, కోట్ల ఏండ్ల కింద తెలంగాణ నేలమీద తిరుగాడిన అనేక జీవరాశుల్లో అది ఒకటి.

- Advertisement -

‘బరపసారస్‌ టాగురై’
కోట ఫార్మేషన్‌, ఎర్రపల్లి ఫార్మేషన్‌, ధర్మారం ఫార్మేషన్‌.. ఇవన్నీ ప్రాణహిత- గోదావరి నదీలోయ విస్తరించిన తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ప్రాంతంలో భూమి లోపల రాళ్ల అమరికతో ఏర్పడిన పొరలు. ఇవన్నీ జురాసిక్‌ యుగంలో అంటే సుమారు 20 కోట్ల నుంచి 14.5 కోట్ల ఏండ్ల కిందట ఏర్పడినవి. ఆ కాలంలో భూమ్మీద వాతావరణంలో క్రమంగా వేడి తగ్గి తేమ పెరుగుతూ రకరకాల వృక్షజాతులు, జంతు జాలం పెరగడం మొదలైంది. అప్పుడే ఈ భూమ్మీద విశాల కాయంతో రాకాసి బల్లులు జీవించాయి. ఉత్తర తెలంగాణ గోండ్వానాలో, దక్షిణ తెలంగాణలో దక్కన్‌ ట్రాప్స్‌ మధ్య పొరల్లో రాకాసి బల్లుల అవశేషాలు దొరికాయి. వాటిని కనుగొన్న పురాజీవ శాస్త్రవేత్తలు ప్రతిదానికి నామకరణం చేశారు. 20వ శతాబ్దం ప్రారంభంలోనే ఇక్కడ పురాజీవ శిలాజాల ఆచూకీ తెలిసినా 1980లలో ఈ అన్వేషణ ఊపందుకున్నది.

కోటసారస్‌ ఎమన్పల్లియెన్సిస్‌
మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో 1988లో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన పురాజీవ శాస్త్రవేత్త (పేలియంటాలజిస్ట్‌) డాక్టర్‌ యాదగిరికి దొరికిన డైనోసార్‌ శిలాజం ఇప్పుడు బిర్లా సైన్స్‌సెంటర్‌ ‘డైనోసారియం’లో మనం చూడొచ్చు. అదే ప్రజాతికి చెందిన 12 వేర్వేరు డైనోసార్ల శిలాజాల తాలూకు సుమారు 840 అవశేషాలను సేకరించి తయారుచేసిన ఈ రాకాసి బల్లి పేరు ‘కోటసారస్‌ ఎమన్పల్లియెన్సిస్‌’. అన్ని భాగాలు దొరికినా తల మాత్రం దొరకనందున అదే ప్రజాతికి చెందిన తల రూపాన్ని ఫైబర్‌ గ్లాస్‌తో చేసిపెట్టారు. ‘సారస్‌’ అంటే బల్లిని పోలిన సరీసృపం. కోట ఫార్మేషన్‌లో దొరికినందున ‘కోటసారస్‌’ అని, వేమనపల్లి ఊరి పేరిట ‘ఎమన్పల్లియెన్సిస్‌’ అని పేరు పెట్టారు. భారీ కాయంతో, పొడుగు మెడ, చిన్న తలకాయ, పెద్దపెద్ద కాళ్లున్న వీటిని ‘సారోపోడ్‌’లు అంటారు. మన కోటసారస్‌ ఈ జీవులలో ముందు పుట్టిన వాటిలో ఒకటి.

రింకోసారస్‌
జయశంకర్‌- భూపాలపల్లి జిల్లా కాటారంలో ‘ఆర్కోసార్‌’ అంటే డైనోసార్ల కంటే ముందున్న జీవి ‘రింకోసారస్‌’ శిలాజం దొరికింది. సుమారు 20 నుంచి 25 కోట్ల ఏండ్ల కిందట బతికిన ఈ ఆర్కోసార్‌ శిలాజాన్ని హైదరాబాద్‌ జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఇండియాలో దొరికిన ఒకే ఒక్క రింకోసారస్‌ తెలంగాణలో దొరికింది. ఒక్క భాగం కూడా నష్టపోకుండా దొరికిన పూర్తి శిలాజ అవశేషం ఇది. దీని విశేషమేమంటే.. ఈ జీవి చనిపోయేముందు బురదలో చిక్కుకొని పెనుగులాడినట్టు దాని కంకాళ అవశేషాలు చెప్తున్నాయి.

రంగారెడ్డి, వికారాబాద్‌లలో ఆనవాళ్లు
గోండ్వానాలో డైనోసార్ల అవశేషాలు దొరికినట్టే రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఇంట్రాట్రాపియన్‌ పొరల్లో డైనోసార్‌ అవశేషాలు దొరికాయి. హైదరాబాద్‌ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా ముడిమ్యాల గ్రామంలో డైనోసార్‌ శిలాజాల ముక్కలు దొరికాయి. వికారాబాద్‌-పరిగి మధ్య నాష్కల్‌ గ్రామంలో కూడా చాలా శిలాజాలు లభించాయి. ఈ ప్రాంతంలో దొరికిన శిలాజాల విశేషమేమంటే- అవి భూ ఖండాలు ఏర్పడిన క్రమం అంటే ‘కాంటినెంటల్‌ డ్రిఫ్ట్‌’ వంటి అంశాలను మన ముందుంచాయి. అర్జెంటీనాలో మాత్రమే ఉన్న గోండ్వానోథీరియం దంతాల (5 మీ.మీ. సైజు ఉన్న సూక్ష్మ శిలాజ) అవశేషాలను, వికారాబాద్‌ ప్రాంతంలో విశేషంగా పరిశోధన జరిపిన జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్త చకిలం వేణుగోపాలరావు సేకరించారు. ఈ నాష్కల్‌ గ్రామంలోనే ముళ్ల ఉడుత (హెడ్జ్‌ హాగ్‌) వంటి క్షీరద శిలాజం కూడా దొరికింది. దానికి ‘దక్కనోలెస్టిస్‌’ అని పేరు పెట్టారు.

పెద్దకాళ్ల రాకాసి బల్లి
‘బరపసారస్‌ టాగురై’గా పేరు పెట్టిన ఈ డైనోసార్‌ అవశేషాలు కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో భద్రపరిచి ఉన్నాయి. ప్రాణహిత- గోదావరి బేసిన్‌లో మహారాష్ట్రలోని సిరొంచ వద్ద పోచంపల్లి గ్రామంలో 1961లో దొరికిన ఈ రాకాసి బల్లి ‘కోటసారస్‌’ లాగా మొదలు పుట్టినవాటిలో ఒకటి. బర (బడాకు బెంగాలీ ఉచ్చారణ) అంటే పెద్ద, ‘పా’ అంటే కాళ్లు అని అర్థం. విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్‌ శత జయంతి సంవత్సరంలో కనుగొన్నందున దీనిపేరులో ‘టాగురై’గా పెట్టారు. ఇది కూడా ఆకులు అలములు తిని బతికిన జీవి.

ఈ డైనోసార్లు మనకేం చెప్తాయి?
తెలంగాణ నేల జీవవైవిధ్యం గురించి చెప్పుకోవాలంటే డైనోసార్ల కంటే పెద్ద ఉదాహరణ ఏదీ ఉండదు. భూమి ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు దక్కన్‌, అందులో తెలంగాణ భూభాగం వాతావరణ మార్పులన్నింటికీ సాక్షిగా నిలిచింది. ఒక పెద్ద ఉల్క భూమిని ఢీకొట్టినందున ఏర్పడిన ధూళి సూర్యుడిని కమ్మేసి డైనోసార్ల అంతానికి కారణమైందనేది ఒక సిద్ధాంతం. ఏ మాత్రం కలుషితం కాని భూమ్మీద ఒక పెద్ద ఉల్కాశకలం పడితే కానీ రాకాసి బల్లులు అంతరించిపోలేదు. మనం ఇప్పుడు సంపూర్ణంగా కలుషితమైన భూమ్మీద బతుకుతున్నాం. మానవజాతి వినాశానికి ఆకాశం నుంచి ఉల్క పడనవసరం లేదు. ఇక్కడే పుట్టిన 20 నానో మీటర్ల కరోనా వైరస్‌ చాలు అని 2020 తేల్చేసింది. అందుకే మన ముందున్న మార్గం.. జీవవైవిధ్యాన్ని గౌరవించి మనం వాటిలో భాగంగా బతకడమే. ఇదీ తెలంగాణ నేల, కోట్ల ఏండ్లుగా తనలో భద్రపరచుకొని మనకు అందించిన చరిత్ర.

భారీతలాసుచస్‌ పబాని
తెలుగు తెలిసినవాళ్లకు ఈ రాకాసి బల్లి పేరుకు అర్థం చెప్పే అవసరం లేదు. మొసలి తలను పోలిన ఈజిప్ట్‌ దేవత సుచస్‌, భారీ తలతో ఉన్న సరీసృపం కాబట్టి ‘భారీతలాసుచస్‌’ అని పేరు పెట్టారు. సుమారు యాభై ఏండ్ల కిందటే దీని శిలాజాలు దొరికినా ఇన్నేండ్లకు జూన్‌ నెలలో సరిగ్గా గుర్తించి ఆ వివరాలను కోల్‌కతా ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌ పురాజీవ శాస్త్రవేత్తలు ప్రకటించారు. 24 కోట్ల ఏండ్ల కింద తిరుగాడిన ఈ రాకాసిబల్లి శిలాజం కూడా మన తెలంగాణలోని ప్రాణహిత-గోదావరి బేసిన్‌ ఎర్రపల్లి ఫార్మేషన్‌లో దొరికింది. పెద్ద మగ సింహం సైజులో ఉన్న ఈ రాకాసి బల్లి మాంసాహారి. శాకాహారి అనే చర్చ కూడా ఉంది. దక్షిణాఫ్రికా, చైనా, రష్యాలలో ఇంతకుముందే దొరికినా, ఈ జీవి అవశేషాలు మన తెలంగాణలో లభ్యమవటం విశేషం.

అన్‌ సంగ్‌ హీరో ఆఫ్‌ తెలంగాణ
తెలంగాణ గడ్డపై పుట్టి పురాజీవ శాస్ర్తానికి జీవం పోసిన వాళ్లలో పొన్నాల యాదగిరి ఒకరు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివి, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో పని చేస్తూ ప్రాణహిత-గోదావరి బేసిన్‌ను జల్లెడ పట్టిన ఆయన ఎన్నో శిలాజాలను రికార్డు చేశారు. అందుకే వాటి పేర్లతో ఆయన పేరు కూడా ముడి పడి ఉన్నది. కోటసారస్‌ ఎమన్పల్లియెన్సిస్‌ మాత్రమే కాదు, ‘ఇండోథీరియం ప్రాణహితై’ వంటి ఎన్నో సూక్ష్మ జీవ శిలాజాలను (మైక్రో ఫాసిల్స్‌ను) వెలికితీశారు. త్రిషులోథీరియం కోటెన్సిస్‌ యాదగిరి, కోటథీరియం యాదగిరి, పైకాసిగూడోడాన్‌ యాదగిరి.. ఇలా ఎన్నెన్నో పురాజీవ అవశేషాలతో పాటు యాదగిరి పేరు కూడా చిరకాలం ఉండిపోతుంది.

కోటసారస్‌ ఎమన్పల్లియెన్సిస్‌

ఎం.ఏ. శ్రీనివాసన్‌
81069 35000

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana