e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home ఎడిట్‌ పేజీ చేసిన మేలును మరువరు జనం

చేసిన మేలును మరువరు జనం

చేసిన మేలును మరువరు జనం

బుద్ధుడు నడయాడిన నేలగా ప్రశస్తి చెందిన నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో రేపు ఉపఎన్నిక జరుగనున్నది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో అనివార్యమైన ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ నుంచి ఆయన కుమారుడు నోముల భగత్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి రంగంలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచార అస్ర్తాలుగా ఉపయోగించుకుంటున్నది. వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్తూ ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నది. టీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూస్తుంటే- 40 ఏండ్లు కూడా లేని యువకుడు 40 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డిపై గెలిచి చరిత్ర సృష్టించడం ఖాయమనిపిస్తున్నది.

చారిత్రక ప్రశస్తి కలిగిన నాగార్జునసాగర్‌ నియోజకవర్గం అభివృద్ధిని మాత్రం సాధించలేకపోయింది. సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా, 17 ఏండ్లు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి ఏనాడూ ప్రజల బాధలు, నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. నియోజకవర్గ కేంద్రంగా ఉన్నప్పటికీ కనీసం గ్రామపంచాయతీగా కూడా గుర్తింపునకు నాగార్జునసాగర్‌ (నందికొండ) నోచుకోలేకపోయింది. పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్నా గత పాలకుల నిర్లక్ష్యం సాగర్‌ పాలిట శాపమైంది. పక్కనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా కనీసం తాగు, సాగునీటిని వినియోగించుకోలేని దుస్థితి సాగర్‌ ప్రజలది. అసలు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం ఇక్కడ చేపట్టడంలోనే కుట్ర దాగి ఉన్నది. ప్రాజెక్టును తెలంగాణలో నిర్మించడంతో ఇక్కడి ప్రజలు భూములు, ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. త్యాగాలు తెలంగాణవి- ఫలాలు మాత్రం ఆంధ్రాకు అన్నట్టు ఇక్కడ కనీసం సురక్షిత తాగునీరు లేక ప్రజలు ఫ్లోరైడ్‌ బారిన పడ్డారు. ఇంత కుట్ర జరుగుతుంటే నాటి తెలంగాణ నాయకులు పదవీ కాంక్షతో ఈ అన్యాయాన్ని ఎదిరించనే లేదు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం, నాగార్జునసాగర్‌లోనూ అదే విధానం కొనసాగిస్తున్నది. వ్యవసాయరంగం అభివృద్ధి చెందాలంటే సాగునీటి వనరులు అత్యంత ప్రధానం. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో నీటి వనరుల లభ్యత, వినియోగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్‌ దాదాపు 18 ఏండ్లుగా నత్తనడకన సాగుతున్న వరద కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి 84 వేల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించారు. మిషన్‌ కాకతీయ ద్వారా నియోజకవర్గవ్యాప్తంగా 226 చెరువులు పునరుద్ధరించడం ద్వారా 17,574 ఎకరాలకు సాగునీటి వసతి కల్పిస్తున్నారు. ఏండ్ల తరబడి సాగర్‌ ప్రజలు ఎదురు చూస్తున్న నెల్లికల్‌ లిఫ్ట్‌ను మంజూరు చేయ డం వల్ల కరువు ప్రాంతాలైన ఎర్రచెరువు తండా, పిల్లిగుండ్ల తండా, జాలి తండా, మూల తండా, నెల్లికల్‌ గ్రామాల్లో 4200 ఎకరాలు సాగులోకి రానున్నాయి. కాకతీయుల కాలం నాటి రాచకాల్వ పునరుద్ధరణ కోసం 2017లో రూ.2.20 కోట్లు మంజూరు చేయడంతో ఈ కాలువ కింద ఉన్న 10 గ్రామాల ఆయకట్టుకు సాగు నీరు అందుతున్నది.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పర్యాటకరంగం విశేషంగా అభివృద్ధి చెందింది. నాగార్జునసాగర్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక ఆసక్తి కనబరిచి, హిల్‌కాలనీ డౌన్‌పార్క్‌లో 100 సీటింగ్‌ కెపాసిటీ గల రెండు తాత్కాలిక లాంచీలతో లాంచీ స్టేషన్‌ ఏర్పాటుచేశారు. 4.5 కోట్లతో ఇక్కడ శాశ్వత లాంచ్‌స్టేషన్‌ నిర్మాణం చేపడుతున్నారు. 60 లక్షలతో మెకనైజ్డ్‌ బోటును అందుబాటులోకి తెచ్చారు. ఇది నాగార్జునసాగర్‌ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి ఎంతగానో దోహదపడుతుంది.

2018లో నందికొండ మున్సిపాలిటీగా మారడంతో అభివృద్ధి ఊపందుకున్నది. పట్టణ ప్రణాళికలో నిధుల కేటాయింపులతో పాటుగా, పాలిటెక్నిక్‌ కళాశాల హాస్టల్‌, బీసీ గురుకుల కళాశాల ఏర్పాటు జరిగింది. రూ.18 కోట్లతో కమలా నెహ్రూ ఆస్పత్రి ఆధునీకీకరణ జరిగింది. నందికొండలో మరొక డిగ్రీ కళాశాలను ఏర్పాటుచేస్తామని తాజాగా ప్రచారసభలో కేసీఆర్‌ హామీ ఇచ్చారు. గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న హాలియాను మున్సిపాలిటీగా మారుస్తూ మౌలిక వసతులు కల్పించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఒక్క నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోనే 8 గురుకులాలు ఏర్పాటుచేయడం కేసీఆర్‌కు ఈ నియోజకవర్గంపై ఉన్న ప్రత్యేకమైన దృష్టికి నిదర్శనం. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేయడంతో పాటు మౌలిక వసతుల కల్పన జరగడంతో ఆర్థికవృద్ధిని సాధించాయి.

నాగార్జునసాగర్‌లో ఉపాధి అవకాశాలు అధికశాతం రైస్‌మిల్లులు, ఫార్మారంగాల్లోనే ఉన్నయి. ప్రభుత్వ భూములు వేల ఎకరాలు ఉన్నప్పటికీ పారిశ్రామికరంగ అభివృద్ధి కోసం, అటవీశాఖ అనుమతుల కోసం నాటి పాలకులు చేసిన ప్రయత్నాలు శూన్యం. తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ సారథ్యంలో పారిశ్రామిక రంగం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోనూ ఆ దిశగా అభివృద్ధికి ప్రణాళికల రూపకల్పన జరుగుతున్నది.

వామపక్షాలతో పాటు ఉస్మానియా ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకుడు టీఆర్‌ఎస్‌కే తమ సంపూర్ణ మద్దతు అని ప్రకటించడం గమనార్హం. కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇందుకు కారణం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నది. కేసీఆర్‌ సోషల్‌ ఇంజినీర్‌గా అన్నివర్గాల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నారు. సెక్యులరిజం, ఫెడరలిజం విలువలకు కట్టుబడి ఉన్నారు. పోలింగ్‌కు ముందే భగత్‌ గెలుపు స్పష్టమైంది. ఇప్పటికైనా ‘కేసీఆర్‌ వెంటే తెలంగాణ ప్రజలు- తెలంగాణ అంటేనే కేసీఆర్‌’ అని ప్రతిపక్షాలు గుర్తించాలి.
(వ్యాసకర్త: డీన్‌, అకాడమిక్‌ ఆడిట్‌, కాకతీయ విశ్వవిద్యాలయం)

చేసిన మేలును మరువరు జనం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చేసిన మేలును మరువరు జనం

ట్రెండింగ్‌

Advertisement