e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home ఎడిట్‌ పేజీ అమూల్య జ్వాలా తోరణం

అమూల్య జ్వాలా తోరణం

బమ్మెర పోతనామాత్యుల శ్రీమద్భాగవతం, తెలుగులో కవిత్రయం వారి శ్రీమదాంధ్ర మహాభారతం, వాసుదాసు గారి (ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారి) ఆంధ్ర వాల్మీకి రామాయణం (మందరం ఆధారంగా) – ఈ మూడు మూలగ్రంథాలను కొద్దిరోజుల స్వల్ప వ్యవధిలో చదివి తెలుగులో జిజ్ఞాసువులయిన తెలుగు పాఠకులకు అందించగలిగానని మిత్రులు శ్రీ వనం జ్వాలా నరసింహారావు వివరించారు. భగవదనుగ్రహంవల్ల, ఏదో అదృశ్యశక్తి నడిపించడంతో అవలీలగా వీటిని ఇంత త్వరగా మూడు గ్రంథాలుగా వెలువరించగలిగారు.

రామాయణం, భారతం ఇతిహాసాలు, కావ్యాలు, భాగవతం సార్వజనీనమయినవి, సర్వకాలీనమయినవి. ఏ సాహిత్య ప్రక్రియలో ఉన్నప్పటికీ రామాయణం, భారతం, భాగవతం అందరినీ అలరించడం తథ్యం. అవి శాశ్వత విలువలు కలిగినవి.

అమూల్య జ్వాలా తోరణం
- Advertisement -

శ్రీమద్భాగవతం, శ్రీమదాంధ్ర మహాభారతం, వాల్మీకి రామాయణం రచనలను మూలానికి అనుగుణంగా, మధురమయిన, సరళమయిన వాడుక తెలుగు వచనంలో అందించడం అంత సులభం కాదు. ఉభయ భాషా వైదుష్యం, రచనా నైపుణ్యం, అసాధారణ భక్తి ప్రపత్తులు, మేధోమథనం ఉంటే తప్ప ఈ మహత్కార్యం సాధ్యపడదు. తెలుగు పాఠక లోకానికి జ్వాలా నరసింహారావు వినయపూర్వకంగా అందించిన మూడు గ్రంధాలు: 1) ’మహాకవి బమ్మెర పోతనామాత్య శ్రీ మద్భాగవత కథలు’, 281 పేజీలు, ప్రచురణ 2020 అక్టోబర్‌, 2) ’ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు’, 350 పేజీలు, ప్రచురణ 2021 మార్చి, 3) ’ఆస్వాదన-కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారత కథలు’, 474 పేజీలు, ప్రచురణ 2021 ఏప్రిల్‌. ఈ మూడు ఉద్గ్రంథాలు తెలుగుభాషా, వాఙ్మయ సరస్వతి మందిరానికి అమూల్య జ్వాలా తోరణం-సందేహం లేదు.

కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి మొదలైన వారికి సమకాలికుడు ఆంధ్ర వాల్మీకి, వాసుదాసు వావిలికొలను సుబ్బారావు. ఆయన సంస్కృత రామాయణంలో వాల్మీకి రచించిన 24 వేల శ్లోకాలను, 24 వేల పద్యాలుగా’ మందరం’ పేరిట, తాత్పర్య సహితంగా, మందార మకరందాలుగా తెలుగులోనికి అనువదించారు. ’మందరం’ ప్రభావం మిత్రుడు నరసింహారావు మీద ప్రసరించింది. ఈ ప్రభావం ఆయన ఈ మూడు గ్రంథాలను రచించడానికి స్ఫూర్తినిచ్చింది. మందర మకరందం రచన నాటికి వావిలి కొలను వయస్సు డెబ్బయి సంవత్సరాలు. ఆయన ఓపికకు మొక్కాలె. సమకాలిక కవులు, రచయితలు, పండితులు ఆధునికత ప్రభంజనంలో కొట్టుక పోతున్న తరుణంలో వావిలికొలను ప్రాచీనతకు ప్రతీక అయిన వాల్మీకి రామాయణంపై దృష్టిని ప్రసరింపజేయడం ఎదురీదడం వంటిది. మిత్రుడు నరసింహారావు గూడ ఏటికి ఎదురీదుతున్న సాహసవంతుడు. రాజుల్‌ మత్తులు వారి సేవ నరకప్రాయంబు’ అని ఒక అష్టదిగ్గజ కవి అన్నాడు. విజ్ఞులు అయిన, జనరంజక పాలన నడుపుతున్న రాజుల పాలకుల-సేవ స్వర్గప్రాయంబు అని జ్వాల ఈ గ్రంథత్రయ రచనతో నిరూపించారు.

శ్రీ జ్వాల రచించిన ‘ఆంధ్ర వాల్మీకి రామాయణం రసరమ్య గాథలు’ లోని 87 గాథలు, కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారత కథలులోని 156 కథలు, మహాకవి బమ్మెర పోతనామాత్య శ్రీమద్భాగవత కథలు లోని 89 కథలను కేవలం కథలు, గాథలు మాత్రమే అని చెప్పలేము. అవి వివిధ అంశాలను స్పృశించిన, విపులీకరించిన విజ్ఞాన మంజూషలు కావడం విశేషం. జ్వాల రచించిన రామాయణ గ్రంథంలో ఒక గాథ- ‘రాముడు దేవుడే’. కా ని, శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి వారి గురువు శ్రీమాన్‌ గోపాలాచార్యులు గారు చాల సంవత్సరాల క్రిందట ‘రాముడు మానవుడు’ అని ఒకచిన్న పుస్తకం (బుక్‌లెట్‌) రాసినట్లు జ్ఞాపకం. బహుశ వారిఅభిప్రాయం మారలేదనుకుంటాను.

కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ‘రామాయణ కల్పవృక్షం’ గ్రంథం రాసిన తరువాత ఒకరు ‘రాయడానికి రామాయణం తప్ప మరొకటి లేదా’ అని ప్రశ్నించారట. ‘చేసిన సంసారమే ఎందుకు చేస్తున్నారు?’ అని విశ్వనాథ ఎదురు ప్రశ్న వేసారట. విశ్వనాథను మాటల్లో ఢీకొనడం అసాధ్యం అని తెలుగు ప్రపంచానికి తెలుసు. రామాయణం, భారతం ఇతిహాసాలు, కావ్యాలు, భాగవతం సార్వజనీనమయినవి, సర్వకాలీనమయినవి. ఏ సాహిత్య ప్రక్రియలో ఉన్నప్పటికీ రామాయణం, భారతం, భాగవతం అందరినీ అలరించడం తథ్యం. అవి శాశ్వత విలువలు కలిగినవి. మా చిన్నప్పుడు మా ఊర్లో ప్రతిరోజు మధ్యాహ్నం మా అమ్మ స్త్రీల రామాయణ పాటలను చదివి విన్పించేది. అవి జానపదుల పాటలు. అమ్మ చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో దుఃఖాన్ని ఆపుకోలేకపోయే వాళ్లం. వేటూరి ఆనందమూర్తి కాలేజీలో తెలుగు పాఠం చెప్పుతూ రామాయణం నీతిని, భారతం రీతిని, భాగవతం భక్తిని ప్రబోధిస్తాయని అన్నారు. ఆత్మకూరు గోవిందాచార్యుల వారి రా మాయణానికి బూర్గుల రామకృష్ణారావు ఆంగ్లంలో రచించిన అద్భుత పీఠికను, సి.రాజగోపాలచారి రచించిన భారతం, రామాయణం ఆంగ్ల గ్రంథాలను, కె.ఎమ్‌.మున్షీ రచించిన ’కృష్ణావతార’ ఆంగ్ల సంపుటాలను, నం డూరి కృష్ణమాచార్యులు రచించిన భారతాన్ని (తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ) ఎన్నడూ మరచిపోలేను. భారత సంస్కృతికి, భారత ప్రాచీన సాహిత్య సంపదకు ప్రతీకలు, ప్రతిబింబాలు మిత్రుడు జ్వాలా రచించిన మూడు ఉద్గ్రంథాలు. ఇవి మూడూ మన ప్రాచీన భారత సాహిత్య సంపదకు మేడ్‌ ఈజీ (మార్గదర్శకం) వంటివి.

దేవులపల్లి ప్రభాకర రావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అమూల్య జ్వాలా తోరణం
అమూల్య జ్వాలా తోరణం
అమూల్య జ్వాలా తోరణం

ట్రెండింగ్‌

Advertisement