e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home ఎడిట్‌ పేజీ బ్యాంకింగ్‌ సంస్కరణల పితామహుడు

బ్యాంకింగ్‌ సంస్కరణల పితామహుడు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) లో రీసెర్చ్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ శాఖలో రీసెర్చ్‌ ఆఫీసర్‌గా చేరి, అసమాన ప్రతిభా పాట వాలతో ఆ ప్రతిష్ఠాత్మక సంస్థ పదమూడో చైర్మన్‌ పదవిని చేపట్టిన మైదవోలు నరసిం హం మరణంతో భారత దేశం బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగ సంస్కరణల పితామ హుడిని, తెలుగు జాతి మరొక ముద్దు బిడ్డను కోల్పోయినట్లయింది.

బ్యాంకింగ్‌ సంస్కరణల పితామహుడు

ఫైనాన్స్‌ సెక్రటరీగా సేవలందిస్తున్న నరసింహం తన మాతృమూర్తిని దగ్గరుండి సేవలందించడం కోసమని ప్రధాని ఇందిరాగాంధీ అభీష్టానికి విరుద్ధంగా పదవి వీడి హైదరాబాద్‌ వచ్చారు. దేశానికి మీరు చేసిన సేవలకు ధన్యవాదాలంటూ.. ఇందిర కారు దాకా వచ్చి నరసింహంకు వీడ్కోలు పలికారు. ఇందిర హయాంలోనే కాకుండా ఆ తర్వాతికాలంలో కూడా దేశ ఆర్థికరంగంబలోపేతానికి ప్రభుత్వాలకు, ఉన్నతస్థాయి అధికారులకు సూచనలు సలహాలు ఇస్తూ ఆయన పరోక్ష పాత్ర పోషించారు.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లో జీవనసంధ్యలో ఒంటరిగా పత్రికలు చదువుతూ టెలివిజన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తూ కాలక్షేపం చేస్తున్న 94 ఏండ్ల పండుటాకు, పరమ సాత్విక మృదు మిత భాషకుడి కరోనాపై పది రోజుల పోరాటం ఈ నెల 20న ముగిసింది. 1927 జూన్‌ 3న నెల్లూరులో జన్మించిన నరసింహం భారత ప్రథమ ఉప రాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మనుమడు. తాత మేధోసంపత్తి, తాత్త్వికత, విజ్ఞానతృష్ణలకు ఆర్థికశాస్త్రం, క్రీడాభిలాష తోడై అవతరించిన మహా మనీషి నరసింహం. దేశం రాజకీయంగా, ఆర్థికంగా విషమ పరిస్థితులు ఎదుర్కుంటున్న 1977లో ఆర్బీఐ గవర్నర్‌గా ఏడు నెలల పాటే పనిచేసినా ఆయన భారత ఆర్థికరంగంపై వేసిన ముద్ర అజరామరంగా నిలిచిపోతుంది. ప్రపంచబ్యాంకుకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌), ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)లకు సేవలందించిన నరసింహం ఆధ్వర్యంలోని కమిటీలు రెండు చేసిన సిఫారసులు భారతదేశ బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగాలపై బలీయమైన ముద్ర వేశాయి. ఫైనాన్స్‌ల సిస్టమ్స్‌పై ఏర్పడిన కమిటీకి 1991లో, బ్యాంకింగ్‌ సెక్టార్‌ రిఫార్మ్స్‌పై నియమితమైన కమిటీకి 1998లో ఆయన నేతృత్వం వహించారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో మార్పులు, ప్రైవేటురంగ బ్యాంకుల ఏర్పాటు, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఆధునికీకరణలతో పాటు గ్రామీణ వ్యవస్థకు జవసత్వాలు ఇచ్చేలా గ్రామీణబ్యాంకుల స్థాపన వంటి సానుకూల నిర్ణయాలు ఈ కమిటీల సిఫారసుల పుణ్యమే.

ఆర్థికంగా బలోపేతమై అభివృద్ధి చెందుతున్న దేశంగా రూపుదిద్దుకుంటున్న భారత్‌లో మూడంచెల బ్యాంకింగ్‌ వ్యవస్థను నరసింహం కమిటీ-2 సిఫారసు చేసింది. అంతర్జాతీయ కార్యకలాపాలు కేంద్రంగా మూడు పెద్ద బ్యాంకులు, 8 నుంచి 10 జాతీయ బ్యాంకులు, పెద్ద సంఖ్యలో ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు ఉండాలని కమిటీ సూచించింది.‘నరసింహం కమిటీలు’ చేసిన సిఫారసులు చిత్తశుద్ధితో అమలుచేస్తే విశేష ఫలితాలుండేవని నిపుణులు వ్యాఖ్యానిస్తుంటారు. ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తోపాటు అనేక మంది ఆర్థిక నిపుణులతో సన్నిహిత సంబంధాలున్న ఆయన తెరవెనుక చేసిన సూచనలు, అందించిన మేధో సహకారం భారత ఆర్థికరంగం సంస్కరణల పట్టాలపై పరిగెట్టడంలో తగు పాత్ర పోషించాయి.

నరసింహం నిజమైన దార్శనికుడు, అద్భుతమైన మేధావి అని ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఉషా థోరట్‌ చేసిన వ్యాఖ్య అక్షర సత్యం. 1976లో రీజనల్‌ రూరల్‌ బ్యాంక్‌ (ఆర్‌ఆర్‌బీ) రిపోర్ట్‌ను నరసింహం ఒకే ఒక్క రోజులో రచించారట. భారత్‌ ఆత్మ గ్రామాలని భావించే ఆయన గ్రామీణ బ్యాంకులు ‘లోకల్‌ ఫీల్‌’, ‘లోకల్‌ టచ్‌’తో ఉండాలని చెప్పారు. వ్యవసాయరంగానికి, గ్రామీణ వికాసానికి బ్యాంకులు ఇతోధిక సేవ చేయాలని ఆయన గట్టిగా చెప్పేవారు. నరసింహంను 2000లో పద్మ విభూషణ్‌ వరించింది. భారతదేశంలో మేనేజ్‌మెంట్‌ విద్యను అందించేందుకు బ్రిటన్‌లోని హెన్లీ ఆన్‌ థేమ్స్‌ సంస్థ నమూనాగా 1956లో హైదరాబాద్‌లో ఏర్పడిన అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ) పట్ల నరసింహంకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఫైనాన్స్‌ సెక్రటరీగా సేవలందిస్తున్న నరసింహం తన మాతృమూర్తిని దగ్గరుండి సేవలందించడం కోసమని ప్రధాని ఇందిరాగాంధీ అభీష్టానికి విరుద్ధంగా పదవి వీడి హైదరాబాద్‌ వచ్చారు. దేశానికి మీరు చేసిన సేవలకు ధన్యవాదాలంటూ.. ఇందిర కారు దాకా వచ్చి నరసింహంకు వీడ్కోలు పలికారు. ఇందిర హయాంలోనే కాకుండా ఆ తర్వాతికాలంలో కూడా దేశ ఆర్థికరంగం బలోపేతానికి ప్రభుత్వాలకు, ఉన్నతస్థాయి అధికారులకు సూచనలు సలహాలు ఇస్తూ ఆయన పరోక్ష పాత్ర పోషించారు.

సిబ్బందికి జీతాలు ఇచ్చే స్థితిలో లేని ఆస్కీని గాడిలో పెట్టేందుకు, పూర్వ వైభవం తెచ్చేందుకు ఆస్కీ ప్రిన్సిపల్‌(ఇప్పుడు దాన్ని డైరెక్టర్‌ జనరల్‌ అంటున్నారు)గా, వైస్‌-చైర్మన్‌గా, చైర్మన్‌గా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. చైర్మన్‌ ఎమిరిటస్‌ గా తుదిశ్వాస విడిచేవరకూ ఆయన పనిచేశారు. రెండేండ్ల కిందటి వరకూ క్రమం తప్పకుండా బెల్ల విస్తాకు వచ్చిన ఆయన కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, తెలుగు బిడ్డ కంటిపూడి పద్మనాభయ్య చైర్మన్‌ పదవి చేపట్టడంలో కూడా తనదైన పాత్ర పోషించారు. సంస్థ కోసం అహరహం కృషిచేసిన నరసింహం సతీమణి ఆరేండ్ల కిందట కన్ను మూశారు. కుమారుడు విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ సమయంలో ఒంటరిగా ఉన్న నరసింహం బాగోగులు ఆస్కీ సిబ్బందే చూసుకునేవారు.

జీతాలు ఇచ్చే స్థితిలో లేని ఆస్కీ కోసం కోటి రూపాయల రుణం కోసం నరసింహం లేఖ రాస్తే, ఇందిరాగాంధీ రెండు కోట్లు కేటాయించి తన అభిమానాన్ని చాటుకున్నారని ఆయన దగ్గర చాలా ఏండ్లపాటు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శామ్యూల్‌ అబ్రహం గుర్తు చేసుకున్నారు. డబ్బులేని పరిస్థితిలో ధైర్యంగా ఉద్యోగుల వేతన సవరణ చేసి, అధ్యాపకులను కార్యోన్ముఖులను చేసిన స్ఫూర్తిదాతగా అబ్రహం లాంటి ఆస్కీ ఉద్యోగులకు గుర్తుండిపోతారు. పరిపాలనాదక్షత విశేషంగా ఉన్న పద్మనాభయ్య ‘సేఫ్‌ హాండ్స్‌’లో ఆస్కీ ఉందని నరసింహం మురిసిపోయేవారు.

కాలేజీ రోజుల్లో క్రికెట్‌లో రాణించిన నరసింహంకు ఆ క్రీడ పట్ల విపరీతమైన అభిమానం ఉండేది. అప్పటి ఆటగాళ్లు ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌, కండ్లు చెదిరే స్ట్రోక్స్‌ గుర్తు చేసుకొని ఆనందించేవారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఏ మ్యాచ్‌ వచ్చినా వదలకుండా తన్మయత్వంతో చూసి ఆటను ఆస్వాదించిన నరసింహం ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ టోర్నమెంట్‌ కోసం ఎదురుచూస్తుండగానే కరోనా బారినపడ్డారు. 94 నాటౌట్‌గానే ఆర్థికవేత్తలకు, తెలుగు వారికి నరసింహం గుర్తుండిపోతారు.
(వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్టు, జర్నలిజం బోధకుడు)

డాక్టర్‌ ఎస్‌.రాము

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బ్యాంకింగ్‌ సంస్కరణల పితామహుడు

ట్రెండింగ్‌

Advertisement