e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home ఎడిట్‌ పేజీ మారిపోయింది..మీరే ఈటలా!

మారిపోయింది..మీరే ఈటలా!

కళ్యాణలక్ష్మి, ఆసరా పథకాలు పంటలో పరిగె ఏరుకోవడం లాంటివి.
పేదల సాధికారత కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీసీ అని చెప్పుకునే ఈటల రాజేందర్‌ మంత్రి హోదాలో 2021 మార్చి 20న చేసిన ప్రకటన ఇదీ.
మంత్రి పదవి భిక్ష కాదు. గులాబీ జెండా ఓనర్లం మేమే. తెగించి కొట్టాడినందుకు, ఆత్మగౌరవంతో పోరాడినందుకు వచ్చింది.
హుజూరాబాద్‌లో మీటింగ్‌లో 2019 ఆగస్టు 30న మంత్రి హోదాలో ఈటల రాజేందర్‌.
గుడ్డివాడివి, నీకెందుకు పదవి. పదవి ఇస్తే ఏం చేస్తవు. ఏం ఉద్ధరించడానికి, ఇంట్లో కూర్చోక. ప్రతి ఒక్కడికీ ఇదే పని.
బయోడేటా ఇచ్చేందుకు ప్రయత్నించిన నల్లగొండకు చెందిన అంధ పాఠశాల నిర్వాహకుడితో మంత్రి ఈటల ఈసడింపు.
మనం నవ్వుకుంటూ పోతే ఈటల రాజేందర్‌ దిగాలుగా ఉంటరు. మనం దిగాలుగా పోతే ఆయన నవ్వుకుంటా ఉంటరు. అంతే ఏమీ అర్థం కాక మనం ఆగిపోతాం. ఈటల రాజేందర్‌ మాటలలో పేదలు, పేదరికం, ప్రజాస్వామ్యం, హక్కులు ఎన్నో చెప్తారు. ఆపతిలో ఉండి ఎవరైనా పోతే మాత్రం మొహం చూడడు. కనీసం నమస్తే పెట్టినా చూడనట్లుగానే ఉంటారు.
ఈటల రాజేందర్‌ సొంతూరు కమలాపూర్‌లో మూడు దశాబ్దాలుగా పాత్రికేయుడిగా పనిచేస్తున్న వ్యక్తి అనుభవం.
ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌కు చేసిన దానితో పోల్చితే టీఆర్‌ఎస్‌ ఆయనకు లక్ష రెట్లు ఎక్కువే ఇచ్చింది. టీఆర్‌ఎస్‌లోకి వచ్చినప్పటి నుంచి ఏ రోజు కూడా ఈటల రాజేందర్‌ అవకాశం లేకుండా లేడు.
ఈటల రాజేందర్‌తో 21 ఏండ్లుగా సన్నిహితంగా ఉంటున్న హుజూరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ నేత విశ్లేషణ.

మారిపోయింది..మీరే ఈటలా!

‘నేను ఈటల రాజేందర్‌ను. ఈటల రాజేందర్‌ ఆస్తులైనా పోగొట్టుకుంటాడు గానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోడు’. ఇదీ ఇటీవల ఆయన పదేపదే చెప్తున్న మాట. ఇంతకీ ఎవరీ ఈటల? 20 ఏండ్ల్ల కిందట ఈ ఈటల ఎక్కడున్నారు? ఇప్పుడెక్కడున్నారు? అందుకు ఎవరు కారణం? తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్‌ పాత్ర ఏమిటో ఇప్పుడు చాలామందికి తెలిసి ఉండదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ నేతృత్వంలో 2000లోనే చర్చలు మొదలయ్యాయి. ఉద్యమ వ్యూహాలపై నెలలపాటు సమాలోచన సాగింది. రాజకీయ పార్టీ ఏర్పాటు ఆలోచన ఉన్నా వ్యూహాత్మక సమయం కోసం వేచి ఉన్నారు. పంచాయతీ, పరిషత్‌ ఎన్నికలు రాజకీయ పార్టీ లాంచింగ్‌కు అనువైన సమయంగా భావించి 2001 ఏప్రిల్‌ 27న కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ఏర్పాటును ప్రకటించారు. అప్పటికే అమలవుతున్న ఉద్యమ కార్యాచరణ అప్పుడే రాజకీయ మార్గాన్ని సంతరించుకున్నది.

2001 జూలైలో జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తెలంగాణ వ్యాప్తంగా 85 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్నది. కమలాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్‌ పదవిని సైతం టీఆర్‌ఎస్‌ దక్కించుకున్నది. అప్పటికి కమలాపూర్‌కు ఈటలకు రాజకీయంగా ఏ సంబంధమూ లేదు. ఈటల అసలు టీఆర్‌ఎస్‌లోకే రాలేదు. నెల తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ బలపరిచిన 3 వేల మంది సర్పంచులుగా, 12 వేల మంది వార్డు మెంబర్లుగా ఎన్నికయ్యారు. కమలాపూర్‌ నియోజకవర్గంలోని అత్యధిక సర్పంచ్‌, వార్డుసభ్యుల స్థానాలను అప్పటి అధికార టీడీపీని ఎదిరించి, టీఆర్‌ఎస్‌ గెలిచింది. ఈటల రాజేందర్‌ అప్పటికి వార్డు మెంబరు కూడా కాదు.

కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. 2003లో అనుకుంటా, పౌల్ట్రీ ఫారాలను కిరాయికి తీసుకొని నడుపుకొంటున్న ఈటల రాజేందర్‌ కేసీఆర్‌ దగ్గరికి వచ్చిండు. యువకుడు, ఉత్సాహవంతుడిగా ఉన్న రాజేందర్‌ను కేసీఆర్‌ దగ్గరికి తీశారు. అప్పటికి నేను కమలాపూర్‌ టీఆర్‌ఎస్‌ ఇంచార్జీ బాధ్యతలతో ఉన్న. మా జిల్లాకు ఆనుకొని ఉన్న నియోజకవర్గం అది. అప్పుడు టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పడిన బ్రిగేడ్‌గా నేను కమలాపూర్‌లోని వీణవంకలోనూ పార్టీ కార్యక్రమాలు చేపట్టాను. అలా కమలాపూర్‌ సెగ్మెంట్‌తో నాకు అనుబంధం.

మొదటిసారి ఎమ్మెల్యే అయినా శాసనసభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేతగా రాజేందర్‌కు కేసీఆర్‌ ఉన్నత స్థానం కల్పించారు. 2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే కీలకమైన ఆర్థిక, ప్రణాళిక, పౌర సరఫరాల శాఖకు కేటాయించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక మరో కీలకమైన వైద్యశాఖను అప్పగించారు. ప్రభుత్వ కమిటీలో, మంత్రివర్గ ఉప సంఘాలలో ప్రాధాన్యం ఇచ్చారు. రాజేందర్‌ లోటుపాట్లను కనిపెడుతూ సర్ది చెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే సీఎం పదవి తప్ప కేసీఆర్‌ రాజేందర్‌కు అన్నీ ఇచ్చారు.

మనిషికి ఆస్తులు లేనప్పుడు అవి ఎలా వస్తాయనే రంది ఉంటుంది. ఆస్తులు వచ్చినంక వాటిని ఎలా కాపాడుకోవాలనే రంది. ఆ ఆస్తులు తప్పుడు మార్గంలో వస్తే ఎప్పుడు, ఎలా పోతాయా అనే భయం ఉంటుంది. ఈ భయం నుంచి బ్లాక్‌మెయిల్‌ చేసే మనస్తత్వం వస్తది. ఈటల రాజేందర్‌ చేసింది అదే. అక్రమ ఆస్తులు పోతాయని భయం. వాటిని ఎలాగైనా కాపాడుకోవాలనే ఆరాటం. ఆ ఆరాటంలోనే కేసీఆర్‌ను భయపెట్టి తను సురక్షితంగా ఉండాలన్న ఆలోచన. వీలైతే తానే అత్యున్నత పదవి చేపట్టాలనే దాకా వెళ్లాడు. పదేపదే బీసీ నినాదం అందుకే. బీసీనని చెప్పుకుంటూ, బీసీకి పదవులు ఎందుకు దక్కకూడదంటూ రాజకీయ లక్ష్యాల కోసం మీరు ఇటీవల కుల సంఘాలతో మీటింగులు పెట్టిన మాట వాస్తవం కాదా? జర్నలిస్టులతో మేధోమథనాలు జరిపిన మాట నిజం కాదా? దొర అంటూ కేసీఆర్‌పై ఆయన కుటుంబంపై బహిరంగ విమర్శలు నిజం కాదా! నాకొక మిత్రుడు చెప్పిన మాటే నిజమైతే మూడు వేల ఎకరాలున్న మీరు దొరనా? లేక కుల మతాలతో సంబంధం లేకుండా రాత్రింబవళ్లు తెలంగాణ శ్రేయస్సు కోసం ఆలోచించే కేసీఆర్‌ దొరనా? ఎవరికి తెలియవు ఇవన్నీ? ఏమిటీ మీ సమావేశాల లక్ష్యం? కేసీఆర్‌ మీకు ఏం తక్కువ చేశారని ఇంట్లో మేధోమథనాలు. ప్రభుత్వ విధానాలపై, నాయకుడిపై మీరే వ్యతిరేకంగా మాట్లాడడం ఏం రీతి? నేను పార్టీ పెడతానన్లేదు, వేరే పార్టీలోకి పోతానన్లేదు అంటూ మీరు మాట్లాడుతుంటే గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్టు ఉంది. ఎక్కడైనా మంత్రిపై అక్రమాల ఆరోపణలు వస్తే ప్రతిపక్షాలు రాజీనామాకు డిమాం డ్‌ చేస్తాయి. ఇక్కడ మాత్రం మీపై విచారణకు ఆదేశిస్తే ప్రతిపక్షాల్లోని ముఖ్యనేతలు మీకు మద్దతుగా మాట్లాడుతున్నారు. వారితో మీకున్న చీకటి ఒప్పందాలు ఏమిటి?

తెలంగాణను దెబ్బకొట్టాలంటే టీఆర్‌ఎస్‌ను బలహీనపర్చడం ఒక్కటే మార్గం అని గతంలో ప్రత్యర్థి పార్టీలు ఆలోచించేవి. ఆ మేరకు ప్రయత్నించేవి. చేసేదేదో అవి బహిరంగంగానే చేసేవి. కానీ మీరు చేసిందేమిటి? పార్టీలో ఉంటూ, ప్రభుత్వ పదవిని అనుభవిస్తూ, సొంత ప్రభుత్వంపై విమర్శలు, కుట్రలు. ప్రతిపక్ష పార్టీల్లోని నేతలతో మీరు ఎక్కడెక్కడ కలిశారో తెలియనిది ఎవరికి? కేసీఆర్‌ మీకేం చేశారో, ఒక్కసారి మీ అంతరాత్మను అడగండి. నిజం మీకే తెలుస్తుంది. కడుపుల విషం పెట్టుకొని కాటేయడానికి ప్రయత్నించారు. అన్నం పెట్టిన చెయ్యిని నరికేయజూశారు. కేసీఆర్‌ అధర్మం చేయడని మీరే అన్నారు. కానీ మీరు నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు.
కొట్లాడితేనే బీసీలకు పదవులు వస్తాయని మీరు రెచ్చగొడతరు. వారిలో అశాంతి లేపడానికి చూస్తరు. మీరు ఏం కొట్లాడినారని కేసీఆర్‌ మీకు పదవులు ఇచ్చారు? మంచితనానికి, నమ్మకానికి విలువ లేదని మీలాంటి వాళ్లను చూస్తేనే అనిపిస్తుంది. టీఆర్‌ఎస్‌ బలహీనపడితే తెలంగాణ దెబ్బతింటుందని 19 ఏండ్లు ఆ పార్టీలో ఉన్న మీకు తెలియదనుకోవాలా? తెలిసీ, ద్రోహులతో చేతులు కలిపి చేసే ద్రోహాన్ని ఏ పేరుతో పిలవాలి?

పదేపదే బీసీని అని చెప్పుకునే ఈటల రాజేందర్‌ అసలు తత్త్వం ఏమిటో పైన నేను చెప్పిన ఉదాహరణల్లోనే ఉంది. భారతావనిలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. కళ్యాణలక్ష్మి, ఆసరా పింఛన్ల పథకాలతో మెజారిటీ జనాభా ఉన్న బీసీ వర్గాలకే ఎక్కువ మేలు జరుగుతున్నది. పేదలకు ఈ పథకాలు అండగా ఉంటున్నాయి.

బీసీ అని చెప్పుకునే ఈటల రాజేందర్‌ మంత్రిగా ఏం చేయాలి? సీఎం కేసీఆర్‌ను ఒప్పించి సంక్షేమ పథకాలను మరింత విస్తృతం చేసేలా ప్రయత్నించాలి. కానీ ఈటల రాజేందర్‌ నిరుపేదల కడుపు నింపే సంక్షేమ పథకాలను పంటలు, పరిగెలు అని హేళన చేస్తారు. అందరికీ మీలాగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల ఎకరాలు సంపాదించే తెలివి తేటలు ఉండవు కదా రాజేందర్‌!

బీసీ అని చెప్పుకొనే ఈటల రాజేందర్‌ పేదలకు భూములు ఇవ్వాలని కొట్లాడాలి. దీనికోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవా లి. అలా చేయకుండా ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములను బలవంతంగా గుంజుకుంటాడు. ఒకచోట, రెండు చోట్ల కాదు, ఎక్కడ పడితే ఇవే ఆరోపణలు. బియ్యం తిన్నానని చెప్పుకొనే ఈటల రాజేందర్‌కు పేదలకు భూములు ఎంత అవసరమో, వారికి బతుకుదెరువు ఏమిటో తెలియదా? తాను పెద్దవాడు అయితే చాలు అంతేనా? ఈటల రాజేందర్‌ బీసీ అని చెప్పుకుంటాడు. ఆయన ఇంట బీసీలు లేరు. ఆయన వెంట బీసీలు లేరు. రాజేందర్‌ చేసిన వేల ఎకరాల భూముల వ్యవహారంలో, వేల కోట్ల వ్యాపారంలో ఒక్క బీసీ భాగస్వామి ఉండడు. అయినా రాజేందర్‌ వేల ఎకరాలు ఉన్న నువ్వు వెనుకబడిన వాడివి ఎలా అవుతావు? నీకు కావాల్సింది మా బీసీ ఓట్లు మాత్రమే తప్ప బీసీల అభివృద్ధి కాదు. మా మీద కాదు, మాతో వస్తుందనుకునే అధికారం మీదే, పదవుల మీదే మీ ప్రేమ.

బీసీ నాయకుడిగా గౌరవించి కేసీఆర్‌ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువస్తే మీరు బీసీలకు చేసిందేమిటి? బీసీల పట్ల మీ వ్యవహారశైలి ఏమిటి? కనీసం హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు చేసిందేమిటి. అందుకే ఈ రోజు మీ వెంట పట్టుమని పది మంది కూడా లేరు. మీపై ఎవరికీ సానుభూతి లేదు. నీ సొంతూరు కమలాపూర్‌లోనూ ఎవరూ మీ తీరు మెచ్చడంలేదు. మాట్లాడితే పోరాటాలు అంటావు. బీసీలపైనే పోలీసులు కేసులు పెట్టించిన చరిత్ర నీది. ప్రశ్నించిన వాళ్లలో ఎందరిని వేధించావో కమలాపూర్‌లోని యువకులు కథలుకథలుగా చెప్తున్నరు. ఇప్పుడు కమలాపూర్‌లో ఈటల గురించి అడిగితే ఆహా అట్లనా అనే వాళ్లేగానీ, అయ్యో అని అన్నవాళ్లు కనిపించడం లేదు. ఆస్తులు సంపాదించడంలో పెట్టిన శ్రద్ధ పేదలకు మేలు చేసే విషయంలో పెట్టలేదు. అక్రమాలు చేసి ఆస్తులు సంపాదించి కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నావు. గులాబీ జెండాకు ఓనర్లెవరో నిర్ణయించేది నువ్వు కాదు. టీఆర్‌ఎస్‌ను ఆదరిస్తున్న అభిమానిస్తున్న తెలంగాణ ప్రజలే గులాబీ జెండా ఓనర్లు. వరుస ఎన్నికల్లో వారు ఇస్తున్న ఆశీ ర్వాదమే అందుకు నిదర్శనం.

మనిషికి మొదట ఎలా బతుకుతామన్న ఆలోచన ఉంటుంది. తర్వాత బాగా బతకాలన్న కోరిక కలుగుతుంది. అందుకు డబ్బు సంపాదించాలని పడుతుంది. అది వచ్చిన తర్వాత అధికారంపై ఆరాటం కలుగుతుంది. మీకు అధికారం వచ్చింది. అయినా తృప్తి లేదు. ఇప్పుడు తిరుగులేని అధికారం కావాలనే పిచ్చి పట్టుకుంది. అందుకే అవకాశం ఇచ్చి, అన్నం పెట్టి, అధికారం ఇచ్చిన చెయ్యిని నరికే ప్రయత్నాలు చేశావు. ఇది బయటపడటంతో సానుభూతి కోసం కన్నీరు కారుస్తున్నావు. కేసీఆర్‌ అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడారు. 68 ఏండ్ల వయసులో ఇప్పుడూ తెలంగాణ బాగు కోసమే తపిస్తున్నారు. కేసీఆర్‌ అప్పుడూ ఇప్పుడూ తెలంగాణ కోసమే నిలబడ్డడు. ఆయనేం మారలేదు. మారింది మీరే. ఇప్పుడు జరుగుతున్నదంతా మీ స్వయంకృతమే!

2003 వరకు రాజేందర్‌ నథింగ్‌. ఇప్పుడు ఆయన సమ్‌థింగ్‌. నథింగ్‌ నుంచి సమ్‌థింగ్‌ కావడం వెనక ఉన్నది కేసీఆర్‌. ఏమీ కాని, ఏమీ లేని ఈటలను, ఇప్పుడున్న ఈటలగా తయారుచేసింది
కేసీఆర్‌. పెంచి, పెద్దచేసి, గుర్తింపునిచ్చి, హోదానిచ్చి, పదవినిచ్చి, రాష్ట్రవ్యాప్త పరిచయాన్నిచ్చి, మాటనిచ్చి, బాటనిచ్చి, రాజేందర్‌ను, పెంచి పెద్ద చేసింది, నాయకుడిగా మార్చింది కేసీఆర్‌.
ఇదే విలేకరుల సమావేశంలో ఈటలే అంగీకరించిన నిజం. అంతకంటే వాస్తవం ఏమంటే
రాజకీయ అవకాశాలు, పదవుల కంటే ఎక్కువగా ఈటల రాజేందర్‌ను కేసీఆర్‌ సొంత తమ్ముడిలా ఆదరించారు. తన మనిషిలా చూసుకున్నారు. దీనికి ఫలితంగా ఈటల రాజేందర్‌ చేసిందేమిటి?

2004 ఎన్నికల్లో దాదాపు 10 మంది పెద్ద నేతలు కమలాపూర్‌ టిక్కెట్‌ రేసులో ఉన్నారు. ఉద్ధండులను కాదని, అప్పటికే టీఆర్‌ఎస్‌ బలంగా ఉన్న కమలాపూర్‌ నియోజకవర్గానికి కేసీఆర్‌ ఈటల రాజేందర్‌ను పంపించారు. ఎలాంటి అనుభవం లేని రాజేందర్‌కు 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో కమలాపూర్‌ నియోజకవర్గం రద్దయింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కలిసిపోయింది. అప్పటికి హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగా ఉన్న కెప్టెన్‌ లక్ష్మీకాంతరావును హుస్నాబాద్‌కు పంపించి, సురక్షితమైన హుజూరాబాద్‌ సీటును కేసీఆర్‌ రాజేందర్‌కు కేటాయించారు. అప్పటినుంచి ఇప్పటిదాకా, టీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచి నిన్నటిదాకా రాజేందర్‌ పదవుల్లోనే ఉన్నారు.

పేదల కోసం, బీసీల కోసం సంక్షేమ పథకాలు ఎవరు తెచ్చారు కేసీఆర్‌ కాదా? వీటిపైనా మీరు లెక్క లేకుండా మాట్లాడారు. ఇదెక్కడి రీతి. బీసీ నాయకుడు సంక్షేమ పథకాల గురించి ఇలాగేనా మాట్లాడేది? భారతావనిలో పేదల కోసం కేసీఆర్‌ పెట్టిన సంక్షేమ పథకాలు ఎవరూ పెట్టలేదు. ఇది పేదలకు అనుభవంలో ఉంది. నేనైతేనే బీసీలకు చేస్తా అన్నట్లు మీరు అంటున్నరు. మీకు ఏదన్నా ఆపతి పడితే కులం తీసి ముంగటేసుడు చేస్తవు. ఇన్నేండ్లు పదవిలో ఉంటివి కదా, ఒక్క రోజన్నా, ఎక్కడన్నా అధికారిక కార్యక్రమాల్లో ఈటల రాజేందర్‌ ముదిరాజ్‌ అని పిలిపించుకుంటివా. ఇగ ఆత్మ గౌరవం ఎక్కడ ఉన్నట్లో?

నాగుర్ల వెంకటేశ్వర్లు
98664 49988

Advertisement
మారిపోయింది..మీరే ఈటలా!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement