e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home ఎడిట్‌ పేజీ శివారులోనూ ప్రగతి జోరు

శివారులోనూ ప్రగతి జోరు

ఏ నగర అభివృద్ధికైనా పక్కా ప్రణాళిక అవసరం. సరిగ్గా ఈ పాత్రనే హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పోషిస్తున్నది. విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న మహా నగరానికి కావాల్సిన ప్రణాళికలను ఎప్పటికప్పుడు హెచ్‌ఎండీఏ రూపొందిస్తున్నది. భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని, ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేస్తూ అందుకు తగ్గట్టుగా ప్రణాళిక రచిస్తున్నది. తనదైన శైలిలో ప్లానింగ్‌, పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లో ప్రధాన భూమికను పోషిస్తున్నది. అభివృద్ధి పనుల కోసం సొంతంగా ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి భారం తగ్గిస్తున్నది.

158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌ను మరింతగా ఆధునికీకరించాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు రూ.100 కోట్ల వ్యయంతో ఎల్‌ఈడీ లైటింగ్‌ను హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేస్తున్నది. ఓఆర్‌ఆర్‌లోని మొత్తం 165 అండర్‌ పాస్‌లపై హెచ్‌ఎండీఏ ప్రత్యేక దృష్టిపెట్టింది. భద్రతాపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 165 అండర్‌ పాస్‌ల వద్ద ఎల్‌ఈడీ లైటింగ్‌ ఏర్పాటుచేసింది.

శివారులోనూ ప్రగతి జోరు

హైదరాబాద్‌ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో 2008లో ఏర్పాటైన హెచ్‌ఎండీఏ ఇప్పటికీ ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నది. నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నది. ఏడు జిల్లాల్లోని 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న హెచ్‌ఎండీఏ శివార్లను మహా నగరానికి అనుసంధానం చేస్తూ అందుకు రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ చూపిస్తున్నది. ఒకప్పుడు హైదరాబాద్‌లో వంద గజాల స్థలం కొనాలంటే ఎంతో కిరికిరి ఉండేది. అమ్మిన స్థలాన్నే మళ్లీ అమ్ముతూ ప్రజలను మోసం చేసే దళారీ వ్యవస్థ ఉండేది. దానికి చెక్‌ పెడుతూ ప్రజల్లో నమ్మకాన్ని కల్పించింది హెచ్‌ఎండీఏ. హెచ్‌ఎండీఏ అప్రూవుడ్‌ లే అవుట్‌ ఉంటే ప్రజలకు భరోసా. హెచ్‌ఎండీఏ అనుమతి ఉంటే అన్ని సౌకర్యాలతో, నిబంధనలకు అనుగుణంగా ప్లాట్లు ఉంటాయని, భవిష్యత్‌లో ఏ సమస్య ఉండదనే నమ్మకం కొనుగోలుదారుల్లో వచ్చింది. దీనికి ప్రధాన కారణం హెచ్‌ఎండీఏనే.

నగర, శివారుల అభివృద్ధిలో హెచ్‌ఎండీఏ పాత్ర కీలకం. ఇందుకోసం కోట్లు ఖర్చు చేస్తున్నది. దీనికోసం వినూత్న పద్ధతుల్లో ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. ఇందుకు సరైన ఉదాహరణ ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌. ఇక్కడి రైతులను కోటీశ్వరులను చేసిన ఘనత హెచ్‌ఎండీఏకు దక్కుతుంది. ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతి ద్వారా గడ్డిపొలాల భూమిని సేకరించి చేసిన లే అవుట్‌ విజయవంతమైంది. రాష్ట్రంలోనే ఆదర్శ ప్రాజెక్టుగా ఇది మిగిలిపోనున్నది. రాష్ట్రం ఏర్పడిన ఏడాదిలోపే ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ శాఖామాత్యులు కేటీఆర్‌ పరిష్కారం చూపించారు. రైతుల కష్టాలకు, ఇబ్బందులకు చెక్‌ పెట్టారు.

ఒకప్పుడు ఉప్పల్‌లో ఉండే గడ్డిపొలాలను హెచ్‌ఎండీఏ బహుళ ప్రయోజనకరంగా తయారుచేసింది. గడ్డిపొలాలను సేకరించిన హెచ్‌ఎండీఏ కొంత భూమిని మెట్రో రైలు, తదితర ప్రజోపయోగాల కోసం వినియోగించింది. మిగతా భూమిలో అత్యాధునిక సౌకర్యాలతో స్వయంగా హెచ్‌ఎండీఏనే భారీ లే అవుట్‌ వేసింది. రైతులకు ఎకరానికి అభివృద్ధి చేసిన వెయ్యి గజాల ప్లాట్‌ ఇచ్చింది. ఫలితంగా హెచ్‌ఎండీఏకు భూములిచ్చి ప్లాట్లు పొందిన రైతులు భారీగా లాభపడ్డారు. ఇదే సమయంలో హెచ్‌ఎండీఏ వాటాగా వచ్చిన కొన్ని ప్లాట్లను వేలం వేసింది. హెచ్‌ఎండీఏ వాటాగా ఉన్న ప్లాట్లను విక్రయిస్తే రూ.1,013 కోట్లు వచ్చాయి. హెచ్‌ఎండీఏ లే అవుట్‌ ద్వారా ఒకప్పుడు శివారు ప్రాంతంగా ఉన్న ఉప్పల్‌ రూపురేఖలే మారిపోతున్నాయి. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నది.

నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ ఇదే విధంగా లే అవుట్లను వేస్తున్నది. కోకాపేటలో వివాదాస్పదంగా ఉన్న భూమిపై కోర్టుల్లో న్యాయ పోరాటం చేసి గెలిచిన భూమిలోనూ హెచ్‌ఎండీఏ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌గా లే అవుట్‌ను అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌ భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఓఆర్‌ఆర్‌ను హెచ్‌ఎండీఏ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు నగర అభివృద్ధి ఓఆర్‌ఆర్‌ను సైతం దాటింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారు. ఇప్పుడు జరగబోయే అభివృద్ధి మొత్తం ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్యనే జరగనున్నది. నవీ ముంబై తరహాలో శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు రానున్నాయి. ఇండస్ట్రియల్‌ కారిడార్లు కూడా ఓఆర్‌ఆర్‌-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్యనే ఏర్పాటుకానున్నాయి. వాక్‌ టూ వర్క్‌ అనే కాన్సెప్ట్‌తో పనిచేసే చోటు, నివాసాలు ఒకేదగ్గర ఉండేలా ఈ ప్రాంతంలోనే శాటిలైట్‌ టైన్‌షిప్‌లు నిర్మించాలనేది మంత్రి కేటీఆర్‌ ఆలోచన. ప్రణాళికబద్ధంగా కొత్త శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. వీటి ఏర్పాటులో హెచ్‌ఎండీఏదే కీలకపాత్ర కానున్నది.

జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ అనేక అభివృద్ధి పనులను హెచ్‌ఎండీఏ చేపడుతున్నది. నగరంలో అనేక రోడ్లు, ఫ్లై ఓవర్లు, పార్కులు, ఆధునిక శ్మశానాలు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీతో కలిసి హెచ్‌ఎండీఏ చేపడుతున్నది. ప్రస్తుతం ఉప్పల్‌, మెహిదీపట్నంలో రెండు భారీ స్కైవాక్‌లను నిర్మిస్తున్నది. నెక్లెస్‌ రోడ్డులో ఆధునిక పద్ధతి అయిన వీడీసీసీ రోడ్డును నిర్మిస్తున్నది. ఐటీ కారిడార్‌లో కీలకమైన ఐకియా జంక్షన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో అభివృద్ధి, సుందరీకరణ పనులను హెచ్‌ఎండీఏ చేపట్టింది. వీటిల్లో చాలావరకు పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చా యి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వెళ్లే పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేకు రీ కార్పెటింగ్‌ చేయడంతో పాటు కొత్త హంగులు అద్దింది. మహానగర అభివృద్ధిలో, మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనలో, ఉప్పల్‌ భగాయత్‌ వంటి లే అవుట్ల ఏర్పాటులో, శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల వంటి భారీ ప్రాజెక్టుల్లో హెచ్‌ఎండీఏ ఇదే రీతిలో ముందుకు సాగుతుంది.
(వ్యాసకర్త: అదనపు కమిషనర్‌, జీహెచ్‌ఎంసీ)

డా॥ ఎన్‌.యాదగిరిరావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
శివారులోనూ ప్రగతి జోరు

ట్రెండింగ్‌

Advertisement