e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home ఎడిట్‌ పేజీ సానుకూలతను పంచాలె

సానుకూలతను పంచాలె

రొటీన్‌ అయిపోయిన రోత రాతలు, విజువల్స్‌ గురించి మొదట కొంచెం యాది చేసుకుందాం. ఒక ఉన్మాద బలత్కారం రెండు కండ్ల ఫ్రేంలోనూ పట్టనంత పెద్ద సైజులో పతాకాన అచ్చువేస్తారు. అదే మానవ మృగానికి కోర్టు ఉరి లేదా యావజ్జీవ శిక్ష వేస్తే మాత్రం ఏదో మూలకు తోసేస్తారు. బాధ్యతాయుతమైన మీడియా ఏం జేయాలె? శిక్షను హెడ్‌లైన్స్‌లో, నేరాన్ని ఏదో మొక్కుబడిగా ప్రింట్‌ చేయాలె. ఎట్టెట్టా.. అలాగెలా కుదురుతుంది? పెద్ద నీతులు చెప్పొచ్చాడంటే.. కమ్‌ సే కమ్‌, ఆ అవాంఛనీయతకు ఇచ్చినంత ఈక్వల్‌ ప్రియారిటీ అయినా.. అందుబాటులోకి వచ్చిన న్యాయానికీ ఇవ్వాలి. ఆ విధంగా రియాలిటీని ఆచరణలో చూపెట్టాలి. అట్లా సవ్యంగా వ్యవహరిస్తే నేరం చేయాలనే ఊహే రాకుండా ఒకింత మీడియా కూడా దోహదం చేసినట్లవుతుంది.

సానుకూలతను పంచాలె

వర్తమానంలో మీడియా బాబులు ఎట్లా తమ ఆకలి తీర్చుకుంటున్నారో గమనిద్దాం. ఆ వైరస్‌ కంటికి కనిపించని లోటును, ఇన్ఫెక్ట్‌ అయిన వారికీ లేనంత భయభ్రాంతులు గొలిపేలా కనుచూపునకు మించినంతటి బడా సైజులో అచ్చు గుద్దుతున్నారు. తెరలపై బల్మీటికి చూపిస్తున్నారు. వాస్తవానికి, జిమ్మేదారి ఉన్న ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలు ఎలా మెదలాలి? కరోనా బారిన పడిన వారి సాదక బాధకాలు తప్పకుండా లోకానికి చెప్పాల్సిందే, చూపించాల్సిందే. కానీ, ఆ అంటురోగానికంటే అతి క్రూరమైన భయంకరంగా పరిచేస్తున్నారు. గుండె దడ దండిగా పెరిగి, లేని రోగాలు జీవం పోసుకునేలా టెలికాస్ట్‌లో పోటీ పడుతున్నారు. ఇండిపెండెంట్‌ జర్నలిస్టులైన నాలాంటి వాళ్లు కానీ, సమాజహితం కోరుకునే మరెవరైనా కానీ ఈ విధంగా పేర్కొంటే జీర్ణం కాదేమో. స్వయానా సైకాలజిస్టులు, వైద్య నిపుణులు పదేపదే ఇదే చెప్తున్నారు కదా. దీనిపై ఆ పోకడ బాపతు వాటి సమర్థన ఏదో ఉండొచ్చు. పోనీ, అదే సమయంలో కోలుకున్న బాధితుల సక్సెస్‌ స్టోరీలను అంతే సమానంగా ఎందుకు పబ్లిష్‌ చేయడం లేదు, మరెందుకు ప్రసారం చేయరు?

అల్టిమేట్‌గా తమ పైత్యానికి సొసైటీని బలిచేయడం కాదా? ప్రభుత్వ దవాఖానల్లో లోటుపాట్లను, కార్పొరేట్‌ దవాఖానల జులుం, ధన దాహాల టాంటామ్‌ను ఎవరొద్దంటారూ? ఈ ఆపత్కాలంలో కొవిడ్‌ పీడితులకు నామమాత్రపు ఫీజులతో ఆత్మీయ వైద్యం అందిస్తున్న మనసున్న మారాజులైన ఒక విక్టర్‌, ఒక అక్కపల్లి శ్రీధర్‌ వంటి డాక్టర్ల అంకిత, సేవానిరతికి పెద్ద ఎత్తున స్పేస్‌ ఇచ్చేందుకు మనస్కరించని కఠినాత్మ మీడియాను ఏమనాలి? ముఖ్యంగా ప్రభుత్వంపైనో, పాలకుల మీదో కడుపునిండా ద్వేషం పెట్టుకొని వడ్డించే విష వార్తలు ఎన్నాండ్లు భరించాలి? ఆ విద్వేషం ఎంతదాకా పోయిందంటే.. పౌర సమాజం గొంతు ఎత్తాల్సిన, గళం విప్పాల్సినంత దాకా! ఎందుకంటే, బతికున్న పేషెంటునూ అక్షరాల్లో చంపేసేంత మనసు వచ్చినందుకు! సమాజాన్ని ఆలోచింపజేసేది మీడియా అనే గౌరవం క్రమంగా సన్నగిల్లుతున్నది. మీడియా గురించి సమాజమే ఓ కన్నేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఒక్కో దినపత్రికది ఒక్కోలైను. ఒక్కో టీవీ న్యూస్‌ ఛానెల్‌ ది ఒక్కో పంథా. ఇదంతా జగద్విదితమే. కానీ, మరీ బతికున్న వారినీ బలి తీసుకునేంత పెడధోరణి లైన్‌ ఏమిటో, వైరస్‌ కంటే భీతికరమైన ఈ ప్రత్యేకత ఏమిటో?

నిజానికి, ఏ వ్యవస్థకు తుప్పుబట్టినా.. ప్రచార, ప్రసార మాధ్యమాలు వజ్రాల్లా ఉండాలి. అపుడే, వాటికి విలువ. రానురాను యాజమాన్యాల లైనులో పడి మీడియా వన్నె పాతాళానికి పరుగులు పెడుతున్నది. ఆ మేరకు వాటికి రిపోర్టింగ్‌ చేసే పాత్రికేయులకూ వాల్యూ అడుగంటుతున్నది. ఎడిటోరియల్‌ విభాగానికి ఉన్నంతలో తమ సంస్థకంటే గొప్పగా మరే మీడియా స్వేచ్ఛ ఇవ్వడం లేదని ఓపెన్‌గా ప్రకటించుకున్న మీడియా సంస్థ కూడా ఎప్పుడు ఏ శైలిలో పోతున్నదో తెలియడం లేదు. ప్రజల ప్రాణాలు, వారి ఆరోగ్యాలను నిజంగానే కోరుకునే మీడియా సంస్థల ఆత్మ పరిశీలనకు ఇంతకుమించిన తరుణం ఏముంటుంది? అందుకే ఇక నైనా మీడియా తమ ధోరణిని మార్చు కొని వీక్షకులకు, పాఠకులకు ధైర్యాన్ని, ఆశావహ దృక్పథాన్ని పంచాలి.

దుర్గాప్రసాద్‌ ఇల్లెందుల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సానుకూలతను పంచాలె

ట్రెండింగ్‌

Advertisement