e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home ఎడిట్‌ పేజీ దేశంలోనే మేటి మన ఐటీ

దేశంలోనే మేటి మన ఐటీ

దేశంలోనే మేటి మన ఐటీ

తెలంగాణ ప్రగతి రథచక్రాల వేగాన్ని కరోనా సంక్షోభం స్పీడ్‌బ్రేకర్‌ వలె ఆపగలిగింది. కానీ పూర్తిగా బ్రేకులు వేయలేకపోయింది. కరోనా విలయాన్ని ఎదుర్కోవడంలో మన రాష్ట్రం ముందుండటమే కాకుండా, అభివృద్ధిని ఎక్కడా ఆగనీయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆలోచనా విధానంతో రాష్ట్ర ప్రగతి వేగంగా సాగుతున్నది. చాలా రాష్ర్టాల్లో వ్యవసాయరంగం క్షీణిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు పురోగమిస్తున్నాయి. కరోనా, లాక్‌డౌన్‌ల కారణంగా దేశం ఆర్థికంగా విపత్కర పరిస్థితుల్లో ఉన్నది. 40 ఏండ్ల కనిష్ఠానికి జీడీపీ పడిపోయిందని లెక్కలు చెప్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం నిలదొక్కుకుంది. దేశ సగటుతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ, జీఎస్డీపీలోనూ తెలంగాణ మెరుగ్గానే ఉంది.

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి తెలంగాణ ఐదు శాతం అందించింది. 2019-20లో ఇది 4.74 శాతంగా ఉండేది. మన దేశ ఆర్థికవ్యవస్థకు కరోనా తీవ్ర నష్టం చేసింది. ఈసారి జీడీపీ పెరగకపోగా మైనస్‌ 7.3గా వృద్ధిరేటు నమోదైంది. కానీ తెలంగాణలో లాక్‌డౌన్‌ పెట్టినప్పటికీ జీఎస్డీపీ 1.26 శాతం మాత్రమే తగ్గింది. జాతీయ తలసరి ఆదాయం ఈసారి 4.8 శాతం క్షీణించింది. కానీ మన రాష్ట్రం 0.61 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. ఈసారి తలసరి ఆదాయాన్ని వృద్ధి చేసుకున్న అతి కొన్ని రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే మన రాష్ట్ర తలసరి ఆదాయం 1.78 రెట్లు ఎక్కువ.

- Advertisement -

దేశం నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. కానీ మన రాష్ట్రంలో ఈ సమస్య ఎక్కువగా లేదు. తెలంగాణలో అన్నిరంగాలు అభివృద్ధి చెందుతున్నందున, కొత్త పెట్టుబడులు వస్తున్నందున ఉపాధి కల్పన పెరిగింది. కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం వారే కాకుండా, ఇతర రాష్ర్టాల వారు కూడా ఉపాధి కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఉద్యోగాల కల్పనలో జాతీయ సగటు 2 శాతం ఉంటే మన రాష్ట్ర వృద్ధి రేటు 8 శాతంగా ఉన్నది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయరంగంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. సంక్షేమ పథకాలతో రైతులకు కావాల్సిన ఆర్థిక తోడ్పాటును అందించారు. ప్రాజెక్టుల ద్వారా పొలాల్లోకి నీరు పారించారు. మద్దతు ధరలు పెంచుతూ రైతులకు భరోసా ఇచ్చారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అపూర్వ ప్రగతి సాధించింది. 2020-21లో రాష్ట్ర వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ఏకంగా 20.9 శాతం వృద్ధిరేటును నమోదు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అధికం. జాతీయంగా చూస్తే ఈ రంగం మూడు శాతం మాత్రమే వృద్ధిరేటు సాధించింది. అంటే మన రాష్ట్రం జాతీయ వృద్ధి కంటే దాదాపుగా ఏడు రెట్లు ఎక్కువ సాధించింది.

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కొత్త పరిశ్రమల ద్వారా 7 లక్షల మందికి పైగా ఉపాధి పొందారు. మరో ఏడు లక్షల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. దేశానికి ఐటీ హబ్‌గా ఎదుగుతున్నందున యువతకు హైదరాబాద్‌ గమ్యస్థానంగా మారుతున్నది.

మంత్రి కేటీఆర్‌ కృషి వల్ల రాష్ట్రంలో ఐటీరంగం అద్భుతంగా వృద్ధి చెందుతున్నది. 2014లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లుగా ఉండేవి. 2020-21లో రూ.1,45,522 కోట్లకు చేరాయి. ఈ పెరుగుదల గతేడాది కన్నా 13 శాతం ఎక్కువ. 2014లో రాష్ట్రంలో 3.2 లక్షల మంది ఐటీ రంగ ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు ఈ సంఖ్య 6.28 లక్షలకు పెరిగింది. గతేడాదే కొత్తగా సుమారు 46 వేల మంది ఐటీ రంగంలో ఉపాధి పొందారు. ఐటీని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ఇతర ముఖ్య నగరాలకు కూడా విస్తరించేందుకు మంత్రి కేటీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. రాష్ర్టానికి ఉన్న సానుకూల పరిస్థితులు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని వివిధ అంతర్జాతీయ సంస్థలకు వివరించడంలో కేటీఆర్‌ విజయవంతమవుతున్నారు. ఫలితంగా మన రాష్ట్రంలో కొత్త ఐటీ, అనుబంధ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి. అమెజాన్‌ కొత్తగా డాటా సెంటర్‌ ప్రారంభిస్తున్నది. సెల్ఫ్‌సోర్స్‌, గోల్డ్‌మెన్‌ సాక్స్‌, ఒప్పో, ఫియట్‌ వంటి సంస్థలు కూడా హైదరాబాద్‌కు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. టీ హబ్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నది. హైదరాబాద్‌ నుంచి కొత్త ఐడియాలతో ఎన్నో స్టార్టప్స్‌ పుంజుకున్నాయి. వీహబ్‌ను స్థాపించిన ప్రభుత్వం వ్యాపారవేత్తలుగా మహిళలు మారడానికి ప్రోత్సహిస్తున్నది.

పరిశ్రమలను, కొత్త పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. సులభతర వాణిజ్య విధానంలో భాగంగా టీఎస్‌ఐపాస్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన పరిస్థితులను ప్రపంచానికి చాటిచెప్పింది. దీంతో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరుపుతూ పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా సుమారు 12 వేల యూనిట్లు ప్రారంభమయ్యాయి. మరో 3 వేల యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ఏ ప్రాంతాలు అనువుగా ఉన్నాయో గుర్తించిన ప్రభుత్వం కొత్తగా ఇండస్ట్రియల్‌ పార్కులను ఏర్పాటుచేస్తోంది. గతేడాది 10 ఇండస్ట్రియల్‌ పార్కులను అభివృద్ధి చేసింది. ఎంఎస్‌ఎంఈలను సైతం ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. చాలామంది ప్రజలు ఆధారపడిన చేనేత రంగానికి జీవం పోసిన రాష్ట్ర ప్రభుత్వం టెక్స్‌టైల్‌ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నది. ఫార్మా రంగం వేగంగా వృద్ధి చెందుతున్నది. ఫార్మా హబ్‌గా తెలంగాణ మారింది.

చదువు పూర్తిచేసుకున్న యువత హైదరాబాద్‌ బాట పడుతున్నారు. తెలంగాణ ఐటీ రంగంలో ఏటా పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఐటీ, పారిశ్రామిక, అనుబంధరంగా ల్లో రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి సుమారు 15 లక్షల మంది కొత్తగా ఉపాధి పొందారు.
(వ్యాసకర్త: అదనపు కమిషనర్‌, జీహెచ్‌ఎంసీ)

డాక్టర్‌ ఎన్‌.యాదగిరిరావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దేశంలోనే మేటి మన ఐటీ
దేశంలోనే మేటి మన ఐటీ
దేశంలోనే మేటి మన ఐటీ

ట్రెండింగ్‌

Advertisement