e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home ఎడిట్‌ పేజీ మొక్కతోనే మనిషి జీవితం

మొక్కతోనే మనిషి జీవితం

మనిషి ఆయుః ప్రమాణం చెట్లతో ముడిపడి ఉన్నది. చెట్లు ఎక్కువగా ఉన్నచోట మనిషి ఎక్కువకాలం జీవిస్తున్నాడు. ఒక్క ఆయుః ప్రమాణమే కాదు, యావత్‌ ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వ్యాధికి, గాలి కాలుష్యానికి దగ్గరి సంబంధం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కరోనా మరణాల్లో 78 శాతం అధిక కాలుష్యం ఉన్న ప్రాంతాల్లోనే జరిగాయని ‘సైన్స్‌ ఆఫ్‌ ది టోటల్‌ ఎన్విరాన్మెంట్‌ జర్నల్‌’ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో చెట్లు, అడవుల పెంపకాన్ని ఒక ఉద్యమంగా చేపట్టడం అభినందించదగిన విషయం.

అడవుల్లో పోడు వ్యవసాయం గిరిజన జీవనవిధానంలో అంతర్భాగం. గిరిజనులను ప్రకృతి రక్షకులుగా భావిస్తాం. దోపిడిదారులు చెట్లను నరకకుండా అడవిని రక్షించడమే ధ్యేయంగా ఉత్తరాఖండ్‌లో గ్రామీణులు చెట్లను అలుముకొని అడ్డుకున్నారు. ఇది ప్రముఖ పర్యావరణ ఉద్యమం చిప్కోకు దారితీసింది. రాష్ట్రంలో ప్రభుత్వమే పర్యావరణ పరిరక్షణకు పూనుకోవడం అభినందనీయం.

- Advertisement -

అత్యంత కలుషిత దేశాల్లో మనం టాప్‌-10లో ఉన్నాం. భారతదేశ విస్తీర్ణంలో అడవులు 21.67 శాతం కాగా మనిషి సగటు జీవితకాలం 69 ఏండ్లు. అభివృద్ధి చెందిన అమెరికాలో అడవులు 36 శాతం కాగా మనిషి జీవితకాలం 78 ఏండ్లు. కెనడాలో 34.8 శాతం, 82 ఏండ్లు. జపాన్‌లో 67 శాతం, 84 ఏండ్లు. బ్రిటన్‌లో అడవులు 43 శాతం ఉంటే, మనిషి సగటుగా 81 ఏండ్ల పాటు జీవిస్తున్నాడు. ‘ైక్లెమేట్‌ రియాలిటీ’ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేలో కెనడాలో సగటున ఒక మనిషికి 8,953 చెట్లు ఉండగా, రష్యాలో 4,461, అమెరికాలో 716, చైనాలో 102, ప్రపంచవ్యాప్తంగా సగటున ఒక మనిషికి 422 చెట్లున్నాయి. కానీ మనదేశంలో 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. గాలి కాలుష్యానికి, కరోనా మహమ్మారికి దగ్గరి సంబంధం ఉన్నది. గాలిలో ఒక మైక్రోగ్రాం/ క్యూబిక్‌ మీటర్‌ కలుషిత వాయువులు పెరిగితే 11 శాతం కరోనా మరణాలు పెరిగే ప్రమాదం ఉన్నదని హార్వర్డ్‌ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. అంటే కరోనా తీవ్రతను తగ్గించడానికి కాలుష్య నివారణ ఒక దివ్యౌషధం. మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని సమతుల్యం చేయవచ్చని ఐక్యరాజ్య సమితి చెప్తున్నది. ప్రపంచ దేశాలతో అనేక సదస్సులు నిర్వహించిన తర్వాత 2015 పారిస్‌ పర్యావరణ ఒప్పంద సదస్సులో 2030 నాటికి 33 శాతం మేర అడవులు పెంచాలని నిర్ణయించింది. కానీ 2015-19 మధ్య మన దేశంలో 0.33 శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం పెరిగింది.

మొక్కతోనే మనిషి జీవనం ముడిపడి ఉన్నదనే విషయాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్‌ ‘హరితహారం’ కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపారు. ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ ద్వారా ఎంపీ సంతోష్‌కుమార్‌ కేసీఆర్‌ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్తున్నారు. గతంలో కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ‘కోటి వృక్షార్చన’ చేసి చరిత్ర సృష్టించారు. తాజాగా మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ముక్కోటి వృక్షార్చన’ పేర 3 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

తెలంగాణలో పచ్చదనాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచడమే ప్రధాన లక్ష్యంగా ‘హరితహారం’ ఒక ఉద్యమంగా నడుస్తున్నది. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి పౌరుడిని భాగస్వామ్యం చేయడం హర్షించదగిన విషయం. ఈ కార్యక్రమం కారణంగా రాష్ట్రంలో పచ్చద నం 24 నుంచి 28 శాతానికి పెరిగిందని, మొక్కల పెంపకంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని ‘ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ పేర్కొన్నది. ‘గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ చైనా’, ‘అమెజాన్‌ నది వెంట 100 కోట్ల మొక్కలు నాటడం’ తర్వాత ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ప్రయత్నంగా ‘హరితహారం’ నిలిచింది. రాష్ర్టాన్ని ఆదర్శంగా తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 200 నగరాలలో ‘నగర్‌ వన్‌’ పేరిట వనాలు అభివృద్ధి చేసే కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే హైదరాబాద్‌ నగరం ప్రతిష్ఠాత్మక ‘గ్రీన్‌ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌ 2020’గా ఎంపికైంది.

మొక్కలతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం అనే నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిజం చేస్తున్నది. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా రేటు గణనీయంగా తగ్గిపోవడమే ఇందుకు ఉదాహరణ. రాష్ట్రంలో వర్షపాతం పెరిగి వ్యవసాయరంగం వృద్ధిలోకి వచ్చింది. సామాజిక అడవులతో పాటుగా పోషక విలువలుండే పండ్ల మొక్కలను ప్రభుత్వమే సరఫరా చేసింది. అతి శీతల ప్రాంతాల్లో పండే ఆపిల్‌, అంజీర వంటి పండ్లను ఇప్పుడు తెలంగాణ రైతులు పండిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నది. కేయూ విద్యార్థులు దాదాపు రెండున్నర ఎకరాల్లో వెయ్యికి పైగా మొక్కలు నాటారు. 11 జిల్లాల్లో విస్తరించి ఉన్న 520 అనుబంధ కళాశాలల్లో కలిపి 10 వేలకు పైగా మొక్కలు నాటి ముఖ్యమంత్రి ఆలోచనల్లో భాగస్వాములయ్యారు. రాష్ట్ర ప్రభు త్వం మానవాళి మనుగడ కోసం పర్యావరణ పరిరక్షణకు ప్రముఖ ప్రాధాన్యం ఇస్తున్నది. పర్యావరణమే శాశ్వత ఆర్థికసంపద అనే సత్యాన్ని గ్రహించి, మొక్కల సంరక్షణను బాధ్యతగా తీసుకుంటున్నది.
(వ్యాసకర్త: ఉప కులపతి, కాకతీయ యూనివర్సిటీ)

ప్రొఫెసర్‌
తాటికొండ రమేష్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana