e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home ఎడిట్‌ పేజీ నాడు తాంబాళాలు.. నేడు గంగాళాలు

నాడు తాంబాళాలు.. నేడు గంగాళాలు

తెలంగాణ తల్లి ఎదమీదుగా ప్రవహిస్తున్నగోదావరి, కృష్ణ, పెన్‌గంగా, వార్ధా, ప్రాణహిత, కడెం, ఎర్రవాగు, పెద్దవాగు, సిద, సుద్దవాగు, రాలివాగు, వట్టివాగు, మానేరు, బొగ్గులవాగు, ఆలేరు, మున్నేరు, పాలేరు, కిన్నెరసాని, సలివాగు, వైరా, సంపెన్నవాగు, మున్నేరు, కిన్నెరసాని, శబరి, పాలేరు, ముక్కమామిడి వాగు, కొట్టలేరు, గుండ్లవాగు, మోడికుంట వాగు, మూసీ, దిండి, హాలియ, మంజీరా, పులాంగు, కల్యాణి, యడ్లకట్ట, కుట్లేరు, వాల్దీ, తుంగభద్ర, చినవాగు, మూసీ, జూటపల్లివాగు, పల్లి వాగు, కోటిపల్లి, ఈ నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లాలి. చెరువుల్లో జలసిరులు నిలవాలి. ప్రాజెక్టులు పూర్తయి తెలంగాణ మరింత సస్యశ్యామలం కావాలి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ మత్తడి పొయ్యని తెలంగాణ చెరువులు వేసవిలోనూ మత్తడి దుంకాయి. తెలంగాణలోని రైతు గుండె సంతోషంతో నిండింది. సాగు ఆరంభమైంది. తెలంగాణతో పాటు మా ఊరి చెరువు నవ్వింది.

నాడు తాంబాళాలు.. నేడు గంగాళాలు

చెరువుల పునరుత్తేజంతో వాటి ఆయకట్టులో ఉన్న ఎండిపోయిన బావులు, బోరు బావులు తిరిగి పునరుజ్జీవం పొందాయి. తెలంగాణ ఏర్పడేనాటికి భూమి నుంచి 11.88 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉంటే, ఇప్పుడు 3 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగి 8.88 మీటర్ల లోతున నీళ్లందుతున్నాయి. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 15.17 మీటర్లు, అత్యల్పంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1.81 మీటర్లు భూగర్భ జలమట్టం పెరిగినట్టుగా అధ్యయనాల్లో తేలింది.

- Advertisement -

ఉద్యమ సారథి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దానిలో భాగంగా 2015 మార్చి 12న మిషన్‌ కాకతీయ పథకాన్ని ప్రారంభించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 46,531 చెరువులను ఐదేండ్లలో దశలవారీగా పునరుద్ధరించారు. దీనికోసం రూ.22,500 కోట్లు ఖర్చుచేశా రు. దీనిద్వారా దాదాపు 265 టీఎంసీల నీటిని నిల్వ చేసి, 25 లక్షల హెక్టార్ల భూమికి సాగునీటి సౌకర్యం కల్పించారు.

సీమాంధ్ర పాలకుల హయాంలో చెరువులు కుట్రపూరితంగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. చెరువులన్నీ శిథిలావస్థకు చేరుకొని తెలంగాణలో వ్యవసా యం దెబ్బతిన్నది. మళ్లీ చెరువులకు పూర్వకళ వస్తే తప్ప గ్రామాలు బాగుపడవని, చెరువులను పునరుద్ధరించుకోవడమే మార్గమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావించారు. అందుకే ‘మిషన్‌ కాకతీయ’ పథకంతో చెరువుల పునరుద్ధరణను ప్రారంభించి పూర్తిచేశా రు. దీంతో తెలంగాణలోని వేలాది చెరువులకు పునరుజ్జీవం వచ్చింది. నాడు ‘తాంబాలాలు’గా ఉన్న చెరువులు నేడు ‘గంగాళాలు’గా తయారయ్యాయి.

రాష్ట్రం ఏర్పడకముందు పదేండ్లలో 23 జిల్లాలకు కలిపి 94 వేల కోట్లు సాగునీటి రంగానికి ఖర్చు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బడ్జెట్‌లో సాగునీటి రంగానికి 2021 నాటికి రూ.1,72,371.77 కోట్లు కేటాయించింది. దీంతో భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల రంగాలకు నిధుల వరద పారింది. ఫలితం తెలంగాణలో జలసిరులు ఉప్పొంగుతున్నాయి. తెలంగాణ ఏర్పడే నాటికి చెరువుల కింద సాగు విస్తీర్ణం ఐదు లక్షల హెక్టార్లు కాగా, నేడు స్థిరీకరించబడిన సాగు విస్తీర్ణంతో కలిపితే చెరువుల కింద సాగవుతున్న భూ విస్తీర్ణం 25 లక్షల హెక్టార్లకు చేరింది. పూర్తిస్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావటం, ప్రాజెక్టుల కాల్వలను చెరువులకు అనుసంధానించడంతో సాగు విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉన్నది.

చెరువుల పునరుత్తేజంతో వాటి ఆయకట్టులో ఉన్న ఎండిపోయిన బావులు, బోరు బావులు తిరిగి పునరుజ్జీవం పొందాయి. తెలంగాణ ఏర్పడేనాటికి భూమి నుంచి 11.88 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉంటే, ఇప్పుడు 3 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగి 8.88 మీటర్ల లోతున నీళ్లందుతున్నాయి. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 15.17 మీటర్లు, అత్యల్పంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1.81 మీటర్లు భూగర్భ జలమట్టం పెరిగినట్టుగా అధ్యయనాల్లో తేలింది. మిషన్‌కాకతీయ ప్రభావంతో గతంలో కంటే వరి ఎకరానికి 3.32 క్వింటాళ్ల దిగుబడి పెరిగితే, పత్తి 3.79 క్వింటాళ్లు, పసుపు 5 క్వింటాళ్లు, మక్కజొన్న 6.08 క్వింటాళ్లు, మిర్చి 7.13 క్వింటాళ్ల దిగుబడి పెరిగింది. అంతే కాకుండా పూడికమట్టిని చల్లుకున్న రైతులకు పంట ల దిగుబడిలో పెరుగుదల నమోదైంది.

సీఎం కేసీఆర్‌ తెలంగాణ నుంచి ఏటా 11 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా 5 వేల కోట్ల ఆదాయం రాష్ర్టానికి సమకూరాలని నిశ్చయించుకున్నారు. దానిలో భాగంగా ప్రభుత్వమే ఉచితంగా చేపపిల్లలను అందిస్తున్నది. గడిచిన రెండేండ్లలో రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో 100 కోట్ల చేప పిల్లల్ని వేయడం ద్వారా 4 లక్షల టన్నుల మత్స్య సంపద వృద్ధి చెందింది. తద్వారా దాదాపు 4 వేల కోట్ల విలువైన మత్స్య సంపద సృష్టి జరిగింది. ఉమ్మడి పాలనలో విచ్ఛిన్నమైన నీటి వ్యవస్థలను బాగుచేసి, యావత్‌ తెలంగాణలోని చెరువులన్నీ 365 రోజుల పాటు నీటితో కళకళలాడాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం అనే కొత్త కార్యక్రమం చేపట్టింది. ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్టుల కాల్వలను చెరువులకు అనుసంధానం చేస్తారు.

గొలుసుకట్టు చెరువుల్లోని మొదటి చెరువు నుంచి చివరి చెరువు దాకా పూర్తిగా నిండేవరకు కాల్వ ద్వారా ప్రాజెక్టుల నీళ్లందుతాయి. ఇప్పటికే ఎస్సారెస్పీ ద్వారా ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలోని కొంత భాగంలోని గ్రామాల్లోని చెరువులను గోదావరి జలాలతో నింపింది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎండకాలంలోనూ గ్రామాల్లోని చెరువుల్లో నీళ్లు తొణికిసలాడుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయలో చెరువుల్లోని పూడికలు తీయించింది. నీటి నిల్వ సామర్థ్యం పెరిగేలా చేసింది. అలాగే ప్రతీ నియోజవర్గంలోని ఒక పెద్ద చెరువును హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లా మౌలిక వసతులు కల్పించి స్థానికంగా పర్యాటక ప్రాంతాలుగా చెరువులను అభివృద్ధి చేసింది. చెరువులు పర్యాటకంగా ఆకట్టుకుంటున్నాయి. వాటిలో పాకాల, లక్నవరం, సిద్దిపేట చెరువులు అగ్రస్థానం లో ఉన్నాయి. మిషన్‌ కాకతీయ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పొగడటం ఒకెత్తయితే, ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశంగా ఈ పథకాన్ని చేర్చాయి. తెలంగాణ కోసం ఏ విధంగా సబ్బండ వర్గాలు సమరం చేశాయో, అదేరీతిలో ఫలాలను పొందుతున్నాయి. ముఖ్యం గా పునరుజ్జీవం పొందిన చెరువులు అందరికీ ఆదెరువు అవుతున్నాయి.
(వ్యాసకర్త: ఫ్యాకల్టీ, పభుత్వ పాలనా శాస్త్రం, కాకతీయ విశ్వ విద్యాలయం)

డాక్టర్‌ పుల్లా శ్రీనివాస్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాడు తాంబాళాలు.. నేడు గంగాళాలు
నాడు తాంబాళాలు.. నేడు గంగాళాలు
నాడు తాంబాళాలు.. నేడు గంగాళాలు

ట్రెండింగ్‌

Advertisement