e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home ఎడిట్‌ పేజీ అగ్రి నుంచి ఐటీ వరకూ..

అగ్రి నుంచి ఐటీ వరకూ..

‘దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని’ నాడు మహాత్మా గాంధీ అన్నారు. మరి ఆ పల్లెలు సంతోషంగా ఉండాలంటే వ్యవసాయం సక్రమంగా జరగాలి. వ్యవసాయం జరగాలంటే పెట్టుబడి, నీళ్లు, కరెంటు, ఎరువులు అవసరమవుతాయి. కానీ, కరెంట్‌ ఎప్పుడొస్తదో తెలువదు. నీళ్లు లేక భూములు బీడువడి ఉన్న రోజులున్నాయి. పెట్టుబడికే పైసల్లేవంటే కాలిన కరెంటు మోటార్లను బాగుచేసుకోలేక కన్నీళ్లు పెట్టిన కర్షకులు ఎంతోమంది. ఇదంతా ఇప్పటిది కాదు, తెలంగాణ రాకముందటి ముచ్చట..

ఒక్క నీళ్లుంటేనే ఎవుసం నడువదు. అది గమనించిన ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటును కూడా ఇస్తున్నది. ‘రైతుబంధు’ అందిస్తూ ఆర్థికంగా తోడ్పాటునందిస్తున్నది. అందుకే బీడు భూముల్లోనూ బంగారం పండే పరిస్థితులు వచ్చాయి.
రాష్ట్రం అతిపెద్ద ధాన్యాగారంగా మారిపోయింది.

- Advertisement -

2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్డీపీ రూ.9.78 లక్షల కోట్లకు చేరింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 1.26 శాతం జీడీపీ తగ్గినా మన రాష్ట్రం మాత్రం మెరుగ్గా ఉన్నది. రాష్ట్ర ఆర్థికరంగంలో వ్యవసాయ, దాని అనుబంధరంగాల వాటా ఏకంగా 20.9 శాతం పెరిగింది. జాతీయస్థాయిలో వీటి వాటా చాలా తక్కువగా ఉన్నది. జీడీపీలో తెలంగాణ ఆర్థికరంగం 26 బేసిస్‌ పాయింట్లు పెరిగి 2020-21లో 5 శాతానికి చేరింది. 2019-20లో ఇది 4.74 శాతంగా ఉండేది.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో పరిస్థితులు మారాయి. ఎర్రటి ఎండల్లోనూ పల్లెల్లో గంగమ్మ గలగలా పరుగులు పెడుతున్నది. పచ్చటి చేలు పరవశంతో పులకించిపోతున్నాయి. గతంలో ఏ ఊరికెళ్లినా అడుగంటిన బావులే కనిపించేవి. ఇప్పుడా పరిస్థితులు లేవు. చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భజలాలు భారీగా పెరిగాయి. కొన్నిరోజుల కిందటివరకు పాతాళంలో ఉన్న నీళ్లు.. ఇప్పుడు చెంబుతో ముంచుకునేలా పైకి వచ్చాయి. దీనంతటికి ప్రధాన కారణం ముందుచూపున్న నాయకుడు రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడమే. కాళేశ్వరం లాంటి బృహత్తర ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేస్తుండటమే.
కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్తగా ఎకరం కూడా పారలేదంటూ మాట్లాడే ప్రతిపక్షాలు వాస్తవాలను ఎందుకు గమనించడం లేదు? నీళ్లు పారకుంటే లక్షల టన్నుల కొద్దీ వరి ధాన్యం మార్కెట్లకు ఎట్లా వస్తున్నట్టు? ఈ ప్రశ్నలకు ప్రతిపక్షాల వద్ద సమాధానం ఉండదు. వాస్తవాలను ఒప్పుకొంటే వాళ్లకు భవిష్యత్తు ఉండదనే విషయం తెలుసు కాబట్టి ఈ కల్లబొల్లి మాటలతో కాలం వెళ్లదీయటం. కాళేశ్వరం ఘనతను ప్రపంచ దేశాలు గుర్తించాయి. ‘లిఫ్టింగ్‌ ఎ రివర్‌’ పేరుతో డిస్కవరీ ఛానల్‌ ఓ డాక్యుమెంటరీనే ప్రసారం చేసింది. ఈ ప్రాజెక్టుతో నీరందుతున్న చివరి ఆయకట్టు వరకు ప్రతీ విషయాన్ని సమగ్రంగా వివరించింది.

వ్యవసాయమే కాదు, ఐటీ, ఫార్మా, నిర్మాణరంగం, ఇలా.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రతీ రంగంలోనూ గుణాత్మకమైన మార్పు కనిపిస్తున్నది. ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ర్టానికి పెట్టుబడులే కాదు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కంపెనీలకు త్వరగా అనుమతులు వచ్చేలా ఏర్పాటుచేసిన టీఎస్‌ ఐపాస్‌ మంచి ఫలితాలనిస్తున్నది. ఐటీ సంస్థలు ఒక నగ రానికి వచ్చేముందు అక్కడ ఉన్న భద్రత గురించి సమీక్షిస్తాయి. ఉద్యోగుల భద్రత గురించి ఆలోచిస్తాయి. హైదరాబాద్‌కు అనేక మల్టీనేషనల్‌ కంపెనీలు తరలివస్తున్నాయి. అంటే ప్రభుత్వం ఆ కంపెనీల భద్రతకు భరోసానిస్తున్నట్టే కదా. ఒక్క నగరంలోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలున్నాయి. వాటిని పర్యవేక్షించేందుకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లున్నాయి. నేరం జరిగిన గంటల వ్యవధిలో నేరస్థులను పట్టుకునే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. తద్వారా రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ‘ట్రైటన్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌’ సంస్థ 2100 కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చింది. దీనిద్వారా 25 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. అంతేకాదు. ‘ఇవాన్‌ హో కేంబ్రిడ్జ్‌’, ‘లైట్‌హౌస్‌ కాంటన్‌’ అనే కంపెనీలు సంయుక్తంగా 740 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని చెప్పాయి. 2020-21లో మన దేశం నుంచి జరిగిన ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతుల్లో రాష్ట్రం 12.98 శాతం, ఉద్యోగుల సంఖ్యలో 7.99 శాతం వృద్ధి సాధించింది. ఐటీ ఎగుమతుల విలువ రూ.1,45,522 కోట్లకు చేరింది. ఫార్మారంగంలోనూ రాష్ట్రం దూసుకెళ్తున్నది. ఫార్మాసిటీ పూర్తయితే ప్రపంచ పటంలో రాష్ట్ర ముఖచిత్రం మారిపోనున్నది. కరోనా కారణంగా దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్న పరిస్థితుల్లో.. రాష్ట్రంలో ఐటీ కంపెనీల్లో కొత్తగా 46,489 మందికి ఉద్యోగాలు
వచ్చాయంటే ప్రభుత్వ విధానాలు ఎంత గొప్పగా ఉన్నాయో వేరే చెప్పాల్సిన పనిలేదు.

అంతర్జాతీయ సంస్థలు తెలంగాణ రాష్ర్టాన్ని ప్రశంసిస్తున్నాయి. ఎస్‌టీపీఐ, ఎస్‌ఈజడ్‌, నాస్కామ్‌ వంటి సంస్థల లెక్కల ప్రకారం జాతీయ సగటు కంటే తెలంగాణ మెరుగ్గా ఉన్నది. ఫ్యూచర్‌ ఏరోస్పేస్‌ సిటీస్‌ జాబితాలో హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఈఓడీబీలో 3వ స్థానం, నీతి ఆయోగ్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ రిపోర్ట్‌లో 4వ స్థానంలో నిలవడంతోపాటు, ఐటీపీవో త్రీ స్మార్ట్‌ సిటీస్‌ అవార్డును భాగ్యనగరం సొంతం చేసుకున్నది. ఇవే కాదు.. పాలిస్టర్‌ ఫిల్మ్‌, రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. టీ-హబ్‌, టీఎస్‌ఐసీ, రిచ్‌, వి-హబ్‌ క్షేత్రస్థాయిలో ఇన్నోవేటర్లకు ప్రోత్సాహం, స్టార్టప్‌లకు ఊతమివ్వడంలో దూసుకెళ్తున్నాయి. టీ-హబ్‌ ఇంక్యుబేటర్‌లో బోయింగ్‌, ప్రాట్‌ అండ్విట్నీ, కాలిన్‌ ఏరో స్పేస్‌ భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. ఏరో స్పేస్‌, రక్షణరంగాల్లో ఇప్పుడు హైదరాబాద్‌ కీలకంగా మారిం ది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డ్రోన్స్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ వంటి సరికొత్త టెక్నాలజీ రంగాల్లో కూడా తెలంగాణ ముందువరుసలో ఉన్నది. సాధారణంగా కొన్ని రాష్ర్టాలు కొన్నిరంగాల్లో మాత్రమే అభివృద్ధిని సాధిస్తూ.. మిగతా వాటిని నిర్లక్ష్యం చేస్తుంటాయి. కానీ తెలంగాణలో అన్నీ ప్రాధాన్యరంగాలే అయ్యాయి. అగ్రికల్చర్‌ నుంచి ఐటీ వరకు అన్నింటిలోనూ మనకు అభివృద్ధి ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. రాష్ర్టాన్ని పాలించే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒక విజన్‌ ఉన్నది కాబట్టే ఇదంతా సాధ్యమవుతున్నది. తన ప్రజలకు మంచి చేయాలనే తపన ఉన్నది కాబట్టే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా సాగుతున్నది.
(వ్యాసకర్త: టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌)

వై.సతీష్‌రెడ్డి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana