e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home ఎడిట్‌ పేజీ భాగ్యనగరికి సుంకిశాల భరోసా

భాగ్యనగరికి సుంకిశాల భరోసా

‘హైదరాబాద్‌’ విశ్వనగరంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి అవసరాలు కూడా ముఖ్యం. ప్రస్తుతం ఉన్న ‘ఔటర్‌ రింగ్‌ రోడ్‌’కు అదనంగా మరో ‘రీజినల్‌ రింగ్‌ రోడ్‌’ నిర్మాణం కూడా జరుగనున్నందున నగర జనాభా విస్తృతంగా పెరిగే అవకాశం ఉన్నది.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులన్నీ దేశానికే దిక్సూచిగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న వివిధ ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాలువలు, చెక్‌డ్యాములు, ఎత్తిపోతల పథకాల ద్వారా తెలంగాణలో భూగర్భ జలాలు మూడు మీటర్ల ఎత్తు పెరిగాయి. ప్రస్తుతం ఎక్కడచూసినా నీళ్లు ఏరులై పారుతున్నాయి. కోటి ముప్ఫై లక్షల ఎకరాల్లో పంటలు పండాయి. అపారమైన ధాన్యరాశులతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉన్నది.

- Advertisement -

నగర జనాభాకు అనుగుణంగా అన్ని మౌలిక అవసరాలతో పాటుగా ప్రజలకు తాగు నీరందించే బాధ్యత ప్రభుత్వానిదే. అందులో భాగంగా మరో రెండు, మూడు దశాబ్దాల దాకా నగర ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుంకిశాల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సుంకిశాల హెడ్‌ వర్క్స్‌ నిర్మాణం కోసం 2021 బడ్జెట్‌లో రూ.1450 కోట్ల వ్యయం మంజూరు చేసింది. 2023 నాటికి ఈ ప్రాజెక్టు పనులు పూర్తికావాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని సుంకిశాల నాగార్జునసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయిన గ్రామం. ‘కృష్ణా వాటర్‌ సప్లయి స్కీం’లో భాగంగా హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసేందుకు సుంకిశాల వద్ద హెడ్‌ వర్క్స్‌ నిర్మాణం కోసం 113 ఎకరాల స్థలాన్ని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లయి సీవరేజీ బోర్డుకు కేటాయిస్తూ ప్రభుత్వం 1999 ఫిబ్రవరి 15న జీవో విడుదల చేసింది. నాడు ఆ భూమిని వాటర్‌ వర్క్స్‌ శాఖ తమ అధీనంలోకి తీసుకొని ప్రహరీతో పాటు గేట్లు ఏర్పా టుచేసినప్పటికీ హెడ్‌ వర్క్స్‌ నిర్మాణ పనులు జరగలేదు.

2004లో సుంకిశాలకు కొంతదూరంలో ఉన్న పుట్టంగండి వద్ద హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మించి, అక్కంపల్లి రిజర్వాయర్‌ ద్వారా నగరానికి నీళ్లు సరఫరా చేస్తున్నారు. నిజానికి అక్కంపల్లి రిజర్వాయర్‌ నీళ్లు వ్యవసాయానికి, పరిశ్రమల కోసం వాడుకోవాలి. కానీ, ఏడాదికి 16.5 టీఎంసీల నీళ్లను నగర నీటి అవసరాలకు వాడుకుంటున్నాం. దీంతో అటు వ్యవసాయదారులకు, పరిశ్రమలకు ఇటు నగరానికి సరిపడా నీళ్లందడం లేదు. కృష్ణా నుంచి రోజుకు 270 మిలియన్‌ గ్యాలన్ల నీటిని హైదరాబాద్‌ వాటర్‌ వర్క్స్‌ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వేసవిలో సాగర్‌లో నీరు ఇంకిపోతుంది కాబట్టి నగర ప్రజలకు తాగునీరు అందించాలంటే కష్టమయ్యేది. పుట్టంగండి హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి దాదాపు కిలోమీటర్‌ లోపలికి వెళ్లి అక్కడి నుంచి పెద్దపైపుల ద్వారా నీటిని తోడి ఎమర్జెన్సీ పంపింగ్‌ ద్వారా నగరానికి నీటి సరఫరా చేయడం వాటర్‌ బోర్డుకు సవాల్‌గా ఉండేది. ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. అన్నికాలాల్లోనూ నగర ప్రజల తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నది. నాగార్జునసాగర్‌ డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని తీసుకునేలా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని సుంకిశాల ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారు. అండర్‌గ్రౌండ్‌ షాఫ్ట్‌, ఇన్‌టెక్‌ టన్నెలింగ్‌, పంప్‌హౌజ్‌ నిర్మాణం, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, సుంకిశాల నుంచి కోదండాపూర్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు 2375 ఎంఎం డయా పైపు లైన్ల నిర్మాణం తదితర పనులు సుంకిశాల వద్ద చేపట్టాల్సి ఉన్నది.

2014 నుంచి వివిధ పథకాల కింద వాటర్‌ వర్క్స్‌ నిర్మించిన రిజర్వాయర్లతో నగరంలోని 50 నుంచి 60 లక్షల మందికి ప్రయోజనం కలిగింది. 2014 నుంచి ఖాళీ బిందెలు, కుండలు పట్టుకొని నీళ్ల కోసం జలమండలి వద్ద ధర్నాలు జరగలేదు. ప్రస్తుతం కృష్ణా నుంచి 16.5 టీఎంసీ లు గోదావరి నుంచి 10 టీఎంసీల నీటిని నగర తాగునీటి అవసరాల కోసం వాడుకుంటున్నాం. కేశవపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం కూడా పూర్తయితే నగర ప్రజల తాగునీటికి ఢోకా ఉండదు.

ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదుల నుంచి రోజుకు 468 మిలియన్‌ గ్యాలన్ల తాగునీటిని తీసుకుంటున్నాం. ఈ రెండు నదుల నుంచి ఏటా 27 టీఎంసీల నీటిని నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం తరలిస్తున్నాం. కోటికి పైగా ఉన్న నగర జనాభాకు అదనంగా ఓఆర్‌ఆర్‌ లోపలి 190 గ్రామాలకూ వాటర్‌ బోర్డు తాగునీరు అందిస్తున్నది. భవిష్యత్తులో తాగునీటి అవసరాలు పెరిగితే సుంకిశాల ప్రాజెక్టు ద్వారా ఆ అవసరం తీరిపోతుందనడంలో సందేహం లేదు.
(వ్యాసకర్త: ఎండీ, హైదరాబాద్‌ జలమండలి)

ఎం.దానకిషోర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana