నిరతము సుప్త భావనల
నీరస మొంది జఢత్వ చిత్తులై
వరలెడు జాతి జాఢ్యతను
బాపగ ప్రేరణ నిచ్చి యెంతయేన్
వర రుచిర ప్రకాశమున వాడిని
వేడిమి నింపుచున్ ప్రజన్
స్థిరమతి నుద్యమాధ్వమున జేర్చు ప్రయత్న మదెంత గొప్పదో!
నిధులు నుద్యోగాలు నీరంబులను దోచి
ఆధిక్యమును జూపు చనవరతము
తెలగాణ భాషను తెలగాణ యాసను
అపహాస్యమును సేయు నల్ప మతులు
సలుపు అన్యాయంబు
సహియింప రాదంచు
వివరించి తెలియని విషయములను
చైతన్య వంతులై సబ్బండ వర్గాలు
ఉత్సాహ మేపార నుద్యమింప
ప్రథిత తెలగాణ గడ్డపై ప్రజల కొరకు
వెలిసె నాత్మ గౌరవ దీప్తి వివృతి గనగ
నదె, నమస్తే తెలంగాణ యనగను దిన
పత్రిక వివక్ష బాయంగ పాటుపడుగ!
అలసత్వ చిత్తులౌ తెలగాణ ప్రజలను
చైతన్య పరచి విశ్వాస మిచ్చి
ఎక్కడెక్కడ తమ హక్కులు భంగమై
పోయెనో వివరించి న్యాయ పథము
నందు ప్రేరణ నిచ్చి అనిశంబు నండయై
యూపిరులూదుచు నుద్యమమున
ప్రత్యేక రాష్ట్రమే భద్రంబు మనకన్న
దివ్య నినాదంబు దిసల నిండ
యొక్క త్రాటిపై ప్రజలెల్ల చక్క నిలిచి
భవ్య తెలగాణ సంస్కృతీ ప్రభలు వెలయ
నిత్య సాధనా జ్యోతియై నిలిచి నట్టి
పత్రికకు గడిచెను పది వత్సరములు!
ఎందరి కార్య దక్షతయొ,
యెందరు వీధుల నుద్యమించిరో,
యెందరి త్యాగమో,
ప్రజల కెంతటి నిష్ఠయొ, దీక్షలెన్నియో
యెందరి యోజనా పటిమ
యెంతగ నుద్యమ దీప్తి బంచెనో,
యందరి కన్ని రూపముల
నందగ జేసెను మేటి పత్రికై!
శుభము దశవసంతాలను చూచి నట్టి
పత్రికకు, మంగళము ప్రజా పక్షమందు
నిలిచి దిక్సూచియై సదా నిలుచునట్టి
పత్రికకు అమరుగాక శాశ్వత యశస్సు!
పాలకుర్తి రామమూర్తి
7330923552