e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home ఎడిట్‌ పేజీ యోగ సాధన రహస్యం

యోగ సాధన రహస్యం

యోగ సాధన రహస్యం

తం విద్యాద్దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం
స నిశ్చయేన యోక్తవ్యో యోగో‚ నిర్విణ్ణ చేతసా॥
-భగవద్గీత (6-23)

‘దుఃఖరూప సంసారబంధం నుండి విముక్తినిస్తూ, భగవత్‌ సాక్షాత్కార రూపస్థితిని పొందడమే యోగం. దీనిని ఉత్సాహ పూర్వకంగా, నిశ్చయచిత్తంతోనే సాధించాలి’. ‘యుజ్యత ఇతి యోగః’. ‘కూర్చబడేది’ యోగం (ధ్యానం). అంటే, జీవాత్మను పరమాత్మతో కూర్చడం. పరమాత్మను చేరుకోవడానికిగల మార్గాలన్నీ ‘యోగం’తోనే సాధ్యం. ఐతే, జీవుని అజ్ఞానానికి, ప్రవర్తనకు ప్రధాన కారణం మనసు. ఇది ఇంద్రియాల ద్వారానే వ్యక్తమవుతుంది. పరిస్థితులనుబట్టి మనసు స్పందిస్తుంటుంది. ఆలోచనలు, నిర్ణయాలు, రాగద్వేషాది గుణాలతోకూడిన కోర్కెలు, అలవాట్లకు లొంగడమే మనసు పని. ఈ విధమైన చిత్తవృత్తులే జీవుని బంధించేవి.

- Advertisement -

‘చిత్త వృత్తి నిరోధః యోగః. చిత్తవృత్తులను నిరోధించడమే యోగం’ అని పతంజలి మహర్షి నిర్వచించాడు. చిత్తవృత్తులను అనుకూలంగా మార్చుకొని, ప్రాపంచిక విషయాలపట్ల వైరాగ్యాన్ని సాధించి పరమాత్మను చేరాల్సి ఉంటుంది. అందుకు ఎనిమిది అంశాల (యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి) తో కూడిన ‘యోగాభ్యాస విధానాన్ని’ పతంజలి మహర్షి అందించాడు. వీటిని మెట్లుగా భావించి, ఒక్కొక్క మెట్టును అధిరోహిస్తూ, పరమాత్మ ప్రాప్తికి నిరంతర సాధన చేయాలి. ‘సత్యం, అహింస, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం’ ఇవి అయిదు యమములు. ‘శౌచం, తపస్సు, సంతోషం, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిదానం’ నియమాలు. ఈ ‘యమ-నియమాల’ సాధనతోనే శారీరక, మానసిక, ఇంద్రియ వ్యవహారాలు క్రమబద్ధమవుతాయి. ఇవే యోగసాధనకు ప్రాథమిక అవసరాలు. ‘సుఖమ్‌ స్థిరమ్‌ ఆసనమ్‌’. అంటే, సుఖంగా (శరీరానికి ఏ కష్టమూ కలక్కుండా), స్థిరంగా కూర్చోవడమే ‘ఆసనం’. దీనివల్ల మనసులోని ఉద్వేగాలు, సంకల్పాలు తొలగుతాయి. శ్వాస (ఉచ్ఛాస నిశ్వాసలు)తో నిలిచేది ‘ప్రాణం’. దీనిని నియంత్రించి, క్రమబద్ధం చేయడమే ‘ప్రాణాయామం’. రేచకం (గాలిని వదలడం), పూరకం (గాలిని పీల్చడం), కుంభకం (గాలిని నిలుపడం).. ఈ మూడు కలిస్తే ‘ప్రాణాయామం’ అవుతుంది. ఈ రకమైన సాధనవల్ల రాగాది దోషాలు తొలగిపోయి, శరీర స్పందనలు క్రమబద్ధమవుతాయి. ఇంద్రియాలను బాహ్యాంశాలనుంచి మరల్చి మనసులో నిలుపుకోవడమే ‘ప్రత్యాహారం’. దీనివల్ల అపరాధాలు, పాపాలు తొలగిపోతాయి. ఈ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు జీవుణ్ని ప్రాపంచిక విషయాల నుండి తొలగించడానికి ఉపయోగపడతాయి.

మనసును పరమాత్మపట్ల నిలిపి, కేంద్రీకరించడమే ‘ధారణ’. దీనితో ఇంద్రియ నిగ్రహం సాధ్యపడుతుంది. ఇది నిరంతరం కొనసాగితే మనసు నిశ్చలమై ‘ధ్యానం’లోకి వెళతాం. ఈ స్థితిలో ‘ఈశ్వర విరోధ భావం’ తొలగుతుంది. మనసు పూర్తిగా పరమాత్మపైనే నిలిచి జీవునికి, ఈశ్వరునికిగల భేదం తొలగి, సాధకుడు ‘సమాధి’లోకి వెళతాడు. తత్ఫలితంగానే అద్వైత భావన, స్వస్వరూప జ్ఞానస్థితి సిద్ధిస్తాయి. ఈ ధారణ, ధ్యాన, సమాధి స్థితులు పరస్పర పూరకాలుగా నిర్గుణ పరబ్రహ్మం పట్ల నిశ్చలబుద్ధిని ఏర్పరుస్తాయి. అప్పటికి ‘సమస్త సృష్టిలో ఉన్నది తానే’ అన్న స్థిరభావన కలుగుతుంది. ఈ క్రమపద్ధతితో సాగే పరమాత్మ ఉపాసనతోనే సాధకునికి అనిర్వచనీయమైన ‘అపరిమితానంద’ సిద్ధి సంప్రాప్తిస్తుంది.

యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః
సుఖేన బ్రహ్మ సంస్పర్శమ్‌ అత్యంతం సుఖమశ్నుతే ॥

భగవద్గీత (6-28)

‘కల్మషాలన్నీ తొలగిపోయిన యోగి ఈ రకంగా నిరంతరం ఆత్మను పరమాత్మలోనే లగ్నం చేయడం ద్వారా పరబ్రహ్మ ప్రాప్తి రూపమైన అపరిమిత ఆనందాన్ని అనుభవిస్తాడు’ అని శ్రీకృష్ణభగవానుడు ‘ఆత్మ సంయమ యోగాన్ని’ బోధించాడు.

యోగ సాధన రహస్యందోర్బల కుమారస్వామి
94400 49608

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యోగ సాధన రహస్యం
యోగ సాధన రహస్యం
యోగ సాధన రహస్యం

ట్రెండింగ్‌

Advertisement