e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home ఎడిట్‌ పేజీ సామాజిక విప్లవం దిశగా..

సామాజిక విప్లవం దిశగా..

‘పామునకు బాలు, చీమకుఁ బంచదార/ మేపుకొనుచున్న కర్మభూమిఁ జనించు/ ప్రాక్తనంబైన ధర్మదేవతకుఁ గూడ/ నులికిపడు జబ్బు గలదు వీఁడున్న చోట’.. ‘వాని నుద్ధరించు భగవంతుఁడే లేఁడు/ మనుజుఁడెట్లు వాని కనికరించు/ వాఁడు జేసికొన్న పాపకారణమేమొ/ యింతవరకు వాని కెరుకలేదు’.. అంటూ దళితుల దైన్య పరిస్థితుల గురించి మహా కవి గుర్రం జాషువా ఎంతో ఆవేదన చెందారు. విషాదమేమంటే.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లకు అమృతోత్సవాలు జరుపుకొంటున్న శుభ ఘడియల నాటికి కూడా దళితుల పరిస్థితుల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకోలేదు. కుటిల రాజకీయ నినాదాల నడుమ వారు నిధులు లేని వంచితులుగా మిగిలిపోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అని కాకుండా, గత ఏడేండ్లలో దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం 55 వేల కోట్లను వెచ్చించింది. దళితుల సాధికారత, స్వావలంబన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమగ్ర కార్యాచరణను ప్రకటించటం హర్షణీయం.

ముఖ్యమంత్రి ఆదివారం ప్రకటించిన దళిత సాధికార పథకం సామాజిక విప్లవానికి దారితీసేదిగా ఉన్నది. ప్రతి నియోజకవర్గంలోని వంద కడు నిరుపేద దళిత కుటుంబాలను ఎంచుకొని ఒక్కొక్కరికి రూ. 10 లక్షల వంతున ఆర్థిక సహాయం ప్రకటించడం దేశ చరిత్రలోనే అపూర్వం. ఇందుకోసం నిర్వహణ ఖర్చులతో కలిపి 12 వందల కోట్లను ప్రకటించిన ముఖ్యమంత్రి, ఈ నిధులను మరింత పెంచడానికి సంసిద్ధతను వ్యక్తపరిచారు. గతంలో ప్రకటించిన పథకాలతో పోలిస్తే ఇది వినూత్నమైనది. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో ఏ ఉపాధి మార్గాన్ని ఎంచుకోవాలనేది లబ్ధిదారులే నిర్ణయించుకుంటారు. వారికి వివిధ స్వయం ఉపాధి అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం అందచేస్తుంది. ఆ తరువాత కూడా అడుగడుగునా సలహాలు ఇస్తూ, అవకాశాలు కల్పిస్తూ అండగా నిలుస్తుంది. ఇందుకోసం వచ్చే నాలుగేండ్లలో నలభై వేల కోట్ల వరకు వెచ్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌కు ఈ పథకం అదనం.

- Advertisement -

ఉద్యమ స్ఫూర్తితో దళితుల అభివృద్ధిని సాధించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి ఇందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 11 గంటలపాటు ఒక్కొక్కరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం బహుళార్థ సాధక బృహత్‌ పథకమైనా, వ్యవసాయ విధానమైనా, గ్రామీణ విప్లవమైనా కేసీఆర్‌ నిర్దిష్ట కార్యాచరణతో సఫలీకృతులవుతారనేది ఏడేండ్ల పాలన రుజువు చేసిన నిజం. అట్టడుగు వర్గాల నుంచి మొదలుపెట్టి సామాజిక విప్లవాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని ఇప్పుడు చేపట్టారు. ప్రభుత్వ యం త్రాంగం బాధ్యతతో వ్యవహరిస్తుందని, దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని చరిత్రాత్మక మార్పులో భాగస్వాములవుతారని ఆశిద్దాం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana