e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home ఎడిట్‌ పేజీ అకాడమీకి తెలంగాణతనం

అకాడమీకి తెలంగాణతనం

రాష్ట్ర తెలుగు భాషా సంస్థ అయిన ‘తెలుగు అకాడమీ’ని స్థాపించి 53 ఏండ్లు గడిచింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1968లో విద్యాశాఖా మంత్రిగా ఉన్నపుడు ఆయన అధ్యక్షతన తెలుగు అకాడమీ రూపుదిద్దుకున్నది. రాష్ట్రంలో తెలుగును బోధనా మాధ్యమంగా విశ్వవిద్యాలయ స్థాయి వరకు అమలుపరచాలన్న లక్ష్యంతో పీవీ విధి విధానాలను రూపొందించి సమర్థమైన, సమగ్రమైన స్వరూపాన్ని కల్పించారు. ఆయన వేసిన బాటలోనే తెలుగు అకాడమీ దినదినాభివృద్ధి చెందుతున్నది. అకాడమీ భవిష్యత్తుకు నా సూచనలు..

‘తెలుగు విజ్ఞాన భవనం’ ఏర్పాటు: తెలుగు అకాడమి తన కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు, అధ్యాపకులకు అందుబాటులోకి తీసుకురావడానికి జిల్లాకో ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుచేస్తే మంచిది. రూ.2 కోట్లతో ‘తెలుగు విజ్ఞాన భవనం’ నిర్మించుకోవాలి. 2012లోనే నాలుగు ప్రాంతీయ కేంద్రాలను రూ.2 కోట్లతో నిర్మించడానికి అకాడమి పాలకమండలి ఆమోదం తెలిపింది. మిగతా వాటికి మాత్రమే అనుమతి తీసుకోవాల్సి ఉన్నది.

- Advertisement -

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ స్థాయి వరకు గల విద్యాసంస్థలన్నింటికి ప్రామాణికమైన పాఠ్యపుస్తకాలతో పాటు తెలుగు భాష బోధనకు, అధ్యయనానికి అవసరమయ్యే నిఘంటువులను, సంకేత పదకోశాలను, జనరంజక గ్రంథాలను, వృత్తివిద్యాకోర్సులకు, పోటీ పరీక్షలకు అవసరమయ్యే అనేక గ్రంథాలను రూపొందించి ప్రచురిస్తున్నది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మాతృభాషా కేంద్రంగా తెలుగు అకాడమీ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది.

‘తెలుగు అకాడమీ’ సంచాలకుడిగా మూడున్నరేండ్లు పనిచేసిన అనుభవం నాకున్నది.ఆ సమయంలో తెలుగు అకాడమీ చేపట్టిన పలు విద్యావిషయిక కార్యక్రమాల్లో, వివిధ సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చిన అనేకమంది విద్యావేత్తలు, మేధావులు, రచయితలు, కవులు, పండితులు, పరిశోధకులు, పలు విద్యాసంస్థల అధిపతులు, విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్లు, పత్రికారంగ ప్రముఖులు మొదలైనవారితో జరిపిన చర్చల సారాంశమే ఈ వ్యాసం.

పేరు సవరణ తొలిమెట్టు: తెలుగు అకాడమీకి సంబంధించి పూర్వం ఉన్న జీ.ఓ.ఎం.ఎస్‌. నెం.1255, 12-6-1968 ప్రభుత్వ ఉత్తర్వులను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ తెలుగు లాంగ్వేజ్‌ అన్న దాన్ని ‘తెలంగాణ స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ తెలుగు లాంగ్వేజ్‌’గా, ‘తెలుగు అకాడమీ’ని ‘తెలంగాణ తెలుగు అకాడమీ’ అని రాష్ట్ర ప్రభుత్వం సవరిస్తే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగు అకాడమీ ‘బైలాస్‌’ను కూడా సవరించుకోవాలి. ఇది అకాడమీ పునర్వికాసానికి మొదటి మెట్టుగా అత్యవసరం.

నూతన క్యాంపస్‌ ఏర్పాటు: ప్రస్తుతం తెలుగు అకాడమీ వెయ్యి గజాల స్థలంలోని పాత భవనంలో తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇంటర్‌ నుంచి విశ్వవిద్యాలయస్థాయి వరకు అన్ని సబ్జెక్టుల్లోను సుమారు 600 సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యగ్రంథాలను ప్రచురించింది. సబ్జెక్టుల వారీగా చర్చలు, సమావేశాలు, సభలు జరుపుకొనేవిధంగా తగిన స్థలం లేకపోవటంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కాలానుగుణంగా తెలుగు అకాడమీ కార్యక్రమాలను విస్తరించవలసి ఉన్నది. అందుకనుగుణంగా ‘తెలుగు అకాడమీ’ తన భవిష్యత్‌ ప్రణాళికను అమలుచేసేందుకు 2013లోనే పాలకమండలి అనుమతితో ఓయూలో నాలుగెకరాల స్థలాన్ని కొనుగోలు చేసేందుకు కోరింది. రామంతాపూర్‌ దూరదర్శన్‌ కేంద్రం దగ్గర ఉన్న నాలుగెకరాల భూమిని తెలుగు అకాడమీకి ఇవ్వాలని ఉస్మానియా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ తీర్మానం చేసింది. ఆ భూమిని తెలుగు అకాడమీ సొంత నిధులతో కొనుగోలు చేసి ఒక విస్తృతమైన కొత్త క్యాంపస్‌ నిర్మించుకోవాలి. ఇందుకోసం తెలుగు అకాడమీ పాలకమండలి 2014లోనే రూ.30 కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది.

ప్రాంతీయ అధ్యయనం- తెలంగాణ: తెలంగాణ ప్రాంతం అనేక ప్రత్యేకతలకు నిలయం. భాషకు, పలుకుబడులకు, సంస్కృతికి, కళలకు, ఆచారవ్యవహారాలకు, దేవాలయాలకు, జానపద రీతులకు, అనేక సాహిత్య ప్రక్రియల అవతరణకు క్షేత్రం. రచయిత లు, కవులు, పండితులు, పత్రికా వ్యాప్తి, రాజకీయ సాంస్కృతిక మత సంస్కరణోద్యమాలు, జాతీయ, ప్రాంతీయ అస్తిత్వ పోరాటాలు, పలు విద్యాసంస్థల ఆవిర్భావం, ఆధునిక సాంకేతిక పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి, చేతివృత్తుల వికాసం మొదలైన అంశాల్లో తెలంగాణకు ఉన్న విశిష్టతను తెలియజేసేలా అధ్యయనం జరగాలి. తెలుగు అకాడమీలో కొత్త గా ఏర్పాటుచేసే ‘ప్రాంతీయ అధ్యయనం-తెలంగాణ’ అన్న ప్రత్యేక విభాగం ఈ పని చేయాలి. దీంతోపాటు ఈ అంశాలన్నింటిలో జరిగిన కృషిని గ్రంథాలుగా ప్రచురించి వ్యాప్తిలోకి తేవాలి.

తెలుగు పత్రికా విభాగం: ఇంతకుముందే ఈ విభాగం ఏర్పాటుకు తెలుగు అకాడమీ పాలకమండలి ఆమోదించిం ది. ప్రముఖ పత్రికా సంపాదకులతో సలహా మండలి కూడా ఏర్పాటుచేసింది. కానీ సిబ్బంది నియామకం జరగని కారణంగా ఇది స్తబ్దుగా ఉంది. ఈ విభాగం చైతన్యవంతమైతే తెలుగు విజ్ఞానం దశదిశలా వ్యాపిస్తుంది. దీని ద్వారా నాలుగు మాసపత్రికలను రూపొందించి, ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా పంపిణీ జరిగేలా చూడాలి. అవి- ‘తెలుగు’ భాషా సాహిత్య మాసపత్రిక; సామాజిక శాస్ర్తాల మాసపత్రిక; వైజ్ఞానిక మాసపత్రిక; బాలల మాసపత్రిక. ఈ పత్రికలు విద్యార్థుల, అధ్యాపకుల, పరిశోధకుల, మాతృభాషాభిమానుల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్వహించాలి. వీటిద్వారా ‘ప్రతి ఇంటా తెలుగు-ప్రతి ఇంటా వెలుగు’ అన్న మాతృభాష లక్ష్యం నెరవేరుతుంది.

అనువాద విభాగం- కృషి: ఇది అత్యంత ప్రాధాన్యమైనది. పాలనాపరంగా ప్రభుత్వ రికార్డులను అనువాదం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను ప్రజలకు చేరవేయటంలో, అధికారభాషగా తెలుగు అమలుకు అవసరమయ్యే సామగ్రిని అందివ్వటంలో ప్రభుత్వానికి సహకరిస్తుంది. ముఖ్యమైన గ్రంథాలను ఇతర భాషల్లోకి అనువదించి తెలంగాణ కవుల, రచయితల ప్రతిభా సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేస్తుంది. విదేశీ భాషల్లోని ప్రముఖ గ్రంథాలను, విజ్ఞాన శాస్ర్తాలను, తాత్త్విక, సాంకేతిక శాస్ర్తాలను, చరిత్ర గ్రం థాలను తెలుగులోకి అనువాదం చేస్తుంది. దీంతో దేశవిదేశాల్లోని విషయ నిపుణులతో అనుబంధం ఏర్పడుతుంది. తద్వారా అకాడమీ చేపట్టే కార్యక్రమాలకు, ప్రచురణలకు విస్తృత ప్రచారం లభిస్తుంది.

(తరువాయి రేపటి సంచికలో…)

ప్రొఫెసర్‌
కె.యాదగిరి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana