e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home ఎడిట్‌ పేజీ సాహిత్య పిపాసి పీవీ

సాహిత్య పిపాసి పీవీ

సాహిత్య పిపాసి పీవీ

‘తెలంగాణ ముద్దుబిడ్డ. తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు ఒక దీర్ఘదర్శి, రాజనీతిజ్ఞుడు. సాహిత్య పిపాసి, భాషా ప్రేమికుడు. నిరాడంబరుడు. అంకితభావం ఉన్న నిస్వార్థ నేత. శాశ్వత యశస్కుడైన నాయక శిఖామణి. భారతజాతి యావత్త్తూ గర్వించదగ్గ మహోన్నతమూర్తి’ అని అంటున్నారు తెలుగు అకాడమీ మాజీ సభ్యులు, రచయిత, ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి. శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పీవీతో తనకున్న జ్ఞాపకాలను ‘నమస్తే తెలంగాణ’తో ఇలా పంచుకున్నారు.

పీవీ నరసింహారావుతో మీ మొదటి పరిచయం..?
తెలుగు అకాడమీకి పీవీ తొలి అధ్యక్షుడు. అదే సమయంలో అకాడమీలో నేను ఉద్యోగిగా చేరాను. పీవీ తరచూ అకాడమీకి రావడం వల్ల వారితో పరిచయం ఏర్పడింది. అటు తర్వాత పీవీ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. హైదరాబాద్‌ వచ్చినప్పుడు వెళ్లి కలిస్తే అప్యాయంగా పలకరించేవారు. 2004 అక్టోబర్‌లో గాంధీభవన్‌లో నిజాం రాజ్య స్వాతంత్య్ర సమరయోధులకు సన్మాన సభను నిర్వహించారు. ఆ సభకు పీవీ ముఖ్య అతిథిగా వచ్చి అందరినీ సత్కరించారు. నేనూ వెళ్లి కలిసినప్పుడు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

పీవీతో మీకున్న మరచిపోలేని జ్ఞాపకాలు?
1970లో ఎంఏ తెలుగులో నేను సర్వప్రథముడిగా నిలిచి స్వర్ణపతకాన్ని సాధించాను. ఆ కారణంతో నేను దరఖాస్తు చేయకున్నా నాకు తెలుగు అకాడమీలో అవకాశం లభించింది. ఉద్యోగ నియామక కాపీని అందుకొని చూడగా పీవీ నరసింహారావు సంతకం. ఉద్యోగంలో చేరిన కొంత కాలానికి పీవీ తెలుగు అకాడమీకి వచ్చారు. ఆ సందర్భంగా అకాడమీ డైరెక్టర్‌ డీఎస్‌ అప్పారావు నన్ను వెంట తీసుకెళ్లి పీవీకి పరిచయం చేశారు. ఆయన నన్ను ‘ఏ ఊరని’ అడిగితే, నేను ‘గద్వాల’ అని చెప్పాను. వెంటనే ‘ఓహో విద్వత్‌ గద్వాల. అందుకే గోల్డ్‌ మెడల్‌ వచ్చింది’ అని ప్రశంసించారు. రెండేండ్లలోనే మళ్లీ ఆయన చేతులమీదుగానే తొలి ప్రమోషన్‌ కాపీని అందుకోవడం మరో జ్ఞాపకం. తెలుగు అకాడమీ ప్రచురించే తొలి ‘తెలుగు’ జర్నల్‌కు నేను సంపాదకుడిగా ఉన్నప్పుడు ప్రధానిగా పీవీ బాధ్యతలను చేపట్టారు. ఆ సందర్భంగా నేను రాసిన ప్రత్యేక సంపాదకీయం ఆయన దృష్టికి వెళ్లడంతో మెచ్చుకున్నారు.

పీవీ ఔన్నత్యాన్ని వివరిస్తారా?
పీవీ ఇల్లు హిమాయత్‌నగర్‌లో ఉర్దూ హాలు పక్కనే ఉండేది. ఎప్పుడూ ప్రజల తాకిడి ఉండేది. సచివాలయంలోనూ ఎప్పుడూ బిజీబిజీగా ఉండేది. దీంతో మంత్రిత్వశాఖ ఫైళ్లు ఒక్కోసారి పెండింగ్‌లో పడుతుండేవి. అందుకే ఆయన అకాడమీలోని తన చాంబర్‌కే ఫైళ్లను తెచ్చుకొని క్లియర్‌ చేసేవారు. పీవీకి అదొక రహస్య స్థావరం. పనిపై ఆయనకు గల అంకితభావానికి అదొక నిదర్శనం. అంతేకాదు, పీవీ ఎంత ఎత్తుకు ఎదిగినా సహచరులను, స్నేహితులను మరచిపోలేదు. ప్రధాని బాధ్యతలను చేపట్టిన తర్వాత స్వాతంత్య్ర సమరయోధుడు, తన సహచరుడు పాగ పుల్లారెడ్డిని గవర్నర్‌గా నియమించాలని భావించారు. తనకు పదవి వద్దు కానీ గద్వాల- రాయచూరు రైల్వేమార్గాన్ని మంజూరు చేయాలని పుల్లారెడ్డి కోరారు. అంతే దానిని వెంటనే పూర్తిచేశారు. అలా గద్వాల అభివృద్ధికి బాటలు వేశారు కూడా.

తెలుగు అకాడమీ ఏర్పాటుకు, భాషాభివృద్ధికి చేసిన కృషిని వివరిస్తారా?
శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు న్యాయశాస్త్ర పారిభాషిక పదకోశాల రూపకల్పనలో పీవీ కీలకభూమికను పోషించారు. 40 ముద్రిత గ్రంథాలను వెలుగులోకి తెచ్చారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే, కొఠారి కమిషన్‌ సిఫార్సుల మేరకు మాతృభాషలోనే విద్యను బోధించాలనే సంకల్పంతో ఒక్కో భాషాభివృద్ధికి కేంద్రం రూ.కోటి నిధులను కేటాయించింది. దీంతో 1966లోనే సాహిత్య అకాడమీ ఏర్పాటు చేయడమే కాకుండా తొలి అధ్యక్ష బాధ్యతను స్వయంగా చేపట్టారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అధ్యక్షుడిగా ఉండి అకాడమీని మహోన్నత సంస్థగా తీర్చిదిద్దారు. తెలుగు అకాడమీ పీవీ మానసపుత్రిక. దీనిని స్వయం ప్రతిపత్తిగల, స్వయం సమృద్ధిగల సంస్థగా, విశ్వవిద్యాలయ స్థాయి సంస్థగా, భాషా పరిశోధనలకు వేదికగా, ప్రామాణికమైన గ్రంథాలు, నిఘంటువులను వెలువరించే సంస్థగా తీర్చిదిద్దారు. ఇతర భాషల అకాడమీలకంటే తెలుగు అకాడమీ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు అదే అకాడమీకి పీవీ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడం సముచితంగా ఉన్నది.

పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరుపై మీ అభిప్రాయం?
ఇప్పటివరకు రాజకీయ కారణాలవల్ల ఆ మహనీయుడికి తగినంత గుర్తింపు రాకపోవడం కొంత బాధ కలిగిస్తూనే ఉంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తుండటం హర్షించదగిన విషయం. పీవీ స్ఫూర్తిని నలుదిశలా చాటేలా కార్యక్రమాలను నిర్వహించటం ఆనందదాయకం.

Advertisement
సాహిత్య పిపాసి పీవీ
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement