e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home ఎడిట్‌ పేజీ చిటికెలో నిర్ధారణ చికిత్స ఉచితం

చిటికెలో నిర్ధారణ చికిత్స ఉచితం

వైద్య పరిశోధనలో శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మక ప్రగతి చోటుచేసుకున్న నేపథ్యంలో నాడి చూసి రోగ నిర్ధారణ చేసే విధానం శతాబ్దం కిందనే అంతరించింది. కచ్చితమైన రోగ నిర్ధారణకు, సరైన చికిత్సకు అవసరమైన వివిధ పరిశీలనా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.

బ్లడ్‌ షుగర్‌ వంటి జీవరసాయన పరీక్షలు; థైరాయిడ్‌ పరీక్షలు; సంపూర్ణ రక్త నమూనా, మూత్ర పరీక్ష వంటి పాథలాజికల్‌ టెస్టులు; కొవిడ్‌ నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్‌, ఆర్‌ఏటీ వంటి
మైక్రో బయోలాజికల్‌ పరీక్షలు; ఎక్స్‌రే, సీటీ స్కాన్‌, అల్ట్రా సౌండ్‌ స్కాన్‌, టు-డీ ఎకో, ఎమ్మారై, పీఈటీ-సీటీ వంటి రేడియోలాజికల్‌ పరీక్షలు మొదలైన వేలాది విధానాలు అందుబాటులోకి వచ్చాయి.

- Advertisement -

తగిన వనరులు సమకూర్చినట్లయితే, చికిత్సలో, వ్యాధి నివారణలో గొప్ప ప్రగతి ఉంటుందని వైద్య శాస్త్రంలో పదే పదే రుజువైంది.

మైఖెల్‌ జె ఫాక్స్‌

రోగి ఆరోగ్యం గురించే కాదు, మొత్తం సమాజ ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి

బెన్‌ కార్సన్‌.

తగిన చికిత్స జరుపటానికి వ్యాధి నిర్ధారణ ప్రధానం. వ్యాధి నిర్ధారణ త్వరగా జరిగితే, రోగి తొందరగా పూర్తిగా కోలుకుంటాడు. ప్రమాదాలు జరిగినప్పుడు, గుండెపోటు, కోమా వంటి తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు కచ్చితమైన రోగనిర్ధారణ మరింత అవసరం. రోగ నిర్ధారణ జరుగకపోయినా, తప్పుడు రోగ నిర్ధారణ జరిగినా రోగి చాలా నష్టపోతాడు. తగిన చికిత్స లభించక ఆరోగ్యం దెబ్బతినవచ్చు లేదా మరణించవచ్చు. మొత్తం వైద్య చికిత్సలో రోగ నిర్ధారణ ఖర్చు ఐదునుంచి 20శాతం వరకు ఉంటుంది. కానీ ఇది 80నుంచి 95శాతం ఉన్న ఇతర ఖర్చులను ప్రభావితం చేస్తుంది. చికిత్స, పర్యవేక్షణలో, ఆరోగ్య సంక్లిష్టతలను నివారించటంలో రోగనిర్ధారణ కీలక పాత్ర వహిస్తుంది.

వైద్యపరమైన లబ్ధి: టీబీ, మలేరియా వంటి సూక్ష్మజీవ వ్యాధికారకాలను పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. వైద్య పరీక్షల ద్వారా 90 నుంచి 95శాతం వ్యాధులను గుర్తించవచ్చు. చికిత్సను పర్యవేక్షిస్తూ రోగి స్పందనను సమీక్షించవచ్చు. రోగ నిర్ధారణ పరీక్ష ద్వారా వ్యాధిని తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించవచ్చు.

రుజువు ఆధార వైద్యం: పరీక్షల మూలంగా కచ్చితమైన ఆధారాలతో కూడిన చికిత్స అందించవచ్చు. దీని వల్ల రోగుల ప్రయోజనాలను పరిరక్షించ వచ్చు. తప్పుడు రోగ నిర్ధారణ ఉండదు. అనవసర ఔషధాలు, తప్పుడు చికిత్సలు ఉండవు. 90 శాతం వ్యాధులను తొలి దశలోనే గుర్తించటం వల్ల రోగికి ఆర్థిక భారం తగ్గుతుంది. ఐసీయూలో ఉండటం, ఔషధ వ్యయం, శస్త్ర చికిత్సలు తప్పుతాయి.

సామాజిక లబ్ధి: రోగ నిర్ధారణ వసతుల వల్ల సమాజానికి, ప్రభుత్వాలకు నిధుల వ్యయం, ఆరోగ్య వసతుల భారం తగ్గుతుంది. దవాఖానలో ఎక్కువ కాలం ఉండవలసిన అవసరం రాదు. కొవిడ్‌-19, స్వైన్‌ ఫ్లూ వ్యాధులు రోగి నుంచి ఇతర కుటుంబ సభ్యులకు, పొరుగు వారికి, సమాజానికి వ్యాపించకుండా అరికట్టవచ్చు.

కానీ దురదృష్టవశాత్తు ఆధునిక రోగనిర్ధారణ వసతులు ప్రభుత్వ రంగంలో హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, నల్లగొండలలోని మూడవ స్థాయి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే ఉన్నాయి. ఈ సౌకర్యాలు దవాఖానలో చేరిన రోగులకే లభిస్తున్నాయి. రోగులు ఈ వసతులను ఉపయోగించుకోవటానికి దూర ప్రయాణాలు చేయవలసి ఉంటున్నది. నిర్ధారణ నివేదికలు పొంది స్పెషలిస్టులను కలువటానికి గంటలు లేదా రోజులు వేచి ఉండాల్సి వస్తున్నది. రవాణా ఖర్చులు కూడా ఉంటాయి. దీనివల్ల పేద, మధ్య తరగతి కుటుంబాల వారు ప్రైవేటు రోగనిర్ధారణ కేంద్రాలను, ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించ వలసి వస్తున్నది.

ఈ ఏడాది ఫైనాన్స్‌ కమిషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైద్య వసతులు రోగుల 30 శాతం ఆర్థిక భారాన్ని మాత్రమే తీరుస్తున్నాయి. మిగతా 70శాతాన్ని రోగులు తమ జేబు నుంచి పెట్టుకోవలసి వస్తున్నది. ఇది ప్రపంచంలోనే ఎక్కువ. దీని వల్ల రోగులు ‘ఆరోగ్య పేదరికం’లోకి నెట్టబడుతున్నారు.

ప్రజారోగ్య వ్యవస్థ ఎంత బలంగా ఉంటే, రోగుల స్వంత ఖర్చు అంత తగ్గుతుంది. స్వంత ఖర్చు ఎక్కువగా ఉన్నది అంటే.. ప్రజారోగ్య వ్యవస్థ పేద, మధ్య తరగతి ప్రజల కనీస అవసరాలను తీర్చడం లేదన్నట్టు. స్వంత ఖర్చు ఎక్కువగా ఉంటే.. పేద వర్గాలు ఆహారం, నివాసం, దుస్తులు, విద్య వంటి కనీస అవసరాలను తీర్చుకోలేవు. బంధువులు, వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు చేయాల్సి వస్తున్నది. ఆస్తులు అమ్ముకోవాల్సి రావచ్చు. మనదేశంలో ప్రజారోగ్య వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో, ఆరోగ్య ప్రణాళిక, నిధుల కేటాయింపు, అమలులోని ఎంత లోపభూయిష్టంగా ఉందో కొవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ మూలగా బయటపడింది. ప్రమాదాలు, హృద్రోగాలు, జీవన సరళికి సంబంధించిన డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌, స్థూల కాయం, క్యాన్సర్‌ మొదలైన వ్యాధుల మూలంగా రోగులు స్వంత డబ్బును ఎక్కువగా వెచ్చించాల్సి వస్తున్నది. రోగులు స్వంత డబ్బులో 30నుంచి 40 శాతం ఔషధాలకు, 10నుంచి 20శాతం రోగ నిర్ధారణ పరీక్షలకు, పదినుంచి పదిహేను శాతం రవాణా కోసం వెచ్చిస్తున్నారని వెల్లడైంది.

రోగ నిర్ధారణ కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావటం, రిపోర్టుల కోసం ఎక్కువ కాలం వేచి ఉండటం, అత్యాధునిక రోగనిర్ధారణ వసతులు లేకపోవటం, సుశిక్షిత సాంకేతిక సిబ్బంది లేకపోవటం మొదలైన కారణాల వల్ల రోగులు ప్రైవేటు ఆస్పత్రుల వైపు వెళ్తున్నారు. దీని వల్ల ఒక్కోసారి ఔషధాల కన్నా రోగ నిర్ధారణ పరీక్షలకు ఎక్కువ వ్యయం అవుతున్నది. సాధారణంగా ఔషధాల వ్యయం తర్వాత రోగ నిర్ధారణ ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

పంజాబ్‌ వంటి అధిక జీడీపీ ఉన్న రాష్ట్రంలో వైద్యానికి రోగుల స్వంత ఖర్చు ఎక్కువగా ఉంటున్నది. ఇది ప్రజారోగ్య వ్యవస్థ బలహీనంగా ఉన్నదనటానికి సూచన. తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల, విద్యుత్తు, వ్యవసాయం, తాగునీరు తర్వాత వైద్య, విద్యా రంగాలను ప్రాధాన్యమైనవిగా గుర్తిస్తున్నది. ఇందులో భాగంగానే 19 జిల్లాల్లో టీ-డయాగ్నస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఒక్కో కేంద్రానికి 2.5 కోట్ల వంతున మొత్తం 47.5 కోట్ల రూపాయలు వెచ్చించింది.

15 జిల్లాల్లో 16 కొత్త టీ-డయాగ్నస్టిక్‌ సెంటర్లు, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 12 మినీ డయాగ్నస్టిక్‌ కేంద్రాలు 55 కోట్ల ఖర్చుతో నెలకొల్పి నగర ప్రాంతంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి తోడు మమోగ్రామ్‌ (రూ. 30 లక్షలు), సీటీ స్కాన్‌ (ఒక్కోదానికి రూ. రెండు కోట్లు), టు డీ- ఎకో (రూ. కోటి) వంటి అతి ఖరీదైన వైద్య పరికరాలను కూడా ఏర్పాటు చేస్తున్నది. వీటికోసం రూ. 130 కోట్లు కేటాయిస్తున్నది. దీని వల్ల ప్రజారోగ్య వ్యవస్థ పటిష్ఠమై రోగుల స్వంత ఖర్చు 40-60శాతం తగ్గుతుంది.

రోగుల స్వంత ఖర్చును ఇప్పుడున్న 70శాతం నుంచి 2025 నాటికి 25శాతానికి తగ్గించాలని ‘జాతీయ ఆరోగ్య విధానం -2017’ నిర్దేశిస్తున్నది. భారీ నిధులతో టీ-డయాగ్నస్టిక్స్‌ ఏర్పాటు చేయటం వల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే శాంపుల్స్‌ సేకరించటం, అతివేగంగా రోగుల మొబైల్స్‌కు రిపోర్టులు పోవటం, వైద్యుడి సలహా లభించటం, ఔషధాలు ఇవ్వటం జరుగుతుంది. మొత్తం వైద్యం ఉచితంగా లభిస్తుంది.

రోగులకు ప్రయాణ భారం ఉండదు. రోగుల వద్దనుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే శాంపిల్స్‌ సేకరించి టీ-డయాగ్నస్టిక్‌ కేంద్రాలకు పంపిస్తాయి. రిపోర్టులను రోగి మొబైల్‌ ఫోన్‌కు, వైద్యాధికారికి పంపుతారు. వెంటనే ఉచిత వైద్యం, ఔషధాలు అందుతాయి. రెక్కాడితే డొక్కాడని జీవులు తమ పని వదులుకొని దవాఖాన చుట్టూ తిరగవలసిన కష్టాలు తప్పుతాయి. అనవసర ప్రయాణాలు తప్పుతాయి. వైద్య, ఔషధఖర్చులుండవు.

2014లో ‘జాతీయ ఆరోగ్య వ్యవస్థ వనరుల కేంద్రం’ వెల్లడించిన వివరాల ప్రకారం- మన రాష్ట్రంలో వైద్యానికి రోగి స్వంత ఖర్చులు నగర ప్రాంతంలో 86శాతం, గ్రామీణ ప్రాంతంలో 77శాతం ఉన్నాయి. టీ-డయాగ్నస్టిక్స్‌ ఏర్పాటు వల్ల ఈ వ్యయం వచ్చే ఏడాదికి 25శాతానికి తగ్గుతుంది.

వీటికి తోడు ప్రభుత్వం కొత్తగా ఏడు వైద్య కళాశాలలను, 13 నర్సింగ్‌ కళాశాలలను, దంత కళాశాలలను ఏర్పాటు చేస్తున్నది. తెలుగులో, ఉర్దూలో కరపత్రాలు పంచటం ద్వారా టీ-డయాగ్నస్టిక్స్‌లకు గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలి. ఆషా, ఏఎన్‌ఎం కార్యకర్తల ద్వారా ఐఈసీ మెటీరియల్‌ అందించాలి. వీటి గురించి గ్రామాల్లో చాటింపు వేయించాలి.

ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి చిత్తశుద్ధితో విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్న చైతన్యశీలురు, దార్శనికుడైన ముఖ్యమంత్రిగారికి అభినందనలు, కృతజ్ఞతలు. జబ్బు పట్టి బలహీనంగా ఉన్న మన ప్రజారోగ్య వ్యవస్థకు గౌరవ ముఖ్యమంత్రిగారు రోగనిర్ధారణ జరిపి తగిన చికిత్స అందిస్తారని, పేద మధ్యతరగతి కుటుంబాలకు సేవచేసే విధంగా ఆరోగ్యకరంగా, బలంగా రూపొందిస్తారని వైద్య సోదరులం ధీమాగా ఉన్నాం.

ప్రతి జిల్లా కేంద్రంలో టి-డయాగ్నాస్టిక్‌ కేంద్రం

19 జిల్లాల్లో టి-డయాగ్నాస్టిక్‌ కేంద్రాలు ఏర్పాటు చేయటం వల్ల ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ పటిష్ఠం అవుతుంది. ఈ కేంద్రాల్లో అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేసింది. అవి-

 1. ఫుల్లీ ఆటోమాటిక్‌ క్లినికల్‌ కెమిస్ట్రీ అనలైజర్‌
  ఈ వైద్య సాధనం ద్వారా బ్లడ్‌ షుగర్‌, కాళేయ, కిడ్నీ పరీక్షలు, లిపిడ్‌ ప్రొఫైల్‌, సీరం ఎలక్ట్రో లైట్స్‌ మొదలైన టెస్టులు చేయవచ్చు. డయాబెటిస్‌, కిడ్నీ, కాలేయం పరీక్షలకు ఉపయోగకరం. డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌, స్థూల కాయం ఉన్నవారు దీర్ఘకాల జాగ్రత్తలు, చికిత్స తీసుకోవటానికి కూడా ఈ పరీక్షలు ఉపయోగ పడుతాయి. ఇటీవలి కాలంలో జీవన సరళి మారటం, శారీరక శ్రమ లేకపోవటం వల్ల నగర ప్రాంతాల్లోనే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్థూలకాయం సమస్యలు పెరిగిపోతున్నాయి.
 2. ఫుల్లీ ఆటోమాటిక్‌ ఇమ్యునోస్సే అనలైజర్‌
  ఈ సాధనం ద్వారా థైరాయిడ్‌ ప్రొఫైల్‌, విటమిన్‌-డి, ఫెరిటిన్‌ పరీక్షలు చేయవచ్చు. రోగనిర్ధారణ జరిపి ఆయా వ్యాధులు రాకుండా నివారించవచ్చు.
 3. ఫైవ్‌-పార్ట్‌ సెల్‌ సెంటర్‌
  దీని వల్ల మొత్తం రక్త నమూనా తెలిసిపోతుంది. రక్తహీనత, అంటువ్యాధులు, ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తెలుసుకోవచ్చు. డెంగ్యూ రోగుల చికిత్సకు ఉపయోగకరం.
 4. ఎలీసా రీడర్‌
  డెంగ్యూ, చికున్‌ గున్యా, టైఫాయిడ్‌ రోగ నిర్ధారణకు ఉపయోగకరం. టు డి-ఎఖో, ఈసీజీ రెండూ హృద్రోగ నిర్ధారణకు ఉపయోగకరం.
 5. ఫుల్లీ ఆటోమాటిక్‌ యూరిన్‌ అనలైజర్‌
 6. డిజిటల్‌ ఎక్స్‌-రే
 7. అల్ట్రా సౌండ్‌ స్కాన్‌
  ఇవి పూర్తి ఆటోమాటిక్‌ సాధానాలు. కచ్చితమైన నివేదికలు ఇవ్వటమే కాకుండా గంటకు 400-800 శాంపిల్స్‌ పరీక్షించగలవు. రిపోర్టులు వెంటనే తీసుకోవచ్చు.

(వ్యాసకర్త: డైరెక్టర్‌, ప్రభుత్వ వైద్య కళాశాల మహబూబ్‌నగర్‌ )

డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana