‘పలుకే బంగారమాయె, పిలిచిన పలుకవేమి..’ అంటూ రాముడిని తలుచుకొని బాధపడతాడు భక్త రామదాసు. పలుకు బంగారమైందీ అంటే అత్యంత విలువైందిగా మారిపోయిందని! భారతీయులకు బంగారమంటే మోజు. ప్రత్యేకించి మహిళలు బంగారమంటే మురిసిపోతారు. అందుకేనేమో సీతమ్మ తల్లికి రామదాసు ఆభరణాలు చేయించాడు. ‘సీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్రా, ఆ పతకానికి పట్టె పదివేల వరహాలు రామచంద్రా’ అని చెప్పుకొంటాడు. ఒకప్పుడు పురుషులు కూడా ఆభరణాలు ధరించేవారు. ఒంటినిండా నగలు ధరించడం పూర్వకాలంలో సాధారణం. ఇప్పుడిప్పుడు పురుషులు మళ్ళీ ఒకటి అరా ఆభరణాలు ధరించినా నగలంటే మహిళలకే ఎక్కువ ఇష్టం. ఇప్పుడు బ్యాంకు ఖాతాలు వచ్చాయి కానీ, ఒకప్పుడు ఉంగరాలు, దండ కడియాలు ఉంటే వృద్ధాప్యంలో భద్రత ఉన్నట్టు.
ఒంటినిండా ఎన్ని రకాల ఆభరణాలు ధరించేవారో భాగవతంలో పోతన వర్ణన చూస్తే అర్థమవుతుంది. ‘రవి బింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై/ శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై/ ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్ఘంటయై నూపుర/ ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్’ అంటూ వామనుడు ఇంతింతై పెరిగే కొద్దీ సూర్యుడు అతడికి ఏయే ఆభరణాల మాదిరిగా కనిపించాడో వర్ణించాడు. మొదట శిరోమణిగా, మకర కుండలంగా, కంఠాభరణంగా, భుజకీర్తిగా, కంకణంగా, మొలలో గంటగా, కాలి అందెగా సూర్యుడు భాసిల్లాడట! ఉత్తరాదిలో మగువల నిండైన అలంకారాన్ని ‘సోలా శృంగార్’ అంటారు. పాపిటలో సింధూరం, బొట్టు, కాటుక, మైదాకు, పారాణి మినహాయిస్తే మిగతా అలంకారాలన్నీ ఆభరణాలే. పట్టా గొలుసులు, మట్టెలు వెండివి, మిగతావన్నీ బంగారువే. ముక్కు పుడక, చెవి పోగులు, కంఠాభరణం, కంకణాలు, గాజులు, వడ్డాణం మొదలైనవన్నీ సహజ సౌందర్యాన్ని మరింత మెరిపిస్తాయి. దుద్దులు, లోలాకులు, గున్నాలు.. ఒక్కో ఆభరణంలో ఎన్నో వైవిధ్యాలు!
కరోనా హెచ్చుతగ్గుల మాటెలా ఉన్నా, గతేడాది ఆగస్టులో శిఖర స్థాయికి చేరుకున్న బంగారం ధర దక్షిణం వైపుగా జారుకుంటూ వస్తున్నది. తాజా బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దిగుమతి సుంకాన్ని తగ్గించి ఆడపడచులకు ఆనందాన్ని పంచారు. బంగారం హెచ్చుతగ్గులకు అంతర్జాతీయ స్థాయిలో చాలా కారణాలుంటాయి. ఇతర కరెన్సీలతో పోలిస్తే, డాలర్ బలపడినప్పుడల్లా బంగారం డీలా పడుతుంది. ఇప్పుడు అమెరికాలో డాలర్తోపాటు, బాండ్ లాభాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈక్విటీలపై జనం మోజు పెరిగింది. ఈ కారణాలన్నీ బంగారం ధర తగ్గడానికి కారణమంటున్నారు. బంగారంలో మదుపు చేసిన పెద్ద మనుషులకు ఇది బాధ కలిగించవచ్చు. కానీ స్వర్ణం ధర తగ్గడం మహిళలకు సంతోషకరమే కదా! కారణాలు ఏవైనా తరుణులకు ఇది మంచి తరుణం!