e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home ఎడిట్‌ పేజీ ఏడేండ్ల విజయ ప్రస్థానం

ఏడేండ్ల విజయ ప్రస్థానం

ఏడేండ్ల విజయ ప్రస్థానం


‘ఓ తెలంగాణ! నీ పెదవులొత్తిన శంఖ మహారవమ్ము లీ/ భూతల మెల్ల నొక్క మొగి బొబ్బలు పెట్టిన యట్లు తోచె; ఓ/హో! తెలవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు నవోదయార్క రుక్‌/ప్రీత జలేజ సూన తరళీకృత దేవ నదీ తరంగముల్‌..’ అంటూ నాటి మహోజ్వల మార్పును సూచించాడు మహాకవి దాశరథి. ‘తల్లీ నీ ప్రతిభా విశేషములు భూత ప్రేత హస్తమ్ములన్‌/డుల్లెన్‌ కొన్ని తరాల దాక! ఇపుడడ్డుల్‌ వోయె సౌదామినీ/వల్లీ పుల్ల విభావళుల్‌ బ్రతుకు త్రోవల్‌ చూపు కాలమ్ములున్‌/మళ్ళెన్‌! స్వచ్ఛతరోజ్జల ప్రథమ సంధ్యా భాను వేతెంచెడిన్‌’ అన్నట్టుగా… సరిగ్గా ఏడేండ్ల కిందట దుష్ట శక్తులను తరిమి కొట్టాం. తెలంగాణ వీర భూమిపై వెలుగు రేకులు పరచుకున్న సుదినమిది. ‘తెలంగాణమ్మున గడ్డిపోచయున్‌ సంధించెన్‌ కృపాణమ్ము’ అన్నట్టు తెలంగాణ బిడ్డల వీరత్వం అసమానమైనది. ఈపరి కృపాణమ్ము సంధించకనే, మహాత్ముడి బాటలో ధీశక్తితో తెలంగాణను విముక్తి చేసుకోగలిగాము.

తెలంగాణ స్వపరిపాలనను సాధించడమే కాదు, సస్యశ్యామలం చేసుకున్నామని గర్వంగా చెప్పుకోగలం. ఈ ఏడేండ్లలో ఎన్నని సాధించలేదు! ప్రపంచమంతా పట్టణాల వెంట పరుగులు పెడుతుంటే, మనం పల్లెపట్టులను భాగ్యసీమలుగా మార్చుకోలేదా! లక్షల కోట్ల రూపాయలు పల్లెల్లో ప్రవహించడంతో తెలంగాణలో గ్రామీణ విప్లవం ఆవిష్కృతం కాలేదా! కుల వృత్తుల పట్ల చిన్నచూపు చూస్తున్న వేళ, నిపుణులైన ఆ పల్లె బిడ్డలు కూడా మానవ వనరులేనని గుర్తించి ప్రోత్సహించలేదా! పాలమూరు బిడ్డలు వలస పోయే ముంబయి బస్సులు మూతపడ్డాయనేది వాస్తవం కాదా! అన్నం కూరలు కూడా కొలిచి కొలిచి పెట్టే, వసతి గృహాల పిల్లలు సగం కడుపు తినే పాడుకాలం మాయమైంది. మంచినీటి కోసం మైళ్ళు నడిచే కాలం పోయి, గంగమ్మ ఇంటి ముందుకు ప్రవహిస్తున్నది. గురుకులాలలో రాటు దేలిన తెలంగాణ బిడ్డలు హిమశిఖరాలు అధిరోహిస్తున్నారు. ధరణి, భూ సర్వేలతో అన్నదాతల భూమికి భరోసా వచ్చింది. రైతు బంధుతో వ్యవసాయదారులకు ధీమా ఏర్పడింది. వ్యవసాయ సంక్షోభం ముగిసి రైతుల సంక్షేమం నెలకొనడం దేశ చరిత్రలోనే అపూర్వ ఘట్టం.

కాలం ఒక్కరీతిలో సాగదు, అప్పుడప్పుడూ అగ్ని పరీక్షలు పెడుతుంది. కరోనా ఊహించని కొత్త రకం విపత్తు. మానవాళినంతనూ పీడించినట్టే తెలంగాణనూ వదలలేదు. అయితేనేం తెలంగాణ సమాజం ధైర్యం కోల్పోలేదు. కరోనా పొంచి ఉన్నప్పుడే మన దేశంలో కలవరం మొదలైంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందే ధైర్యం నూరిపోసి ప్రజలను మానసికంగా సిద్ధం చేశారు. వైద్య వ్యవస్థను ఇంకా ముందే పటిష్ఠం చేయడం కూడా కలిసొచ్చింది. మనం బోర్లా పడితే నవ్వడానికి ఇతరులు సిద్ధంగా ఉంటారు. అటువంటి వారిని పట్టించుకోవద్దు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఏ కష్టమొచ్చినా మన ప్రభుత్వం మనలను కంటికి రెప్పలా చూసుకుంటుందనే విశ్వాసాన్ని వీడవద్దు. ‘నాడును నేడును తెలంగాణ మోడలేదు/ శత్రువుల దొంగదాడికి శ్రావణాభ్ర/ మటుల గంభీర గర్జాట్టహాసమలరు/ నా తెలంగాణ పోవుచున్నది పథాన..’ అన్నట్టు ఈ విజయ ప్రస్థానం కొనసాగిద్దాం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఏడేండ్ల విజయ ప్రస్థానం

ట్రెండింగ్‌

Advertisement